ఆర్టీఏ అధికారిపై ట్రావెల్స్ యజమాని దాడి
కర్నూలు: ప్రైవేటు ట్రావెల్ యజమానుల ఆగడాలకు హద్దులేకుండా పోతోంది. తనిఖీలు చేస్తున్న ట్రాన్స్పోర్ట్ అధికారులపై దాడులకు కూడా వెనుకాడటంలేదు. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద తనిఖీ చేస్తున్న ఆర్టీఏ అధికారి శివరామకృష్ణపై ప్రొద్దుటూరుకు చెందిన శ్రీలక్ష్మీ ట్రావెల్స్ యజమాని దాడి చేశాడు. ఆర్టీఏ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ప్రైవేటు బస్సుల యజమానులు ఇటీవల కాలంలో అక్రమంగా బస్సులను తిప్పడం ఎక్కువైపోయింది. బస్సు ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. దాంతో ఆర్టీఏ అధికారులు ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అయితే ప్రైవేటు బస్సుల యజమానులు, డ్రైవర్లు కూడా ఆర్టీఏ అధికారులు, సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ ఆర్టీఏ ఉద్యోగి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అతనిని గాయపరిచాడు.