Pulmonology counseling
-
రాత్రిళ్లు విపరీతంగా దగ్గు వస్తోంది సలహా ఇవ్వండి
మా పాప వయసు ఆరేళ్లు. తరచూ జలుబు చేస్తుంటుంది. మందులు వాడితే కాస్త తగ్గినట్టే అనిపించి మళ్లీ తిరగబెడుతోంది. ఇలా దాదాపు నెలకొకటి రెండుసార్లు జలుబు బారిన పడి, చాలా బాధపడుతోంది. మాకు భయంగా ఉంటోంది. భవిష్యత్తులో ఆస్తమా వస్తుందా? లంగ్ పని తీరు మీద ఏదైనా ప్రభావం ఉంటుందా? దయచేసి సలహా ఇవ్వండి. – ఆర్. నళిని, కందుకూరు చిన్నపిల్లల్లో జలుబు సాధారణమే. కానీ, అలర్జీ వల్ల వచ్చే జలుబు సాధారణం కాదు. దీనిని నిర్లక్ష్యం చేస్తే అది ఆస్తమాకు దారితీయవచ్చు. అందుకే ప్రాథమిక దశలోనే లక్షణాలకు కాకుండా, వ్యాధికి చికిత్స అందిస్తే అలర్జీ... ఆస్తమాకి మారే అవకాశం ఉండదు. సాధారణంగా జలుబు 3–4 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ అలర్జీ వల్ల వచ్చే జలుబు పదిరోజులైనా తగ్గదు. ఇది గుర్తుంచుకోండి. ముక్కు నుంచి పసుపు లేదా ఆకుపచ్చ స్రావం కారుతుంటే ఇన్ఫెక్షన్ వల్ల అది వచ్చినట్లు భావించాలి. అలాకాకుండా తెల్లగా వస్తుంటే అది అలర్జీ వల్ల వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. అలర్జీ వల్ల తుమ్ములు, పొడిదగ్గు, గొంతునొప్పి సైతం ఉంటాయి. మీరు చెప్పిన అంశాలను బట్టి మీ పాపవి అలర్జీ లక్షణాలే అనిపిస్తున్నాయి. దీనితో పాటు కళ్ల నుంచి నీరు, ముక్కు మూసుకుపోయినట్లుంటే అది అలర్జిక్ రైనైటిస్ తాలూకు లక్షణంగా పరిగణించాలి. మీలాగే చాలామంది జలుబు చేయగానే పిల్లలను డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు ఇప్పిస్తారు. దాని వల్ల జలుబు తాత్కాలికంగా తగ్గిపోతుంది. కానీ తరచూ జలుబు చేస్తుంటే అది ‘అలర్జిక్ రైనైటిస్’ అని అర్థం చేసుకోవాలి. లక్షణాలకు మాత్రమే చికిత్స తీసుకుంటూ పోతే లోపల వ్యాధి పెరిగిపోతుంది. అలా కాకుండా వ్యాధికి చికిత్స తీసుకుంటే అది పూర్తిగా తగ్గిపోతుంది. మీరు ఆలస్యం చేయవద్దు. అలా చేస్తే అది ఆస్తమాకు దారితీస్తుంది. ఇలాంటి సమయల్లో డాక్టర్ పర్యవేక్షణ లేకుండానే చాలామంది విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం, నిబ్యులైజర్ పెట్టించడం చేస్తున్నారు. మీరు మీ పాపను వెంటనే మీకు దగ్గర్లోని డాక్టర్‌కు చూపించండి. దీర్ఘకాలికఆస్తమాకు ఏదైనాపరిష్కారం ఉందా? మా నాన్నగారి వయసు 58 ఏళ్లు. నా చిన్నప్పటి నుంచి అంటే... గత 30 –35 ఏళ్లుగా ఆయన ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆయన పడుతున్న బాధ మేం కుటుంబ సభ్యులం చూడలేకపోతున్నాం. అన్ని రకాల స్టెరాయిడ్స్, టాబ్లెట్స్, ఇన్హేలర్స్ వాడినా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ తీవ్రమైన ఆస్తమాకు ఏదైనా శాశ్వత పరష్కారం ఉందా? దయచేసి వివరంగా చెప్పండి.– ఎమ్. పరమేశ్వరరావు, చీరాల దేశవ్యాప్తంగా రెండు కోట్లమందికి పైగా ఆస్తమాతో బాధçపడుతున్నారు. ఏటికేడాదీ మరింత మంది దీని బారిన పడుతున్నారు. ఇతరత్రా పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా కేవలం ఈ దీర్ఘకాలిక ఆస్తమా తీవ్రతతో తమ వృత్తి, ఉద్యోగాలలో అనుకున్నంతగా రాణించలేక అసంతృప్తికి గురవుతుంటారు. అన్ని వయసుల వారినీ జీవితకాలం వెంటాడే ఆస్తమా... పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, మారుతున్న జీవినశైలిలోని లోటుపాట్ల కారణంగా ఇంకా ఎక్కువగా విస్తరిస్తోంది. దాంతో వ్యాధిగ్రస్తుల సంఖ్య మరింత పెరుగుతోంది. అయితే గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలతో ఆస్తమాను అదుపు చేయడానికి గతం కంటే మెరుగైన చికిత్స విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. దాంతో ఇదివరకటిలా స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం, వాటితో కలిగే ముప్పు తొలగిపోతున్నాయి. ఇలాంటి చికిత్సల్లో అత్యాధునికమైనది బ్రాంకియల్ థర్మోప్లాస్టీ అనే ప్రక్రియ. తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతున్నవారికి పూర్తి ఉపశమనం ఇవ్వగల మేలైన చికిత్సగా ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ఇది ఇప్పుడు మన దేశంలోనూ లభ్యమవుతోంది. ఈ ప్రక్రియలో ఒక ప్రత్యేక పరికరం (ప్రోబ్)ను ఉపయోగించి శ్వాసనాళపు గోడలను వేడిచేస్తారు. బ్రాంకోస్కోప్ ద్వారా వెళ్లే ఈ ప్రోబ్ అందించిన వేడిమితో శ్వాసమార్గంలో చేరిన అదనపు మ్యూకస్ తొలగిపోతుంది. అంతేకాదు శ్వాసమార్గం విశాలంగా తెరచుకుంటుంది. ఈ ప్రక్రియను మూడేసి వారాలకు ఒకసారి చొప్పున మూడు దఫాలు నిర్వహిస్తారు. ఈ మూడు దఫాల చికిత్స ప్రక్రియ పూర్తయ్యేసరికి తీవ్రమైన ఆస్తమా లక్షణాలు బాగా తగ్గిపోతాయి. చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వ్యక్తుల జీవననాణ్యత కూడా బాగా మెరుగుపడుతుంది. అటాక్స్ సంఖ్య, అటాక్స్ కారణంగా ఆసుపత్రిలో చేర్చాల్సి రావడం తగ్గిపోతుంది. ఈ చికిత్సప్రక్రియ ప్రభావం చాలాకాలం పాటు (అంటే కనీసం ఎనిమిదేళ్లపాటు) నిలిచి ఉంటుంది. పద్ధెనిమిది ఏళ్లు నిండి, ఇన్‌హేలర్స్‌తో కూడా ప్రయోజనం కనిపించని వారు ఈ ప్రక్రియను ఎంచుకోవచ్చు. మీరు ఒకసారి మీకు దగ్గర్లో పెద్ద వైద్యచికిత్స కేంద్రం (మెడికల్ సెంటర్)లో పల్మునాలజిస్టులను సంప్రదించి, ఈ చికిత్స తీసుకోవచ్చు. రాత్రిళ్లువిపరీతంగాదగ్గు వస్తోంది...సలహా ఇవ్వండి నా వయసు 36 ఏళ్లు. ఉద్యోగంలో భాగంగా నేను రోజుకు దాదాపు100 కిలోమీటర్ల దూరం బైక్‌పై ప్రయాణం చేస్తుంటాను. విపరీతమైన రద్దీలో, కాలుష్యంలో తిరగడం అన్నది నా వృత్తిపరంగా తప్పడం లేదు. దీనికి తోడు స్మోకింగ్ కూడా బాగా అలవాటు ఉంది. కొన్నేళ్లుగా తరచూ జలుబు, దగ్గుతో బాధపడుతున్నాను. ముఖ్యంగా రాత్రివేళ దగ్గు తీవ్రంగా వస్తోంది. ఊపిరి కూడా ఆడటం లేదు. ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా, ఎన్ని మందులు వాడినా నా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో సలహా చెప్పండి.– ఆర్. సుభాష్, సనత్‌నగర్, హైదరాబాద్ మీరు తరచూ జలుబు, దగ్గు, ఊపిరాడని సమస్యలతో బాధపడుతున్నారంటే... మీ శ్వాసనాళాలు (ముక్కు నుంచి ఊపిరితిత్తులకు గాలిని మోసుకుపోయే గొట్టాలు) రోగగ్రస్తం అయినట్లుగా సూచిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణాలు రెండు. మొదటిది మీ స్మోకింగ్ అలవాటు. రెండోది ఉద్యోగరీత్యా మీరు ప్రతినిత్యం ఎదుర్కొంటున్న వాతావరణ కాలుష్యం. ఇప్పటివరకు ఎంతోమంది డాక్టర్లను కలిశానన్నారు. ఎన్నోరకాల మందులు వాడారన్నారు. కానీ మీ సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటైన స్మోకింగ్‌ను మాత్రం విడిచిపెట్టలేదు. కాబట్టి స్మోకింగ్ పూర్తిగా మానేయడం మీ చికిత్సలో తొలిమెట్టు. సిగరెట్‌పొగలో ఊపిరితిత్తులు, శ్వాసమార్గాలను ధ్వంసం చేసే విషతుల్యమైన రసాయనాలు కోకొల్లలుగా ఉంటాయి. అవి ఊపిరితిత్తులకు సహజసిద్ధంగా ఉండే రక్షణ వ్యవస్థ మొత్తాన్ని ధ్వంసం చేస్తాయి. స్మోకింగ్ కారణంగా శ్వాసమార్గాలు గట్టిపడిపోయి గాలి వెళ్లే దారులన్నీ సన్నబడిపోతాయి. అందువల్ల చీమిడి అధికంగా ఉత్పత్తి జరిగి దగ్గు, ఊపిరాడని పరిస్థితికి దారితీస్తుంది. మీ అంతట మీరే స్మోకింగ్ అలవాటు మానలేకపోతే దాన్ని మాన్పించడానికి అవసరమైన మందులు ఉన్నాయి. వాటిని వాడటం వల్ల సిగరెట్ తాగాలన్న కోరిక క్రమేపీ సన్నగిల్లుతుంది. ఇక రెండోది వాతావరణ కాలుష్యం. మానవ శరీరంలోకి ప్రధానద్వారం (గేట్ వే) వంటివి ఊపిరితిత్తులు. వాతావరణంలో ఉండే సల్ఫర్‌డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి కాలుష్యాలను పీల్చడం వల్ల... ముఖ్యంగా మీ విషయంలో ఇవి చాలా ప్రమాదకర స్థాయికి చేరినట్లుగా అనిపిస్తోంది. కాబట్టి ట్రాఫిక్ లేని సమయంలో, రద్దీ తక్కువగా ఉండే మార్గాలలో ప్రయాణించడం, వీలైతే బైక్‌పై ప్రయాణాన్ని మానుకోవడం ద్వారా కాలుష్యం బారినుంచి కాపాడుకోవచ్చు. ఇక మీ ప్రస్తుత సమస్యకు మూలాలు ఎక్కడున్నాయో కనుక్కోవాలి. అందుకోసం మీరు ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లి చెస్ట్ ఎక్స్‌రే, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించుకోండి. వాటి ఫలితాలను బట్టి చికిత్స ప్రారంభిస్తారు. అయితే కేవలం మందులతో మాత్రమే కాకుండా మీ జీవనశైలిలో కొన్ని మార్పులు కూడా చికిత్సలో భాగమైనప్పుడు మాత్రమే ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్న వాస్తవాన్ని గ్రహించండి.-డాక్టర్ కె. యుగవీర్ గౌడ్,సీనియర్ పల్మునాలజిస్ట్ అండ్చెస్ట్ ఫిజిషియన్,యశోద హాస్పిటల్స్, మలక్పేటహైదరాబాద్ -
పల్మనాలజీ కౌన్సెలింగ్
గురకవస్తోంది... మర్నాడంతా మగతగా ఉంటోంది నా వయసు 56 ఏళ్లు. రాత్రిళ్లు ఒక్కోసారి శ్వాస అందనట్లుగా అనిపించి నిద్రలోంచి లేస్తున్నాను,. నోరు ఎండిపోయినట్లు అనిపిస్తోంది. మళ్లీ నిద్రపట్టడం కష్టం అవుతోంది. పెద్దగా శబ్దం చేస్తూ గురక పెడుతున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఏడెనిమిది గంటలు పడుకుంటున్నా. పగటి వేళ అలసటగా ఉంటోంది. ఇక్కడ డాక్టరుకు చూపిస్తే ïస్లిప్ ఆప్నియా అని కొన్ని టాబ్లెట్లు రాసిచ్చారు. ఇదేమి వ్యాధి? దీంతో ప్రమాదం ఏౖమైనా ఉంటుందా? గురక రాకుండా చేయలేమా? దయచేసి వివరంగా చెప్పండి. – ఆర్. ఆర్. రెడ్డి, కమలాపురం స్లీప్ ఆప్నియా అనేది నిద్రకు సంబంధించిన సమస్య. దీనివల్ల శరీరానికి అందే ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది. ఇది కాస్తంత ప్రమాదకరమైన మెడికల్ కండిషన్ అనే చెప్పవచ్చు. దీన్ని ఎదుర్కొంటున్నవారు రాత్రంతా గురకపెట్టి నిద్రపోయినా... మర్నాడు వారికి చాలా మగతగా ఉంటుంది. నిజానికి స్లీప్ ఆప్నియా అన్నది ఒక లక్షణ సముదాయం. అంటే సిండ్రోమ్ అన్నమాట. నిద్రలేమి నుంచి శ్వాస పీల్చడం వరకు ఆప్నియాలో అనేక అంతరాయాలు ఏర్పడుతుంటాయి. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం తాత్కాలికంగా ఆగిపోయి ఒంటికి అందునా ప్రధానంగా మెదడు, గుండె వంటి కీలక అవయవాలకు అందాల్సిన ఆక్సిజన్ అందక ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. రాత్రి నిద్ర సమయం పొడవునా ఇదే పరిస్థితి కొనసాగుతుంటుంది. ఫలితంగా ఒంటికి కావాల్సినంత ఆక్సిజన్ అందక, రాత్రంతా సరైన, నాణ్యమైన నిద్రలేక మర్నాడంతా మగతగా ఉంటుంది. ఇక రాత్రి నిద్రపోతున్న సమయంలో కూడా ఆక్సిజన్లేమి కారణంగా శరీరంలో జరగాల్సిన జీవక్రియలు సక్రమంగా జరగకపోవచ్చు. దాంతో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. అంటే శ్వాస తీసుకోవడం మందగించిపోయి, కొన్ని క్షణాల పాటు ఊపిరి నిలిచిపోవడం ఆప్నియాలో సంభవించే ఒక ప్రమాదకరమైన లక్షణం. కారణాలు టాన్సిల్స్, సైనసైటిస్, రైనైటిస్ వంటి సమస్యలు గురకకు ప్రధాన కారణమవుతుంటాయి. ఈ సమస్యతో రాత్రి నిద్ర కరవై పగటిపూట కునికిపాట్లు పడుతుంటారు. ఈ ఆప్నియా కారణంగా కోపం, అసహనం కలుగుతుంటాయి. స్లీప్ ఆప్నియాతో బాధపడేవారికి అధిక రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను క్లాసికల్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సిండ్రోమ్ అని కూడా అంటారు. గుండెజబ్బులు,, శరీరంలో కొలెస్ట్రాల్ వల్ల ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలగవచ్చు. కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు బలహీనంగా ఉండటం, గుండెజబ్బులు ఉన్నవారికి స్లీప్ఆప్నియా కూడా ఉంటే అది ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదం ఉంటుంది. పరిష్కారం / చికిత్స ఇది పరిష్కారం లేని సమస్యేమీ కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, వైద్యనిపుణులను సంప్రదించి వారి సహాయం తీసుకోవడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు. స్లీప్ ఆప్నియాకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా ఒంటికి తగిన ఆక్సిజన్ అందేలా చూసుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మద్యం తీసుకునే అలవాటు ఉంటే మానేయాలి. ప్రత్యేకించి రాత్రిపూట భోజనం పరిమితంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఆహారంలో కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. ఇక చికిత్స విషయానికి వస్తే స్లీప్ ఆప్నియాకు సాధారణంగా రెండు రకాల మార్గాలను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. అవి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం. రెండోది వైద్యపరమైన చికిత్సలు తీసుకోవడం. అంటే ఇందులో సమస్య తీవ్రతను బట్టి మందులను సిఫార్సు చేయడం, మరికొంతమందికి ‘సీ–ప్యాప్’ (కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్ ప్రెషర్) అనే సాధనాన్ని అమర్చడం వంటివి సూచించడం జరుగుతుంటుంది. దీన్ని నిద్రపోయే ముందు ముక్కు మీద లేదా ముఖం మీద అమర్చుకుంటే రాత్రంతా గాలి ఆగిపోకుండా పంప్ చేస్తుంటుంది. నాలుక గొంతుకు అడ్డుపడకుండా చూస్తుంది. ఫలితంగా చాలా ఉపశమనం లభిస్తుంది. సమస్య మరీ తీవ్రంగా ఉండి, దశాబ్దాల తరబడి బాధపడుతున్నవాళ్లయితే వారికి శస్త్రచికిత్స చేయాల్సిరావచ్చు. మీరు ఆలస్యం చేయకుండా స్పెషలిస్ట్ డాక్టరుకు చూపించుకోండి. నాకూ అదే శ్వాస సంబంధ సమస్య వస్తుందా? నా వయసు 34 ఏళ్లు. గృహిణిని. మేము ఒక పారిశ్రామిక ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. ఇటీవల నాకు తీవ్రంగా దగ్గు, ఆయాసం వస్తోంది. ఊపిరిపీల్చడంలో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాను. ‘ఇది సాధారణ సమస్యే కదా, అదే తగ్గుతుందిలే’ అని అంతగా పట్టించుకోలేదు. ఈ సమస్య తగ్గకపోగా... రోజురోజుకూ తీవ్రమవుతోంది. మా కాలనీలోనే ఒకరికి ఇలాంటి లక్షణాలే ఉంటే హాస్పిటల్లో చూపించుకున్నారు. తనకు ఆస్తమా ఉందని తేలింది. నాకూ అలాంటి సమస్య ఏమైనా ఉందా అని అనుమానంగా ఉంది. నా సమస్యకు సరైన పరిష్కారం సూచించండి. – డి. రమాసుందరి, సనత్‌నగర్, హైదరాబాద్ మీరు పారిశ్రామిక ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. పరిశ్రమల నుంచి వెలువడే పొగలో అనేక రసాయనాలు ఉంటాయి. వాటిని పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. రసాయనాలతో కూడిన గాలి పీల్చినప్పుడు... కాలుష్యాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అలర్జీ, ఆస్తమా, సీఓపీడీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తాయి. మీకు కొంతకాలంగా దగ్గు, ఆయాసం తగ్గడం లేదని తెలిపారు కాబట్టి మీరు వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని, వ్యాధి నిర్ధారణ త్వరగా జరిగితే, శ్వాసకోశ సంబంధ వ్యాధులను ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. మీరు సాధ్యమైనంతవరకు మీ ఇంటి చుట్టూ ఉండే పరిసరాల్లో పచ్చటి చెట్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పచ్చదనంతో కాలుష్యప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. దాంతో పాటు మీ ఇంటి పరిసరాల్లో దుమ్ము, ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో ఎవరికైనా పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేసేలా చూడండి. ఎందుకంటే పొగతాగేవాళ్లతో పాటు ఆ పొగ పీల్చేవారికి కూడా అది ప్రమాదమే. పరిశ్రమల పొగతో పాటు, సిగరెట్ కాల్చితే వచ్చే పొగ... ఈ రెండింటి వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఇక మీరు వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించండి. - డాక్టర్ జి. హరికిషన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఛాతీ – శ్వాసకోశ వ్యాధుల విభాగం, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
పల్మునాలజీ కౌన్సెలింగ్
ఆస్తమా అదుపు కోసం ఇప్పుడు మరికొన్ని ఆధునిక చికిత్సలు మా నాన్నగారి వయసు 48 ఏళ్లు. తీవ్రమైన ఆస్తమాతో బాధడుతున్నారు. డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతున్నా ఆస్తమా అదుపులోకి రావడం లేదు. దాంతో తరచూ ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తోంది. మా నాన్నగారి పరిస్థితి చూసిన డాక్టర్లు బ్రాంకియల్ థర్మోప్లాస్టీ లాంటి కొత్త చికిత్స ప్రక్రియలు వచ్చాయనీ, అలాంటి అడ్వాన్స్డ్ ప్రక్రియలతో పరిస్థితి మెరుగవుతుందని చెప్పారు. ఆస్తమాలో ఇప్పుడొచ్చిన ఆధునిక చికిత్స గురించి వివరించండి. – మంజుల, వికారాబాద్ తీవ్రమైన ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఇప్పుడు బ్రాంకియల్ థర్మోప్లాస్టీ, బయలాజిక్ మెడిసిన్ అనే రెండు ఆధునిక చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో తీవ్రమైన ఆస్తమా ఉన్నవారు కూడా అందరిలాగే మామూలు జీవితం గడపడం సాధ్యమవుతుంది. మీరు చెప్పిన బ్రాంకియల్ థర్మోప్లాస్టీ అనే ప్రక్రియలో ఒక ప్రత్యేకమైన పరికరం సహాయంతో శ్వాసనాళపు గోడల్ని వేడి చేస్తారు. ప్రోబ్ అని పిలిచే ఈ పరికరాన్ని బ్రాంకోస్కోప్ సహాయంతో లోపలికి పంపుతారు. అది వేడిమిని వెలువరిస్తుంది. ఆ పరికరం వెలువరించే వేడిమితో శ్వాసమార్గంలో చేరిన అదనపు మ్యూకస్ తొలగిపోతుంది. దాంతో శ్వాసమార్గం విశాలంగా తెరుచుకుంటుంది. ఫలితంగా హాయిగా శ్వాస పీల్చుకోవడం సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియను మూడేసి వారాల చొప్పున మూడుసార్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మూడు దఫాల చికిత్స పూర్తయ్యేసరికి తీవ్రమైన ఆస్తమా వ్యాధి లక్షణాలు బాగా తగ్గిపోతాయి. మంచి ఉపశమనం నశిస్తుంది. జీవననాణ్యత మెరుగుపడటంతో పాటు, ఆస్తమా అటాక్స్ తగ్గడం, ఆసుపత్రిలో చేరాల్సి రావడం కూడా తగ్గిపోతుంది. ఈ చికిత్స ఫలితాలు చాలా కాలం... అంటే దాదాపుగా ఎనిమిదేళ్లు ఉంటాయి. ఇన్హేలర్ మందులతో కూడా ప్రయోజనం లేని 18 ఏళ్లు నిండిన రోగులకు ఈ చికిత్స ఇవ్వవచ్చు. దీనితో పాటు బయోలాజిక్ మెడిసిన్స్ అనే అత్యాధునికమైన మరికొన్ని ఔషధాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆస్తమా వ్యాధిగ్రస్తుల్లో శ్వాసనాళాల వాపు కారణంగా ఆ నాళాలు సన్నబడతాయి. ఈ మందులు ఆ వాపును తగ్గించడానికి ఉపయోగపడతాయి. మనదేశంలో ప్రస్తుతం ఓమాలిజుమాబ్ అనే మందొక్కటే దొరుకుతోంది. దీన్ని కూడా డాక్టర్లు అందరికీ సిఫార్సు చేయరు. తీవ్రమైన ఆస్తమా ఉండటంతో పాటు, రక్తంలో ఎల్జీఈ అనే అణువులు ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే ఈ మందును ఇస్తారు. దీన్ని ప్రతి రెండు లేదా నాలుగు వారాలకు ఒకసారి సబ్‌క్యుటేనియస్ (చర్మం దిగువ పొర)లోకి ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. దీన్ని ఉపయోగించిన ఆస్తమా రోగుల్లోని 70 శాతం మందికి మంచి ఉపశమనం లభించినట్లు నిపుణులు గమనించారు. మందు వాడిన మూడునాలుగు నెలల్లో ఫలితాలు కనిపిస్తాయి. ఒకటి రెండేళ్ల పాటు చికిత్స తీసుకుంటే ఆస్తమా సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. స్టెరాయిడ్స్ మాదిరిగా ఈ మందులతో పెద్దగా దుష్ఫలితాలేవీ ఉండవు. అయితే రానున్న రోజుల్లో ‘ఒమాలిజుమాబ్’తో పాటు మరికొన్ని బయాలజికల్ మెడిసిన్స్ మనదేశంలోకి వచ్చే అవకాశం ఉంది. పాప తరచూ అలర్జీలకు గురవుతోంది... ఏం చేయాలి? మా అమ్మాయి వయసు ఏడేళ్లు. రెండేళ్ల నుంచి తనకు తరచూ జలుబు, దగ్గు వస్తున్నాయి. డాక్టర్‌కు చూపించి మందులు వేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. కొంత తగ్గినట్టే తగ్గి మళ్లీ సమస్య తిరగబెడుతోంది. మాకు దగ్గర్లోని పెద్ద సిటీలో పెద్ద డాక్టర్‌కు చూపిస్తే అలర్జీల వల్ల ఇలా జరగుతోందని అన్నారు. మా పాప సమస్య ఏమిటి? దయచేసి వివరంగా చెప్పండి. పాప విషయంలో మేం ఏం చేయాలో కూడా చెప్పండి. – సంతోష్‌కుమార్, జనగాం మన శరీరంలోకి కొన్ని రకాల పదార్థాలు, సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా, వైరస్ వంటివి) ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ ఆ హానికరమైన సూక్ష్మజీవులను తుదముట్టించేందుకు రంగంలోకి దిగుతుంది. అయితే కొందరిలో రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించి, సొంత కణాలపైనే ప్రతికూలంగా పనిచేస్తుంటుంది. ఇలా రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల ఏర్పడే పరిస్థితినే అలర్జీ అంటారు. మన దేశ జనాభాల్లో 5 – 11 ఏళ్ల వయసు పిల్లల్లో దాదాపు ఐదోవంతు మంది పిల్లలు అలర్జీ బాధితులే. ఇంట్లో పొగతాగేవారు ఉన్నప్పుడు, తీవ్ర వాయుకాలుష్యంతో కూడిన వాతావరణంలో పెరిగే పిల్లలు ఈ అలర్జీలకు ఎక్కువగా గురవుతుంటారు. తల్లిదండ్రుల్లోనూ ఇలా అలర్జీకి గురయ్యే లక్షణం ఉన్నప్పుడు, వాళ్ల పిల్లలకూ అలర్జీలు సంక్రమించే అవకాశం చాలా ఎక్కువ. ఈ అలర్జీలన్నీ ఒకేలా ఉండాలని లేదు. అవి వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరు రూపాల్లో వ్యక్తమవుతుంటాయి. పిల్లల ఒంట్లోకి ఏదైనా సరిపడని పదార్థం చేరినప్పుడు శరీరంలో పెద్ద ఎత్తున యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. రక్తంలోని ఆ యాంటీబాడీస్ కారణంగా వాయునాళాల వాపు వచ్చి శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది కలగవచ్చు. ఇది ఆస్తమా రూపంలో వ్యక్తమవుతుంది. ఇక కొందరిలో శరీరంపై దద్దుర్లు రావచ్చు. మీ పాప విషయంలో జరుగుతున్నట్లుగా పిల్లలకు తరచూ జ్వరం రావడం, ముక్కుదిబ్బడ పట్టేస్తూ ఉండటం, జలుబు చేస్తూ ఉండటం, చెవి ఇన్ఫెక్షన్లు వస్తుండటం జరుగుతుంటే వాటిని అలర్జీలుగా భావించాలి. ఇక కొన్ని ఆహారపదార్థాలతో కూడా పిల్లల్లో అలర్జీలు వస్తుంటాయి. పిల్లలకు ఆరోగ్యకరం అని అందరూ అనుకొనే పాలు కొందరు పిల్లలకు సరిపడకపోవచ్చు. అలాగే కొన్ని రకాల పండ్లు, వేరుశనగలు కొందరిలో అలర్జీలు కలిగిస్తాయి. స్కూలుకు వెళ్లే వయసులో పిల్లలకు అక్కడి వాతావరణం, అక్కడ తిరిగే పెంపుడు జంతువులు (స్కూల్పెట్స్), ఇంట్లోని పెంపుడు జంతువుల వల్ల కూడా అలర్జీలకు గురవుతుంటారు. పరిసరాల్లో నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, ఓజోన్, హానికరమైన పొగలు, వంటగ్యాస్, గది ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, బూజులతో అలర్జీలు వస్తాయి. కొందరిలో బాత్రూమ్ క్లీనర్లు, పెయింట్ల వంటివాటితో కూడా వాతావరణం కలుషితమై అలర్జీలు వస్తాయి. అలర్జీలు సాధారణంగా జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి. అయితే వాటి వల్ల కలిగే లక్షణాలను వైద్యపరంగా చాలావరకు అదుపు చేయవచ్చు. పిల్లలు అలర్జీలకు గురవుతున్నట్లు గుర్తించినప్పుడు, వారికి ఏ కారణం చేత అలర్జీ ఏర్పడుతుందో గ్రహించి, దాని నుంచి దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. పిల్లలు అలర్జీకి గురవుతున్నప్పుడు వెంటనే డాక్టర్లు చూపించి, అవసరమైన చికిత్స అందిస్తుంటే, వారు కూడా మిగతా పిల్లల్లాగే సాధారణ జీవితం గడిపే అవకాశం ఏర్పడుతుంది. రాత్రివేళల్లో తీవ్రమైన దగ్గు... పరిష్కారం చెప్పండి నా వయసు 35 ఏళ్లు. పదేళ్లుగా సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాను. ఉద్యోగంలో భాగంగా నేను రోజుకు దాదాపు 150 కిలోమీటర్ల దూరం బైక్‌పై ప్రయాణం చేస్తుంటాను. స్మోకింగ్ కూడా బాగా అలవాటు ఉంది. కొన్నేళ్లుగా దగ్గుతో బాధపడుతున్నాను. ముఖ్యంగా రాత్రివేళ విపరీతంగా దగ్గు వస్తోంది. ఊపిరి కూడా ఆడటం లేదు. ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా, ఎన్ని మందులు వాడినా నా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. నాకు తగిన పరిష్కారం సూచించండి. – ఎస్కె. జానీబాషా, గుంటూరు మీరు తరచూ జలుబు, దగ్గు, ఊపిరాడని సమస్యలతో బాధపడుతున్నారని చెబుతున్న అంశాన్ని బట్టి మీ శ్వాసనాళాలు (ముక్కు నుంచి ఊపిరితిత్తులకు గాలిని మోసుకుపోయే గొట్టాలు) రోగగ్రస్తం అయినట్లుగా భావించవచ్చు. దీనికి ప్రధాన కారణాలు రెండు. మొదటిది మీ స్మోకింగ్ అలవాటు. రెండోది ఉద్యోగరీత్యా మీరు ఎదుర్కొంటున్న వాతావరణ కాలుష్యం. మీరు ముందుగా చేయాల్సింది మీ సిగరెట్ అలవాటును మానేయడం. సిగరెట్‌పొగలో ఊపిరితిత్తులు, శ్వాసమార్గాలను ధ్వంసం చేసే విష రసాయనాలు కొల్లలుగా ఉంటాయి. అవి ఊపిరితిత్తులకు సహజసిద్ధంగా ఉండే రక్షణ వ్యవస్థ మొత్తాన్ని ధ్వంసం చేస్తాయి. స్మోకింగ్ కారణంగా శ్వాసమార్గాలు గట్టిపడిపోయి గాలి వెళ్లే దారులన్నీ సన్నబడిపోతాయి. పైగా మ్యూకస్ ఎక్కువగా స్రవించి, దగ్గు, ఊపిరాడని పరిస్థితికి దారితీస్తుంది. మీ అంతట మీరే స్మోకింగ్ అలవాటు మానలేకపోతే దాన్ని మాన్పించడానికి మందులు కూడా ఉంటాయి. వాటిని వాడటం వల్ల సిగరెట్ తాగాలన్న కోరిక క్రమేపీ సన్నగిల్లుతుంది. ఇక రెండోది వాతావరణ కాలుష్యం. మానవ శరీరంలోకి ప్రధానద్వారం (గేట్ వే) వంటివి ఊపిరితిత్తులు. వాతావరణంలో ఉండే సల్ఫర్‌డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి కాలుష్యాలను పీల్చడం వల్ల... ముఖ్యంగా మీ విషయంలో ఇవి చాలా ప్రమాదకర స్థాయికి చేరినట్లుగా అనిపిస్తోంది. కాబట్టి ట్రాఫిక్ లేని సమయంలో, రద్దీ తక్కువగా ఉండే మార్గాలలో ప్రయాణించడం, వీలైతే బైక్‌పై ప్రయాణాన్ని మానుకోవడం ద్వారా కాలుష్యం బారినుంచి కాపాడుకోవచ్చు. మీరు ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లి చెస్ట్ ఎక్స్‌రే, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించుకోండి. వాటి ఫలితాలను బట్టి చికిత్స ప్రారంభిస్తారు. అయితే కేవలం మందులతో మాత్రమే కాకుండా మీ జీవనశైలిలో కొన్ని మార్పులు కూడా చికిత్సలో భాగమైనప్పుడు మాత్రమే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. - డాక్టర్ వి.నాగార్జున మాటూరు ,సీనియర్ పల్మనాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
పల్మొనాలజీ కౌన్సెలింగ్
నాకు ఎడతెరిపిలేకుండా దగ్గు వస్తోంది. టీబీ అయి ఉండవచ్చా? ఇలా ముందుకూడా వచ్చింది కానీ దానంతట అదే తగ్గిపోయింది. ఈసారీ అలాగే అవుతుందని ఎదురుచూస్తున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి. - శంకర్‌గుప్తా, జగ్గయ్యపేట నోరు, ముక్కు నుంచి ఊపిరితిత్తుల మధ్య గొంతు దగ్గర గ్లాటిస్ అనే అవయవం ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలిని గ్లాటిస్ నుంచి అత్యధిక పీడనంతో బలంగా నోటి ద్వారా ఒక్కసారిగా బయటకు వదిలేస్తే వెలువడేదే దగ్గు. మనలో పేరుకునే అనేక వ్యర్థాలను, కొన్ని ప్రమాదకరమైన ద్రవాలను బయటకు విసర్జించడానికి దగ్గు ఉపయోగపడుతుంది. దగ్గు అనేది టీబీ లక్షణం మాత్రమే కాదు. సైనుసైటిస్, నిమోనియా, ఆస్తమా వంటి జబ్బుల నుంచి గుండెజబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వరకు అనేక వ్యాధులకు దగ్గు ఒక లక్షణం. కాబట్టి మీరు అదే తగ్గుతుందని ఊరుకోకుండా తక్షణం మీకు దగ్గర్లోని డాక్టర్ని కలిసి దగ్గుకు కారణాన్ని కనుగొని, దానికి తగిన చికిత్స తీసుకోండి. నేను విపరీతంగా పొగతాగుతాను. ఇప్పుడు స్మోకింగ్ మానేయాలనుకుంటున్నాను. దీంతో నాలో పేరుకుపోయిన పొగ తాలూకు కాలుష్యాలు బయటకు వెళ్తాయా? - కృష్ణమూర్తి, మాచర్ల మీరు పొగతాగడం మానేయాలనుకోవడం మంచి సూచన. మీరు మానేసిన 20 నిమిషాల్లోనే మీ ఊపిరితిత్తుల్లోంచి పొగ కాలుష్యాలను బయటకు నెట్టేసే పనిని మీ లంగ్స్ ప్రారంభిస్తాయి. ఊపిరితిత్తుల్లో మ్యూకోసీలియరీ ఎస్కలేటర్స్ అనే కణాలుంటాయి. వీటి ఉపరితలం పొడవైన కణాలు ఉంటాయి. వీటిని సీలియా అంటారు. అవి నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ కదలికలు ఎంత వేగంగా ఉంటాయంటే... వీటిలో కొన్ని 1000 సార్లకు మించి స్పందిస్తుంటాయి. ఈ స్పందనల వల్ల వ్యర్థ పదార్థాలను బయటకు నెట్టివేసే ప్రక్రియ కొనసాగుతుంటుంది. సీలియా సక్రమంగా పనిచేయడానికి, వాటి చుట్టూ పలచని మ్యూకస్ ఉంటుంది. ముక్కు ఉపరితలం వద్దకు రాగానే ఈ మ్యూకస్ ఎండిపోయి, గాలికి రాలిపోతూ ఉంటుంది. మీలోనూ మ్యూకోసీలియరీ ఎస్కలేటర్స్ పనిచేసి ఇంతకాలం మీరు తాగిన పొగ వల్ల పేరుకున్న కాలుష్యాన్ని బయటకు పంపుతాయి. మీరు స్మోకింగ్ పూర్తిగా ఆపేసిన 3 - 5 ఏళ్ల కాలంలో మీ ఊపిరితిత్తులు పూర్తిగా శుభ్రపడి, మునపటిలా నార్మల్‌గా అవుతాయి. డాక్టర్ రమణప్రసాద్ వి.వి. సీనియర్ కన్సల్టెంట్ పల్మొనాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్