పల్మునాలజీ కౌన్సెలింగ్‌ | Pulmonology Counseling | Sakshi
Sakshi News home page

పల్మునాలజీ కౌన్సెలింగ్‌

Published Mon, May 7 2018 1:27 AM | Last Updated on Mon, May 7 2018 1:27 AM

Pulmonology Counseling - Sakshi

ఆస్తమా అదుపు కోసం ఇప్పుడు మరికొన్ని ఆధునిక చికిత్సలు
మా నాన్నగారి వయసు 48 ఏళ్లు. తీవ్రమైన ఆస్తమాతో బాధడుతున్నారు. డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడుతున్నా ఆస్తమా అదుపులోకి రావడం లేదు. దాంతో తరచూ ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తోంది. మా నాన్నగారి పరిస్థితి చూసిన డాక్టర్లు  బ్రాంకియల్‌ థర్మోప్లాస్టీ లాంటి కొత్త చికిత్స ప్రక్రియలు వచ్చాయనీ, అలాంటి అడ్వాన్స్‌డ్‌ ప్రక్రియలతో పరిస్థితి మెరుగవుతుందని చెప్పారు. ఆస్తమాలో ఇప్పుడొచ్చిన ఆధునిక చికిత్స గురించి వివరించండి. – మంజుల, వికారాబాద్‌

తీవ్రమైన ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఇప్పుడు బ్రాంకియల్‌ థర్మోప్లాస్టీ, బయలాజిక్‌ మెడిసిన్‌ అనే రెండు ఆధునిక చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో తీవ్రమైన ఆస్తమా ఉన్నవారు కూడా అందరిలాగే మామూలు జీవితం గడపడం సాధ్యమవుతుంది. మీరు చెప్పిన బ్రాంకియల్‌ థర్మోప్లాస్టీ అనే ప్రక్రియలో ఒక ప్రత్యేకమైన పరికరం సహాయంతో శ్వాసనాళపు గోడల్ని వేడి చేస్తారు.

ప్రోబ్‌ అని పిలిచే ఈ పరికరాన్ని బ్రాంకోస్కోప్‌ సహాయంతో లోపలికి పంపుతారు. అది వేడిమిని వెలువరిస్తుంది. ఆ పరికరం వెలువరించే వేడిమితో శ్వాసమార్గంలో చేరిన అదనపు మ్యూకస్‌ తొలగిపోతుంది. దాంతో శ్వాసమార్గం విశాలంగా తెరుచుకుంటుంది. ఫలితంగా హాయిగా శ్వాస పీల్చుకోవడం సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియను మూడేసి వారాల చొప్పున మూడుసార్లు నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ మూడు దఫాల చికిత్స పూర్తయ్యేసరికి తీవ్రమైన ఆస్తమా వ్యాధి లక్షణాలు బాగా తగ్గిపోతాయి. మంచి ఉపశమనం నశిస్తుంది. జీవననాణ్యత మెరుగుపడటంతో పాటు, ఆస్తమా అటాక్స్‌ తగ్గడం, ఆసుపత్రిలో చేరాల్సి రావడం కూడా తగ్గిపోతుంది. ఈ చికిత్స ఫలితాలు చాలా కాలం... అంటే దాదాపుగా ఎనిమిదేళ్లు ఉంటాయి. ఇన్‌హేలర్‌ మందులతో కూడా ప్రయోజనం లేని 18 ఏళ్లు నిండిన రోగులకు ఈ చికిత్స ఇవ్వవచ్చు.

దీనితో పాటు బయోలాజిక్‌ మెడిసిన్స్‌ అనే అత్యాధునికమైన మరికొన్ని ఔషధాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆస్తమా వ్యాధిగ్రస్తుల్లో శ్వాసనాళాల వాపు కారణంగా ఆ నాళాలు సన్నబడతాయి. ఈ మందులు ఆ వాపును తగ్గించడానికి ఉపయోగపడతాయి. మనదేశంలో ప్రస్తుతం ఓమాలిజుమాబ్‌ అనే మందొక్కటే దొరుకుతోంది. దీన్ని కూడా డాక్టర్లు అందరికీ సిఫార్సు చేయరు. తీవ్రమైన ఆస్తమా ఉండటంతో పాటు, రక్తంలో ఎల్జీఈ అనే అణువులు ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే ఈ మందును ఇస్తారు.

దీన్ని ప్రతి రెండు లేదా నాలుగు వారాలకు ఒకసారి సబ్‌క్యుటేనియస్‌ (చర్మం దిగువ పొర)లోకి ఇంజెక్షన్‌ రూపంలో ఇస్తారు. దీన్ని ఉపయోగించిన ఆస్తమా రోగుల్లోని 70 శాతం మందికి మంచి ఉపశమనం లభించినట్లు నిపుణులు గమనించారు. మందు వాడిన మూడునాలుగు నెలల్లో ఫలితాలు కనిపిస్తాయి. ఒకటి రెండేళ్ల పాటు చికిత్స తీసుకుంటే ఆస్తమా సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. స్టెరాయిడ్స్‌ మాదిరిగా ఈ మందులతో పెద్దగా దుష్ఫలితాలేవీ ఉండవు. అయితే రానున్న రోజుల్లో ‘ఒమాలిజుమాబ్‌’తో పాటు మరికొన్ని బయాలజికల్‌ మెడిసిన్స్‌ మనదేశంలోకి వచ్చే అవకాశం ఉంది.


పాప తరచూ అలర్జీలకు గురవుతోంది... ఏం చేయాలి?
మా అమ్మాయి వయసు ఏడేళ్లు. రెండేళ్ల నుంచి తనకు తరచూ జలుబు, దగ్గు వస్తున్నాయి. డాక్టర్‌కు చూపించి మందులు వేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. కొంత తగ్గినట్టే తగ్గి మళ్లీ సమస్య తిరగబెడుతోంది. మాకు దగ్గర్లోని పెద్ద సిటీలో పెద్ద డాక్టర్‌కు చూపిస్తే అలర్జీల వల్ల ఇలా జరగుతోందని అన్నారు. మా పాప సమస్య ఏమిటి? దయచేసి వివరంగా చెప్పండి. పాప విషయంలో మేం ఏం చేయాలో కూడా చెప్పండి. – సంతోష్‌కుమార్, జనగాం

మన శరీరంలోకి కొన్ని రకాల పదార్థాలు, సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా, వైరస్‌ వంటివి) ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ ఆ హానికరమైన సూక్ష్మజీవులను తుదముట్టించేందుకు రంగంలోకి దిగుతుంది. అయితే కొందరిలో రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించి, సొంత కణాలపైనే ప్రతికూలంగా పనిచేస్తుంటుంది. ఇలా రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల ఏర్పడే పరిస్థితినే అలర్జీ అంటారు. మన దేశ జనాభాల్లో 5 – 11 ఏళ్ల వయసు పిల్లల్లో దాదాపు ఐదోవంతు మంది పిల్లలు అలర్జీ బాధితులే. ఇంట్లో పొగతాగేవారు ఉన్నప్పుడు, తీవ్ర వాయుకాలుష్యంతో కూడిన వాతావరణంలో పెరిగే పిల్లలు ఈ అలర్జీలకు ఎక్కువగా గురవుతుంటారు.

తల్లిదండ్రుల్లోనూ ఇలా అలర్జీకి గురయ్యే లక్షణం ఉన్నప్పుడు, వాళ్ల పిల్లలకూ అలర్జీలు సంక్రమించే అవకాశం చాలా ఎక్కువ. ఈ అలర్జీలన్నీ ఒకేలా ఉండాలని లేదు. అవి వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరు రూపాల్లో వ్యక్తమవుతుంటాయి. పిల్లల ఒంట్లోకి ఏదైనా సరిపడని పదార్థం చేరినప్పుడు శరీరంలో పెద్ద ఎత్తున యాంటీబాడీస్‌ ఉత్పత్తి అవుతాయి. రక్తంలోని ఆ యాంటీబాడీస్‌ కారణంగా వాయునాళాల వాపు వచ్చి శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది కలగవచ్చు. ఇది ఆస్తమా రూపంలో వ్యక్తమవుతుంది. ఇక కొందరిలో శరీరంపై దద్దుర్లు రావచ్చు. మీ పాప విషయంలో జరుగుతున్నట్లుగా పిల్లలకు తరచూ జ్వరం రావడం, ముక్కుదిబ్బడ పట్టేస్తూ ఉండటం, జలుబు చేస్తూ ఉండటం, చెవి ఇన్ఫెక్షన్లు వస్తుండటం జరుగుతుంటే వాటిని అలర్జీలుగా భావించాలి.

ఇక కొన్ని ఆహారపదార్థాలతో కూడా పిల్లల్లో అలర్జీలు వస్తుంటాయి. పిల్లలకు ఆరోగ్యకరం అని అందరూ అనుకొనే పాలు కొందరు పిల్లలకు సరిపడకపోవచ్చు. అలాగే కొన్ని రకాల పండ్లు, వేరుశనగలు కొందరిలో అలర్జీలు కలిగిస్తాయి. స్కూలుకు వెళ్లే వయసులో పిల్లలకు అక్కడి వాతావరణం, అక్కడ తిరిగే పెంపుడు జంతువులు (స్కూల్‌పెట్స్‌), ఇంట్లోని పెంపుడు జంతువుల వల్ల కూడా అలర్జీలకు గురవుతుంటారు. పరిసరాల్లో నైట్రస్‌ ఆక్సైడ్, సల్ఫర్‌ డై ఆక్సైడ్, ఓజోన్, హానికరమైన పొగలు, వంటగ్యాస్, గది ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, బూజులతో అలర్జీలు వస్తాయి.

కొందరిలో బాత్‌రూమ్‌ క్లీనర్లు, పెయింట్ల వంటివాటితో కూడా వాతావరణం కలుషితమై అలర్జీలు వస్తాయి. అలర్జీలు సాధారణంగా జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి. అయితే వాటి వల్ల కలిగే లక్షణాలను వైద్యపరంగా చాలావరకు అదుపు చేయవచ్చు. పిల్లలు అలర్జీలకు గురవుతున్నట్లు గుర్తించినప్పుడు, వారికి ఏ కారణం చేత అలర్జీ ఏర్పడుతుందో గ్రహించి, దాని నుంచి దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. పిల్లలు అలర్జీకి గురవుతున్నప్పుడు వెంటనే డాక్టర్లు చూపించి, అవసరమైన చికిత్స అందిస్తుంటే, వారు కూడా మిగతా పిల్లల్లాగే  సాధారణ జీవితం గడిపే అవకాశం ఏర్పడుతుంది.


రాత్రివేళల్లో తీవ్రమైన దగ్గు... పరిష్కారం చెప్పండి
నా వయసు 35 ఏళ్లు. పదేళ్లుగా సేల్స్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాను. ఉద్యోగంలో భాగంగా నేను రోజుకు దాదాపు 150 కిలోమీటర్ల దూరం బైక్‌పై ప్రయాణం చేస్తుంటాను. స్మోకింగ్‌ కూడా బాగా అలవాటు ఉంది. కొన్నేళ్లుగా దగ్గుతో బాధపడుతున్నాను. ముఖ్యంగా రాత్రివేళ విపరీతంగా దగ్గు వస్తోంది. ఊపిరి కూడా ఆడటం లేదు. ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా, ఎన్ని మందులు వాడినా నా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. నాకు తగిన పరిష్కారం సూచించండి. – ఎస్‌కె. జానీబాషా, గుంటూరు

మీరు తరచూ జలుబు, దగ్గు, ఊపిరాడని సమస్యలతో బాధపడుతున్నారని చెబుతున్న అంశాన్ని బట్టి మీ శ్వాసనాళాలు (ముక్కు నుంచి ఊపిరితిత్తులకు గాలిని మోసుకుపోయే గొట్టాలు) రోగగ్రస్తం అయినట్లుగా భావించవచ్చు. దీనికి ప్రధాన కారణాలు రెండు. మొదటిది మీ స్మోకింగ్‌ అలవాటు. రెండోది ఉద్యోగరీత్యా మీరు ఎదుర్కొంటున్న వాతావరణ కాలుష్యం. మీరు ముందుగా చేయాల్సింది మీ సిగరెట్‌ అలవాటును మానేయడం. సిగరెట్‌పొగలో ఊపిరితిత్తులు, శ్వాసమార్గాలను ధ్వంసం చేసే విష రసాయనాలు కొల్లలుగా ఉంటాయి.

అవి ఊపిరితిత్తులకు సహజసిద్ధంగా ఉండే రక్షణ వ్యవస్థ మొత్తాన్ని ధ్వంసం చేస్తాయి. స్మోకింగ్‌ కారణంగా శ్వాసమార్గాలు గట్టిపడిపోయి గాలి వెళ్లే దారులన్నీ సన్నబడిపోతాయి. పైగా మ్యూకస్‌ ఎక్కువగా స్రవించి, దగ్గు, ఊపిరాడని పరిస్థితికి దారితీస్తుంది. మీ అంతట మీరే స్మోకింగ్‌ అలవాటు మానలేకపోతే దాన్ని మాన్పించడానికి మందులు కూడా ఉంటాయి. వాటిని వాడటం వల్ల సిగరెట్‌ తాగాలన్న కోరిక క్రమేపీ సన్నగిల్లుతుంది.

ఇక రెండోది వాతావరణ కాలుష్యం. మానవ శరీరంలోకి ప్రధానద్వారం (గేట్‌ వే) వంటివి ఊపిరితిత్తులు. వాతావరణంలో ఉండే సల్ఫర్‌డైఆక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ వంటి కాలుష్యాలను పీల్చడం వల్ల... ముఖ్యంగా మీ విషయంలో ఇవి చాలా ప్రమాదకర స్థాయికి చేరినట్లుగా అనిపిస్తోంది. కాబట్టి ట్రాఫిక్‌ లేని సమయంలో, రద్దీ తక్కువగా ఉండే మార్గాలలో ప్రయాణించడం, వీలైతే బైక్‌పై ప్రయాణాన్ని మానుకోవడం ద్వారా కాలుష్యం బారినుంచి కాపాడుకోవచ్చు.

మీరు ఊపిరితిత్తుల స్పెషలిస్ట్‌ దగ్గరికి వెళ్లి చెస్ట్‌ ఎక్స్‌రే, పల్మనరీ ఫంక్షన్‌ టెస్ట్‌ వంటి పరీక్షలు చేయించుకోండి. వాటి ఫలితాలను బట్టి చికిత్స ప్రారంభిస్తారు. అయితే కేవలం మందులతో మాత్రమే కాకుండా మీ జీవనశైలిలో కొన్ని మార్పులు కూడా చికిత్సలో భాగమైనప్పుడు మాత్రమే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.


- డాక్టర్‌ వి.నాగార్జున మాటూరు ,సీనియర్‌ పల్మనాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement