నాకు ఎడతెరిపిలేకుండా దగ్గు వస్తోంది. టీబీ అయి ఉండవచ్చా? ఇలా ముందుకూడా వచ్చింది కానీ దానంతట అదే తగ్గిపోయింది. ఈసారీ అలాగే అవుతుందని ఎదురుచూస్తున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి.
- శంకర్‌గుప్తా, జగ్గయ్యపేట
నోరు, ముక్కు నుంచి ఊపిరితిత్తుల మధ్య గొంతు దగ్గర గ్లాటిస్ అనే అవయవం ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలిని గ్లాటిస్ నుంచి అత్యధిక పీడనంతో బలంగా నోటి ద్వారా ఒక్కసారిగా బయటకు వదిలేస్తే వెలువడేదే దగ్గు. మనలో పేరుకునే అనేక వ్యర్థాలను, కొన్ని ప్రమాదకరమైన ద్రవాలను బయటకు విసర్జించడానికి దగ్గు ఉపయోగపడుతుంది. దగ్గు అనేది టీబీ లక్షణం మాత్రమే కాదు. సైనుసైటిస్, నిమోనియా, ఆస్తమా వంటి జబ్బుల నుంచి గుండెజబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వరకు అనేక వ్యాధులకు దగ్గు ఒక లక్షణం. కాబట్టి మీరు అదే తగ్గుతుందని ఊరుకోకుండా తక్షణం మీకు దగ్గర్లోని డాక్టర్‌ని కలిసి దగ్గుకు కారణాన్ని కనుగొని, దానికి తగిన చికిత్స తీసుకోండి.
నేను విపరీతంగా పొగతాగుతాను. ఇప్పుడు స్మోకింగ్ మానేయాలనుకుంటున్నాను. దీంతో నాలో పేరుకుపోయిన పొగ తాలూకు కాలుష్యాలు బయటకు వెళ్తాయా?
- కృష్ణమూర్తి, మాచర్ల
మీరు పొగతాగడం మానేయాలనుకోవడం మంచి సూచన. మీరు మానేసిన 20 నిమిషాల్లోనే మీ ఊపిరితిత్తుల్లోంచి పొగ కాలుష్యాలను బయటకు నెట్టేసే పనిని మీ లంగ్స్ ప్రారంభిస్తాయి. ఊపిరితిత్తుల్లో మ్యూకోసీలియరీ ఎస్కలేటర్స్ అనే కణాలుంటాయి. వీటి ఉపరితలం పొడవైన కణాలు ఉంటాయి. వీటిని సీలియా అంటారు. అవి నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ కదలికలు ఎంత వేగంగా ఉంటాయంటే... వీటిలో కొన్ని 1000 సార్లకు మించి స్పందిస్తుంటాయి. ఈ స్పందనల వల్ల వ్యర్థ పదార్థాలను బయటకు నెట్టివేసే ప్రక్రియ కొనసాగుతుంటుంది.
సీలియా సక్రమంగా పనిచేయడానికి, వాటి చుట్టూ పలచని మ్యూకస్ ఉంటుంది. ముక్కు ఉపరితలం వద్దకు రాగానే ఈ మ్యూకస్ ఎండిపోయి, గాలికి రాలిపోతూ ఉంటుంది. మీలోనూ మ్యూకోసీలియరీ ఎస్కలేటర్స్ పనిచేసి ఇంతకాలం మీరు తాగిన పొగ వల్ల పేరుకున్న కాలుష్యాన్ని బయటకు పంపుతాయి. మీరు స్మోకింగ్ పూర్తిగా ఆపేసిన 3 - 5 ఏళ్ల కాలంలో మీ ఊపిరితిత్తులు పూర్తిగా శుభ్రపడి, మునపటిలా నార్మల్‌గా అవుతాయి.
డాక్టర్ రమణప్రసాద్ వి.వి.
సీనియర్ కన్సల్టెంట్ పల్మొనాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
పల్మొనాలజీ కౌన్సెలింగ్
Published Wed, May 13 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM
Advertisement
Advertisement