సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్షయ వ్యాధి (టీబీ) కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదకర వ్యాధి వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా పెద్దలకు టీకా పంపిణీకి వైద్య శాఖ సన్నాహాలు చేస్తోంది. కరోనా వ్యాప్తి సమయంలో అవలంబించిన టీటీటీ (ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్) విధానాన్ని టీబీ నియంత్రణలోనూ వినియోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది.
ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షల తరహాలో వీలైనంత ఎక్కువ మందికి టీబీ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి లక్ష మంది జనాభాకు 1,522 మందికి పరీక్షలు నిర్వహిస్తూ ప్రస్తుతం దేశంలోనే తొలి మూడు స్థానాల్లో ఏపీ ఒకటిగా ఉంది. ఇదిలా ఉండగా మరింతగా దేశంలో పెద్దలకు టీబీ నుంచి రక్షణ కోసం బాసిల్లస్ కాల్మెట్–గ్వెరిన్ (బీసీజీ) వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. దీంతో మన రాష్ట్రంలో 12 జిల్లాల్లో వచ్చే నెలలో వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆరు అంశాల ప్రాతిపదికగా..
ఆరు అంశాల ప్రాతిపదికగా వివిధ వర్గాల వ్యక్తులకు తొలుత టీకా పంపిణీ చేపడతారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, టీబీతో బాధపడుతున్న వ్యక్తుల కుటుంబ సభ్యులు, టీబీ చరిత్ర కలిగిన వారితోపాటు, ధూమపానం చేసేవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, చ.మీ.కు 18 కిలోల కంటే తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగిన వ్యక్తులు ఇలా ఈ ఆరు వర్గాలకు చెందిన వారికి తొలుత టీకాలు వేస్తారు. టీకా పంపిణీకి ఎంపిక చేసిన 12 జిల్లాల్లో ఈ వర్గాలకు చెందిన వారు 50 లక్షల మంది వరకూ ఉన్నట్టు వైద్య శాఖ ప్రాథమికంగా నిర్థారించింది.
క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టి టీకా పంపిణీకి అర్హులైన వారి ఎంపిక చేపడుతున్నారు. కాగా, ఇప్పటికే వైద్య శాఖ పిల్లలకు టీకా పంపిణీ చేస్తోంది. గత ఏడాది నుంచి వైద్య శాఖ ఉచితంగా టీకా పంపిణీ ప్రారంభించింది. తొమ్మిది నెలలలోపు పిల్లలకు మూడు డోసులుగా టీకాను వేస్తున్నారు. పుట్టిన ఆరు వారాల వయసులో ఒక డోసు, 14 వారాల్లోపు రెండో డోసు, చివరిగా 9 నెలల వయసులోగా మూడో డోసు వేస్తున్నారు.
మూడు డోసుల టీకా వేసుకున్న పిల్లలకు న్యుమోనియా నుంచి రక్షణ లభిస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇదే తరహాలోనే నిర్ధేశించిన పరిమాణంలో పెద్దలకు టీకాలు పంపిణీ చేయనున్నారు. టీకా పంపిణీకి అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, నంద్యాల, పల్నాడు, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, శ్రీసత్యసాయి, విశాఖపట్నం, విజయనగరం, వైఎస్సార్ జిల్లాలను ఎంపిక చేశారు.
వచ్చే నెల 15వ తేదీ తర్వాత పంపిణీ
వ్యాక్సిన్ వెయిల్స్, సిరంజ్‌లు ఎంపిక చేసిన 12 జిల్లాలకు సరఫరా చేస్తున్నాం. 59 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేశాం. కేంద్ర వైద్య శాఖ 2025 నాటికి దేశంలో టీబీ నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకుంది. అంతకన్నా ముందే మన రాష్ట్రంలో టీబీని నిర్మూలించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
Comments
Please login to add a commentAdd a comment