రాత్రిళ్లు విపరీతంగా దగ్గు వస్తోంది సలహా ఇవ్వండి | Pulmonology Counseling | Sakshi
Sakshi News home page

దీర్ఘకాలిక ఆస్తమాకు ఏదైనా పరిష్కారం ఉందా?

Published Mon, Sep 9 2019 8:40 AM | Last Updated on Mon, Sep 9 2019 8:40 AM

Pulmonology Counseling - Sakshi

మా పాప వయసు ఆరేళ్లు. తరచూ జలుబు చేస్తుంటుంది. మందులు వాడితే కాస్త తగ్గినట్టే అనిపించి మళ్లీ తిరగబెడుతోంది. ఇలా దాదాపు నెలకొకటి రెండుసార్లు జలుబు బారిన పడి, చాలా బాధపడుతోంది. మాకు భయంగా ఉంటోంది. భవిష్యత్తులో ఆస్తమా వస్తుందా? లంగ్‌ పని తీరు మీద ఏదైనా ప్రభావం ఉంటుందా? దయచేసి సలహా ఇవ్వండి.  – ఆర్‌. నళిని, కందుకూరు

చిన్నపిల్లల్లో జలుబు సాధారణమే. కానీ, అలర్జీ వల్ల వచ్చే జలుబు సాధారణం కాదు. దీనిని నిర్లక్ష్యం చేస్తే అది ఆస్తమాకు దారితీయవచ్చు. అందుకే ప్రాథమిక దశలోనే లక్షణాలకు కాకుండా, వ్యాధికి చికిత్స అందిస్తే అలర్జీ... ఆస్తమాకి మారే అవకాశం ఉండదు. సాధారణంగా జలుబు 3–4 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ అలర్జీ వల్ల వచ్చే జలుబు పదిరోజులైనా తగ్గదు. ఇది గుర్తుంచుకోండి. ముక్కు నుంచి పసుపు లేదా ఆకుపచ్చ స్రావం కారుతుంటే ఇన్ఫెక్షన్‌ వల్ల అది వచ్చినట్లు భావించాలి. అలాకాకుండా తెల్లగా వస్తుంటే అది అలర్జీ వల్ల వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. అలర్జీ వల్ల తుమ్ములు, పొడిదగ్గు, గొంతునొప్పి సైతం ఉంటాయి. మీరు చెప్పిన అంశాలను  బట్టి మీ పాపవి అలర్జీ లక్షణాలే అనిపిస్తున్నాయి. దీనితో పాటు కళ్ల నుంచి నీరు, ముక్కు మూసుకుపోయినట్లుంటే అది అలర్జిక్‌ రైనైటిస్‌ తాలూకు లక్షణంగా పరిగణించాలి.

మీలాగే చాలామంది జలుబు చేయగానే పిల్లలను డాక్టర్‌ దగ్గరకు వెళ్లి మందులు ఇప్పిస్తారు. దాని వల్ల జలుబు తాత్కాలికంగా తగ్గిపోతుంది. కానీ తరచూ జలుబు చేస్తుంటే అది ‘అలర్జిక్‌ రైనైటిస్‌’ అని అర్థం చేసుకోవాలి. లక్షణాలకు మాత్రమే చికిత్స తీసుకుంటూ పోతే లోపల వ్యాధి పెరిగిపోతుంది. అలా కాకుండా వ్యాధికి చికిత్స తీసుకుంటే అది పూర్తిగా తగ్గిపోతుంది.
మీరు ఆలస్యం చేయవద్దు. అలా చేస్తే అది ఆస్తమాకు దారితీస్తుంది. ఇలాంటి సమయల్లో డాక్టర్‌ పర్యవేక్షణ లేకుండానే చాలామంది విచ్చలవిడిగా  యాంటీబయాటిక్స్‌ వాడటం, నిబ్యులైజర్‌ పెట్టించడం చేస్తున్నారు. మీరు మీ పాపను వెంటనే మీకు దగ్గర్లోని డాక్టర్‌కు చూపించండి.

దీర్ఘకాలికఆస్తమాకు ఏదైనాపరిష్కారం ఉందా?
మా నాన్నగారి వయసు 58 ఏళ్లు. నా చిన్నప్పటి నుంచి అంటే... గత 30 –35 ఏళ్లుగా ఆయన ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆయన పడుతున్న బాధ మేం కుటుంబ సభ్యులం చూడలేకపోతున్నాం. అన్ని రకాల స్టెరాయిడ్స్, టాబ్లెట్స్, ఇన్‌హేలర్స్‌ వాడినా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ తీవ్రమైన ఆస్తమాకు ఏదైనా శాశ్వత పరష్కారం ఉందా? దయచేసి వివరంగా చెప్పండి.– ఎమ్‌. పరమేశ్వరరావు, చీరాల

దేశవ్యాప్తంగా రెండు కోట్లమందికి పైగా ఆస్తమాతో బాధçపడుతున్నారు. ఏటికేడాదీ మరింత మంది దీని బారిన పడుతున్నారు. ఇతరత్రా పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా కేవలం ఈ దీర్ఘకాలిక ఆస్తమా తీవ్రతతో తమ వృత్తి, ఉద్యోగాలలో అనుకున్నంతగా రాణించలేక అసంతృప్తికి గురవుతుంటారు. అన్ని వయసుల వారినీ జీవితకాలం వెంటాడే ఆస్తమా... పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, మారుతున్న జీవినశైలిలోని లోటుపాట్ల కారణంగా ఇంకా ఎక్కువగా విస్తరిస్తోంది. దాంతో వ్యాధిగ్రస్తుల సంఖ్య మరింత పెరుగుతోంది.

అయితే గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలతో ఆస్తమాను అదుపు చేయడానికి గతం కంటే మెరుగైన చికిత్స విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. దాంతో ఇదివరకటిలా స్టెరాయిడ్స్‌ వాడాల్సిన అవసరం, వాటితో కలిగే ముప్పు తొలగిపోతున్నాయి. ఇలాంటి చికిత్సల్లో అత్యాధునికమైనది బ్రాంకియల్‌ థర్మోప్లాస్టీ అనే ప్రక్రియ. తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతున్నవారికి పూర్తి ఉపశమనం ఇవ్వగల మేలైన చికిత్సగా ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ఇది ఇప్పుడు మన దేశంలోనూ లభ్యమవుతోంది. ఈ ప్రక్రియలో ఒక ప్రత్యేక పరికరం (ప్రోబ్‌)ను ఉపయోగించి శ్వాసనాళపు గోడలను వేడిచేస్తారు. బ్రాంకోస్కోప్‌ ద్వారా వెళ్లే ఈ ప్రోబ్‌ అందించిన వేడిమితో శ్వాసమార్గంలో చేరిన అదనపు మ్యూకస్‌ తొలగిపోతుంది. అంతేకాదు శ్వాసమార్గం విశాలంగా తెరచుకుంటుంది. ఈ ప్రక్రియను మూడేసి వారాలకు ఒకసారి చొప్పున మూడు దఫాలు నిర్వహిస్తారు. ఈ మూడు దఫాల చికిత్స ప్రక్రియ పూర్తయ్యేసరికి తీవ్రమైన ఆస్తమా లక్షణాలు బాగా తగ్గిపోతాయి. చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వ్యక్తుల జీవననాణ్యత కూడా బాగా మెరుగుపడుతుంది. అటాక్స్‌ సంఖ్య, అటాక్స్‌ కారణంగా ఆసుపత్రిలో చేర్చాల్సి రావడం తగ్గిపోతుంది. ఈ చికిత్సప్రక్రియ ప్రభావం చాలాకాలం పాటు (అంటే కనీసం ఎనిమిదేళ్లపాటు) నిలిచి ఉంటుంది. పద్ధెనిమిది ఏళ్లు నిండి, ఇన్‌హేలర్స్‌తో కూడా ప్రయోజనం కనిపించని వారు ఈ ప్రక్రియను ఎంచుకోవచ్చు. మీరు ఒకసారి మీకు దగ్గర్లో పెద్ద వైద్యచికిత్స కేంద్రం (మెడికల్‌ సెంటర్‌)లో పల్మునాలజిస్టులను సంప్రదించి, ఈ చికిత్స తీసుకోవచ్చు.

రాత్రిళ్లువిపరీతంగాదగ్గు వస్తోంది...సలహా ఇవ్వండి
నా వయసు 36 ఏళ్లు. ఉద్యోగంలో భాగంగా నేను రోజుకు దాదాపు100 కిలోమీటర్ల దూరం బైక్‌పై ప్రయాణం చేస్తుంటాను. విపరీతమైన రద్దీలో, కాలుష్యంలో తిరగడం అన్నది నా వృత్తిపరంగా తప్పడం లేదు. దీనికి తోడు స్మోకింగ్‌ కూడా బాగా అలవాటు ఉంది. కొన్నేళ్లుగా తరచూ జలుబు, దగ్గుతో బాధపడుతున్నాను. ముఖ్యంగా రాత్రివేళ దగ్గు తీవ్రంగా వస్తోంది. ఊపిరి కూడా ఆడటం లేదు. ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా, ఎన్ని మందులు వాడినా నా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో సలహా చెప్పండి.– ఆర్‌. సుభాష్, సనత్‌నగర్, హైదరాబాద్‌

మీరు తరచూ జలుబు, దగ్గు, ఊపిరాడని సమస్యలతో బాధపడుతున్నారంటే... మీ శ్వాసనాళాలు (ముక్కు నుంచి ఊపిరితిత్తులకు గాలిని మోసుకుపోయే గొట్టాలు) రోగగ్రస్తం అయినట్లుగా సూచిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణాలు రెండు. మొదటిది మీ స్మోకింగ్‌ అలవాటు. రెండోది ఉద్యోగరీత్యా మీరు ప్రతినిత్యం ఎదుర్కొంటున్న వాతావరణ కాలుష్యం. ఇప్పటివరకు ఎంతోమంది డాక్టర్లను కలిశానన్నారు. ఎన్నోరకాల మందులు వాడారన్నారు. కానీ మీ సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటైన స్మోకింగ్‌ను మాత్రం విడిచిపెట్టలేదు. కాబట్టి స్మోకింగ్‌ పూర్తిగా మానేయడం మీ చికిత్సలో తొలిమెట్టు. సిగరెట్‌పొగలో ఊపిరితిత్తులు, శ్వాసమార్గాలను ధ్వంసం చేసే విషతుల్యమైన రసాయనాలు కోకొల్లలుగా ఉంటాయి. అవి ఊపిరితిత్తులకు సహజసిద్ధంగా ఉండే రక్షణ వ్యవస్థ మొత్తాన్ని ధ్వంసం చేస్తాయి. స్మోకింగ్‌ కారణంగా శ్వాసమార్గాలు గట్టిపడిపోయి గాలి వెళ్లే దారులన్నీ సన్నబడిపోతాయి. అందువల్ల చీమిడి అధికంగా ఉత్పత్తి జరిగి దగ్గు, ఊపిరాడని పరిస్థితికి దారితీస్తుంది. మీ అంతట మీరే స్మోకింగ్‌ అలవాటు మానలేకపోతే దాన్ని మాన్పించడానికి అవసరమైన మందులు ఉన్నాయి. వాటిని వాడటం వల్ల సిగరెట్‌ తాగాలన్న కోరిక క్రమేపీ సన్నగిల్లుతుంది.

ఇక రెండోది వాతావరణ కాలుష్యం. మానవ శరీరంలోకి ప్రధానద్వారం (గేట్‌ వే) వంటివి ఊపిరితిత్తులు. వాతావరణంలో ఉండే సల్ఫర్‌డైఆక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ వంటి కాలుష్యాలను పీల్చడం వల్ల... ముఖ్యంగా మీ విషయంలో ఇవి చాలా ప్రమాదకర స్థాయికి చేరినట్లుగా అనిపిస్తోంది. కాబట్టి ట్రాఫిక్‌ లేని సమయంలో, రద్దీ తక్కువగా ఉండే మార్గాలలో ప్రయాణించడం, వీలైతే బైక్‌పై ప్రయాణాన్ని మానుకోవడం ద్వారా కాలుష్యం బారినుంచి కాపాడుకోవచ్చు. ఇక మీ ప్రస్తుత సమస్యకు మూలాలు ఎక్కడున్నాయో కనుక్కోవాలి. అందుకోసం మీరు ఊపిరితిత్తుల స్పెషలిస్ట్‌ దగ్గరికి వెళ్లి చెస్ట్‌ ఎక్స్‌రే, పల్మనరీ ఫంక్షన్‌ టెస్ట్‌ వంటి పరీక్షలు చేయించుకోండి. వాటి ఫలితాలను బట్టి చికిత్స ప్రారంభిస్తారు. అయితే కేవలం మందులతో మాత్రమే కాకుండా మీ జీవనశైలిలో కొన్ని మార్పులు కూడా చికిత్సలో భాగమైనప్పుడు మాత్రమే ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్న వాస్తవాన్ని గ్రహించండి.-డాక్టర్‌ కె. యుగవీర్‌ గౌడ్,సీనియర్‌ పల్మునాలజిస్ట్‌ అండ్‌చెస్ట్‌ ఫిజిషియన్,యశోద హాస్పిటల్స్, మలక్‌పేటహైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement