ఇది మలేషియన్ విమానం పంపిన సిగ్నలేనా?
హిందూమహాసముద్ర గర్భంలో కుప్ప కూలిన మలేసియన్ విమానం నుంచి ఎలక్ట్రానిక్ పల్స్ సిగ్నల్ రూపంలో వచ్చిందా? అది విమానం నుంచి వచ్చిన సందేశమేనా?
జాడతెలియకుండా పోయిన మలేషియన్ విమానం కోసం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో పలు దేశాలు అన్వేషణ జరుపుతున్నాయి. అమెరికా నుంచి ఒక ప్రత్యేక సోనార్ సెన్సార్ ఉన్న సబ్మెరీన్ కూడా ఈ గాలింపులో పాల్గొంటూంది. ఇదే సమయంలో చైనాకి చెందిన హైగ్జున్ 01 అనే పెట్రోలింగ్ పడవక హిందూ మహాసముద్ర జలాల్లోనుంచి సెకనుకు 37.5 కిలో హెర్జ్ ఫ్రీక్వెన్సీతో ఒక సిగ్నల్ వచ్చింది. మలేషియన్ విమానం ఎం హెచ్ 370 లో బ్లాక్ బాక్స్ ను తయారు చేసిన డుకానె సీకామ్ సంస్థ ఈ సిగ్నల్ విమానం నుంచి వెలువడే సిగ్నల్ కి చాలా దగ్గరగా ఉందని పేర్కొంది.
గత ఇరవై ఎనిమిది రోజుల గాలింపులో లభించిన అత్యంత ముఖ్యమైన సూచనల ఇదే. ఒక వైపు బ్లాక్ బాక్స్ బాటరీ చార్జింగ్ ఇంకొన్ని గంటల్లో అయిపోతుందనగా ఈ పల్స్ సిగ్నల్ లభించడం విశేషం. ఈ పల్స్ సిగ్నల్ కూడా బ్యాటరీ చార్జింగ్ పూర్తయితే రావడం మానేస్తుంది.
విమానం మార్చి 8 న అంతర్ధానమైంది. దాని కోసం పలు దేశాల నౌకలు, విమానాలు వెతుకులాట కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం పదమూడు ఎయిర్ క్రాఫ్టులు, 11 పడవలు అన్వేషణ జరుపుతున్నాయి.