Pulses Marketing
-
పప్పుల ధరలు తగ్గించండి
న్యూఢిల్లీ: పప్పుల విక్రయాల్లో లాభాల మార్జిన్లు తగ్గించుకోవాలంటూ రిటైలర్లకు కేంద్రం కీలక సూచన చేసింది. గడిచిన నెల రోజుల్లో హోల్‌సేల్ మార్కెట్లో కందిపప్పు, మినపపప్పు, శనగపప్పు ధరలు 4 శాతం వరకు తగ్గగా.. వాటి రిటైల్ ధరలు అంత మేర తగ్గకపోవడాన్ని కేంద్రం గుర్తించింది. దీంతో సహేతుక లాభాలకు పరిమితమై, వినియోగదారులకు ఉపశమనాన్ని కలి్పంచాలంటూ రిటైలర్లను కేంద్ర ప్రభుత్వం కోరింది. అనుచిత వ్యాపార విధానాలు, లాభాపేక్షతో వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ గట్టి హెచ్చరిక పంపింది. రిటైలర్ల సమాఖ్య (ఆర్ఏఐ), రిటైల్ సంస్థలతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంగళవారం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కందిపప్పు, శనగపప్పు నిల్వలపై ఆ శాఖ కార్యదర్శి నిధి ఖరే సమీక్ష నిర్వహించారు. ఆర్ఏఐ ప్రతినిధులు, రిలయన్స్ రిటైల్, డీమార్ట్, టాటా స్టోర్స్, స్పెన్సర్స్, వీమార్ట్ తదితర సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఆర్ఏఐ పరిధిలో 2,300 మంది సభ్యులు (రిటైలర్లు), 6 లక్షల రిటైల్ స్టోర్లు ఉన్నాయి. హోల్ సేల్ ధరలు, రిటైల్ ధరల మధ్య భిన్నమైన ధోరణులు ఉన్నాయని, రిటైలర్లు అధిక మార్జిన్లు పొందుతున్నట్టు తెలుస్తోందని నిధి ఖరే సమావేశంలో స్పష్టం చేశారు. ధరల నియంత్రణకు, వినియోగదారులకు సరసమైన ధరలకు అందించే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నిలవాలని ఆమె రిటైలర్లను కోరారు. -
రూ.5.98కోట్ల నిల్వలు!
⇒ తాండూరు మార్కెట్ యార్డులో ⇒ పేరుకుపోతున్న పప్పుధాన్యాల ఉత్పత్తులు ⇒ ధరల తగ్గుదలతో విక్రయానికి ఆసక్తి చూపని రైతులు తాండూరు: పప్పుధాన్యాల విక్రయానికి రైతులు ఆసక్తి చూపకపోవడంతో తాండూరు వ్యవసాయ మార్కెట్‌యార్డులో దాదాపు రూ.5.98 కోట్ల విలువైన నిల్వలు పేరుకుపోయాయి. నిన్నా మొన్నటి వరకు జోరుగా సాగిన ఉత్పత్తుల క్రయవిక్రయాలు పడిపోయాయి. వేరుశనగలకు ధరలు తగ్గటంతో విక్రయాలపై ప్రభావం పడింది. దీంతో కోట్లాది రూపాయల విలువ చేసే కందులు, వేరుశనగల ఉత్పత్తుల నిల్వలు యార్డులో పేరుకుపోయాయి. ముఖ్యంగా వేరుశనగల నిల్వలు భారీగా పేరుకుపోయాయి. కమీషన్ ఏజెంట్ల సమావేశం, హమాలీల లోడింగ్ వ్యవహారంతో సోమవారం యార్డులో బీట్లు నిలిచిపోయాయి. మంగళవారం బీట్లు ప్రారంభమైనా ధరలు తగ్గటంతో రైతులు ఉత్పత్తుల విక్రయానికి ముందుకురాలేదు. మొన్న రూ.47.15 లక్షల వ్యాపారం శనివారం యార్డులో క్వింటాలు కందులకు గరిష్టంగా రూ.6,210, కనిష్టంగా రూ.5,900, సగటు ధర రూ.6వేలు పలికింది. సగటు ధర రూ.6వేల ప్రకారం సుమారు రూ.30 లక్షల విలువైన కందుల కొనుగోళ్లు జరిగాయి. అదేవిధంగా క్వింటాలు వేరుశనగలకు గరిష్టంగా రూ.5వేలు, కనిష్టంగా రూ.4,700, సగటు ధర రూ.4,900 వచ్చింది. సగటు ధర లెక్కన రూ.17.15 లక్షల విలువైన వేరుశనగల విక్రయాలు జరిగాయి. మొత్తం శనివారం ఒక్క రోజు రూ.47.15 లక్షల పప్పుధాన్యాల వ్యాపారం జరిగింది. ఆదివారం సెలవు, సోమవారం బీట్లు జరగలేదు. రూ.16.98 లక్షల వ్యాపారం మంగళవారం రూ.16.98 లక్షల వ్యాపారమే కావడం గమనార్హం. సోమవారం బీట్లు నిలిచిపోయిన నేపథ్యంలో మంగళవారం ఇంతకు రెట్టింపు విక్రయాలు జరగాల్సి ఉండగా తగ్గాయి. కందులకు సగటు ధర రూ.6వేలు, వేరుశనగలకు రూ.4,800 ధర పలికింది. శనివారం ధరలతో వీటిని పోల్చితే కందుల ధరలో మార్పు లేకపోయినప్పటికీ వేరుశనగల సగటు ధరలో సుమారు రూ.100 తగ్గింది. దీంతో యార్డులో వేరుశనగలు పేరుకుపోయాయి. మంగళవారం పలికిన సగటు ధర ప్రకారం ప్రస్తుతం యార్డులో సుమారు రూ.2.94కోట్ల విలువ చేసే వేరుశనగల నిల్వలు పేరుకుపోయాయని అంచనా. కందులు ఇలా... కందులకు ఇంకా అధిక ధర వస్తుందనే ఆశతో రైతులు విక్రయానికి ఆసక్తి చూపడం లేదు. రూ.6,100-రూ.6,200 ధర పెరుగుతుందనే ఆశతో రైతులు పంటను అమ్మడం లేదు. దీంతో రూ.3కోట్ల విలువ చేసే కందుల నిల్వలు కూడా యార్డులో పేరుకుపోయినట్టు ఓ వ్యాపారి చెప్పారు. కందులకు ఇంకా ధర పెరుగుతుందని, వేరుశనగలకు ధర తగ్గిందనే కారణాలతోనే రైతులు తమ దిగుబడులను అమ్మడం లేదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.