పుణే బస్ డ్రైవర్ మరణశిక్ష వాయిదా
ముంబై: పుణే బస్ డ్రైవర్ మరణ శిక్షను బాంబే హైకోర్టు వాయిదా వే సింది. అధికారుల మీద కోపంతో బస్సును అడ్డదిడ్డంగా నడిపి తొమ్మిది మంది మృతికి, 37 మంది గాయాలపాలు కావడానికి కారకుడైన సంతోష్ మానేకు ట్రయల్ కోర్టు ఏప్రిల్ 8న మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. తనకు విధించిన శిక్షపై మానే వాదనను ట్రయల్ కోర్టు వినలేదన్న కారణంతో మానేకు విధించిన మరణ శిక్షను హైకోర్టు వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఖరారు చేసే సందర్భంలో న్యాయమూర్తి పీవీ హర్దాస్, పీఎన్ దేశ్ముఖ్లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
మానే వాదనను కూడా వినాల్సిన అవసరాన్ని న్యాయస్థానం గుర్తించాలని పేర్కొంది. కేసును మళ్లీ ట్రయల్ కోర్టుకే బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. మానే తరఫు వాదనను కూడా వినాలని ట్రయల్ కోర్టుకు సూచిందింది. మానేను అక్టోబర్ 15న ట్రయల్ కోర్టులో హాజరుపర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఆయన తరఫు వాదన కూడా విన్న తర్వాత న్యాయమూర్తి శిక్షను విధించాలని పేర్కొంది.