పుణె క్యాచే 'సూపర్'
కోల్కతా: బెంగళూరు టెస్టులో పట్టిన డైవింగ్ క్యాచ్ కంటే పుణె తొలి టెస్టులో క్యాచే మిన్న అని భారత వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహా తెలిపాడు. వికెట్ కీపర్ గా మరింత ఎదగడానికి ఈ తరహా క్యాచ్ లు దోహదం చేస్తాయని సాహా ఆనందం వ్యక్తం చేశాడు. ఆసీస్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో రెండు అద్భుతమైన క్యాచ్ లను పట్టినప్పటికీ పుణె టెస్టులో పట్టిన క్యాచే కఠినమైనదిగా తెలిపాడు. 'బెంగళూరులో పట్టిన ఒక క్యాచ్ కంటే పుణె టెస్టులో పట్టిన క్యాచే అద్భుతం. ఉమేశ్ యాదవ్ వేసిన బంతికి నేను స్పందించిన సమయం చాలా తక్కువ. చాలా తక్కువ సమయంలో ఆ క్యాచ్ ను ఒడిసి పట్టుకున్నా. అదే బెస్ట్ క్యాచ్' అని తన సాహా రేటింగ్ ఇచ్చుకున్నాడు. ఈ క్యాచ్ తరువాత తనను సూపర్ మ్యాన్ అంటూ పొగడటంపై సాహా సంతోషం వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత పేసర్ ఉమేశ్ యాదవ్ 82 ఓవర్ లో సాహా గాల్లో డైవ్ కొట్టి క్యాచ్ ను అందుకున్న తీరు అదుర్స్ అనిపించింది. ఉమేశ్ 141కి.మీ వేగంతో సంధించిన ఆ బంతిని ఆసీస్ ఆటగాడు ఓకీఫ్ కట్ చేయబోయాడు. అదే వేగంతో ఆ బంతి ఫస్ట్ స్లిప్ కు దారి తీసింది. అయితే సాహా మాత్రం రెప్పపాటులో గాల్లో చక్కటి డైవ్ కొట్టి క్యాచ్ ను అందుకున్నాడు. అసాధారణ రీతిలో సాహా క్యాచ్ పట్టడం టీమిండియా సభ్యుల్ని ఒక్కసారిగా నిశ్చేష్టుల్ని చేసింది. దీనిపై విరాట్ కోహ్లి ప్రశంసల కురిపించిన సంగతి తెలిసిందే. మరొకవైపు సాహా పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యింది.