ఓటు వేస్తే సినిమా టికెట్‌పై రాయితీ
పుణె: ఓటు హక్కు వినియోగించుకునే వారికి అనేక సంస్థలు రాయితీలను ప్రకటిస్తున్నాయి. తాజాగా పుణే పింప్రీ–చించ్వడ్లో ఓటు హక్కు వినియోగించుకుంటే సినిమా టిక్కెట్లపై 15 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు మల్టిప్లెక్స్ అసోసియేషన్ ప్రకటించింది. దీంతో సినిమా అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
పుణే, పింప్రీ–చించ్‌వడ్‌లతో పాటు రాష్ట్రంలోని పది మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ నెల 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా అనేక సంస్థల సహకారం కోరింది. దీంతో పుణే, పింప్రీ–చించ్‌వడ్‌లోని మల్టిప్లెక్స్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. ఓటు హక్కు వినియోగించుకున్న వారికి సినిమా టిక్కెట్లపై 15 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా 21వ తేదీ సెలవు దినంగా కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు అనేక హోటళ్లు కూడా ఓటు హక్కు వినియోగించుకున్న వారికి రాయితీలను ప్రకటించాయి.