ఎక్స్‌ప్రెస్ హైవేపై వాహనాల వేగానికి కళ్లెం
పింప్రి, న్యూస్‌లైన్ : పుణే-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై వాహనాలు వేగాన్ని నియంత్రించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హైవేపై గంటకు 120 నుంచి 150 కి.మీ. వేగంతో వాహనాలు దూసుకెళ్తుంటాయి. గంటకు 80 కి.మీ వెళ్లాలనే వేగనియంత్రణను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో చాలా మంది వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.
ఈ ప్రమాదాలను అరికట్టేందుకు వేగంగా వెళ్లే వాహనాలకు కళ్లెం వేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా వడగావ్, ఖండాలా వద్ద వాహనాల వేగాన్ని అంచనా వేయాలని, వేగంలో నియమ నిబంధనలు పాటించని వాహన దారులపై టోల్‌నాకా ప్లాజాల వద్ద చర్యలు తీసుకోనున్నట్లు సంబంధిత అధికారి పేర్కొన్నారు.
మితి మీరిన వేగంతో 30శాతం వాహనాలు
ఈ మార్గంపై గంటకు కేవలం 80 కి.మీ. వేగంతో వాహనాలను నడపాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ 30 శాతం వాహనాలు గంటకు 120 నుంచి 150 కి.మీ. వేగంతో వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని వాహనాలు గంటకు 170 కి.మీ. వేగంతో నడుస్తున్నట్లు పోలీసుల రికార్డులు తెలియజేస్తున్నాయి. వారం రోజులుగా సుమారుగా 172 వాహనాలు వేగ నిబంధనలు పాటించ లేదని హైవే మార్గాల విభాగ పోలీసు ఇన్స్పెక్టర్ సుధీర్ అస్పట్ తెలిపారు. దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. హైవేపై ప్రమాదాలను నివారించడమే వేగనియంత్రణ ఉద్దేశమని చెప్పారు.