పరుగు ఆపని ధీరుడు!
అది 2000వ సంవత్సరం. లండన్ మారథాన్ మొదలైంది. అతడు హుషారుగా పరుగందుకున్నాడు. ఇరవయ్యారు కిలోమీటర్లు... అవలీలగా పరిగెత్తేశాడు. తొంభై రెండేళ్ల వయసులో ఓ వ్యక్తి అన్ని కిలోమీటర్లు పరుగుపెట్టడంతో అందరిలోనూ ఆశ్చర్యం!
ఫౌజా సింగ్ను చూస్తే వయసుడిగిన శరీరంలోకి నవ యవ్వనుడి ఆత్మ ప్రవేశించిందేమో అన్న అనుమానం వస్తుంది ఎవరికైనా. ఉరకలెత్తే ఉత్సాహం, వెనకడుగు వేయని తెగువ చూస్తే అతడి ముందు యువత కూడా పనికి రాదనిపిస్తుంది. మన దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో జన్మించాడు ఫౌజా సింగ్. పుట్టుకతోనే నరాల బలహీనత ఉంది సింగ్కి. దాంతో ఐదేళ్లు వచ్చినా నడవలేకపోయేవాడు. తరువాత మెల్లగా నడక వచ్చినా కాస్త దూరం నడవగానే అలసిపోయేవాడు. పీలగా ఉన్న అతడి కాళ్లను చూసి తోటి పిల్లలంతా అవహేళన చేసేవారు.
దాంతో పంతం పెరిగి, పట్టుదలతో కాళ్లను అదుపులోకి తెచ్చుకున్నాడు. నడవడమే కాదు... యవ్వనంలోకి వచ్చేసరికి పరుగు పందాల్లో పాల్గొనేలా తయారయ్యాడు. అయితే దేశ విభజనప్పుడు వారి కుటుంబం బ్రిటన్కు వెళ్లిపోయింది. తర్వాత జీవనభృతి కోసం తప్ప పరుగు కోసం సమయాన్ని కేటాయించలేకపోయాడు. కానీ కొన్నేళ్ల తరువాత మళ్లీ ఫౌజా సింగ్ పాదాలు పరుగెత్తాలని తహతహలాడాయి. దానికి కారణం... జీవితంలోని విషాదం.
అనారోగ్యంతో భార్య మరణించింది. కొడుకు ప్రమాదవశాత్తూ భవంతి మీద నుంచి కింద పడి మరణించాడు. బిడ్డకు జన్మనిస్తూ కూతురు కన్నుమూసింది. ఆలోచనలను మరోవైపు మళ్లిద్దామనుకొన్నప్పుడు అతడికి తనకిష్టమైన ‘పరుగు’ గుర్తుకొచ్చింది. అదే 92 ఏళ్ల వయసులో అతడిని మారథాన్లో పాల్గొనేలా చేసింది. నాటి నుంచి నేటి వరకూ పరుగెత్తుతూనే ఉన్నాడు. రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు!