punjab cabinet
-
గుర్బానీ ప్రసారాలు ఉచితం
చండీగఢ్: సిక్కులు పఠించే పవిత్ర శ్లోకం గుర్బానీ ఇకపై ఉచితంగా ప్రఖ్యాత స్వర్ణదేవాలయం నుంచి ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన బ్రిటిష్‌కాలంనాటి చట్టానికి చేసిన సవరణ ప్రతిపాదనలకు పంజాబ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. మంగళవారం శాసనసభలో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం ప్రకటించారు. ఇన్నాళ్లూ గుర్బానీని రాష్ట్రంలో శక్తివంతమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన ప్రైవేట్ చానెల్ పీటీసీ ప్రసారం చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్జీపీసీ) మండిపడింది. ‘ఆ చట్టాన్ని పార్లమెంట్ చేసింది. దీనికి సవరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. సిక్కుల మత సంబంధ వ్యవహారాలకు ఆప్ ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోంది’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘చట్ట పరిధిపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. ఇది రాష్ట్ర పరిధిలోనిది’ అని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ గుర్బానీ వినిపించేటపుడు అడ్వర్ట్టైజ్మెంట్లు ఉండకూడదనే ఉద్దేశంతో∙ప్రత్యక్షంగా ఉచితంగా ఆడియో, వీడియో ప్రసారాలు చేస్తున్నాం’ అని ప్రభుత్వం ప్రకటించింది. పీటీసీ ప్రైవేట్ చానెల్‌కు అధిపతి అయిన శిరోమణి అకాళీదళ్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకే సర్కార్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. -
Punjab: ఆప్ నేతపై అవినీతి ఆరోపణలు.. మంత్రి పదవికి రాజీనామా
చండీగఢ్: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఆహారశుద్ధి, ఉద్యానవన శాఖ మంత్రి ఫౌజా సింగ్ సరారీ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే వైదొలుగుతున్నట్లు తెలుపుతూ తన రాజీనామా లేఖను సమర్పించారు సరారీ. తాను పార్టీకి నమ్మకమైన సైనికుడినని, పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే, తనపై అవినీతి ఆరోపణలు వచ్చిన కొన్ని నెలల్లోనే రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి ఫౌజా సింగ్ సరారీపై నాలుగు నెలల క్రితం అవినితీ ఆరోపణలు వచ్చాయి. ఆయన ఓఎస్డీ తర్సెమ్ లాల్ కపూర్‌తో మాట్లాడిన ఓ ఆడియో వెలుగులోకి రావటం మంత్రిని ఇరుకునపెట్టింది. ఆహారధాన్యాల కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకునే విషయంపై ఇరువురు మాట్లాడుకున్నట్లు ఆ ఆడియోలో బయటపడింది. దీంతో మంత్రితో పాటు ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఫౌజాను మంత్రివర్గం నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. అయితే ఆ ఆరోపణలను ఖండించారు ఫౌజా. మంత్రి రాజీనామా చేసిన క్రమంలో శనివారం సాయంత్రం పంజాబ్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. సరారీ స్థానంలో పాటియాలా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ బల్బీర్ సింగ్ లేదా జాగ్రాన్ ఎమ్మెల్యే సరవ్‌జిత్ కౌర్ మనుకే మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: అథ్లెట్ మహిళా కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా! -
సీఎం జగన్ బాటలోనే పంజాబ్ ప్రభుత్వం
చండీగఢ్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాదరణ పొందిన ‘ఇంటివద్దకే రేషన్ సరుకుల పంపిణీ’ పథకాన్ని పంజాబ్ ప్రభుత్వం అందిపుచ్చుకుంది. లబ్ధిదారులకు ఇళ్ల వద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. సోమవారం ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 26,000 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ముక్తసర్ జిల్లాలో పత్తి రైతులకు రీయింబర్స్మెంట్ కింద రూ.41.89 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. కేబినెట్ నిర్ణయం మేరకు రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి గోధుమ పిండితోపాటు ఇతర సరుకులను హోం డెలివరీ చేయనున్నారు. మొబైల్ ఫెయిర్ ప్రైస్ షాప్స్(ఎంపీఎస్)గా పిలిచే రవాణా వాహనాల్లో రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు చేరవేస్తారు. చదవండి👉🏾 (సీఎం జగన్ బాటలో స్టాలిన్.. తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ) -
సిద్ధూను మంత్రివర్గం నుంచి తొలగించండి!
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ భారతీయులను అవమానించిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను పంజాబ్ మంత్రివర్గం నుంచి తొలగించాలని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. దేశంలోని భిన్నంత్వంలోని ఏకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవించదా? అని ఆయన ప్రశ్నించారు. క్రికెటర్‌గా సిద్ధుని దేశమొత్తం గౌరవించిందని, ఆయన పాకిస్తాన్ ముసుగులా వ్యవహరించరాదని చెప్పారు. దక్షిణ భారత్ కంటే పాకిస్తాన్ వెళ్లడమే బెటర్ అని సిద్ధూ తాజాగా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కసౌలి లిటరేచర్ మొదటి ఎడిషన్ ఫెస్టివల్లో పాల్గొన్న ఆయన.. పాక్‌పై ఉన్న ప్రేమను మరో సారి బయటపెట్టారు. ‘ఒకవేళ నేను దక్షిణ భారత్‌కి వెళితే అక్కడ ఎక్కువ కాలం ఉండలేను. నాకు వారి భాష అర్థం కాదు. వారి వంటలు నేను తినలేను. కేవలం ఇండ్లీ మాత్రమే తినగల్గుతాను. అంతేకాని సౌత్ ఇండియా వారి వంటలను ఎక్కుకాలం తినలేను. వారి అలవాట్లు, సంస్కృతి వేరు. కానీ నేను పాకిస్తాన్ వెళితే వారితో సులభంగా కలిసిపోగలను. వారు పంజాబీ, ఆంగ్లం మాట్లాడగల్గుతారు. అందుకే నాకు దక్షిణ భారత్ కంటే పాకిస్తాన్ వెళ్లడమే ఇష్టం’ అని సిద్ధూ అన్నారు. అంతకుముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిద్ధూ.. ఈ సందర్భంగా ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకొని విమర్శలు పాలైన విషయం తెలిసిందే. జవాన్లను చంపిన వ్యక్తిని ఆలింగనం చేసుకోవడం ఏంటని చాలా మంది మండిపడ్డారు. అయితే, పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడాన్ని సిద్ధూ సమర్థించుకున్నారు. ‘ఆ కౌగిలింత యాదృచ్ఛికంగా జరిగింది. పాకిస్తాన్లో ఉన్న కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కారిడార్‌ను తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ చీఫ్ వెల్లడించారు. ఈ సందర్భంగా నేను ఆప్యాయంగా మాట్లాడాను. అందులో తప్పేం ఉంది. పంజాబ్ పెద్ద రాష్ట్రం. ఐదు నదులతో ఈ రాష్ట్రం ఏర్పడింది. కానీ విభజన సందర్భంగా రెండు నదులు పాకిస్తాన్ వైపు వెళ్లాయి. కౌగిలింతను పక్కకు పెట్టండి. నేను అతన్ని ముద్దుపెట్టుకుంటాను ’అని సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
సిద్ధూ.. కొన్నాళ్లు ఆగు!
ఒకవైపు పంజాబ్ కేబినెట్లో మంత్రిగా వ్యవహరిస్తూ, మరోవైపు అత్యధిక టీఆర్పీ రేటింగు వచ్చే కపిల్ శర్మ షోలో కూడా పాల్గొనాలనుకున్న మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఆశల మీద నీళ్లు చల్లారు. తన కుటుంబాన్ని పోషించుకోడానికి టీవీ కార్యక్రమాలు చేస్తానని చెప్పిన ఆయనను.. కొన్నాళ్లు ఆగమని ప్రభుత్వం సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ మంత్రివర్గంలో సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రిగా ఉన్నందున.. సాంస్కృతిక శాఖతో ప్రత్యక్ష సంబంధం ఉండే టీవీ షోలలో పాల్గొనడం అంత మంచిది కాదని ఆయనకు చెప్పారట. ఈ విషయాన్ని ప్రభుత్వ న్యాయవాదులే తేల్చేశారు. మంత్రులు ప్రైవేటు పనులు చేసుకోకూడదని తెలిపారు. పంజాబ్‌లో ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఎంతగానో ఆశపడిన సిద్ధూకు చివరికి అంతగా ప్రాధాన్యం లేని శాఖలు రావడంతో ఆయన తీవ్రంగా అసంతృప్తి చెందారు. అందుకే తాను ఈ షోలో పాల్గొనడం కొనసాగిస్తానన్నారు. తాను రాత్రిపూట ఇలా టీవీ షోలు చేసుకుంటాను తప్ప మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ లాగ బస్సుల వ్యాపారం చేయలేనని, డబ్బు సంపాదనకు అవినీతికి పాల్పడలేనని చెప్పారు. తన ఓటర్లకు తాను టీవీ షోలు చేసినా అభ్యంతరం లేదని, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు తాను ఏం చేస్తే ఎవరికి నష్టమని సిద్ధూ అడిగారు. టీవీ షోలకు సంబంధించిన 75 శాతం పని ఇప్పటికే వదిలేశానని, ఐపీఎల్లో కామెంట్రీ చెప్పడం లేదని, ఇక తన చట్టబద్ధమైన సంపాదనను పూర్తిగా ఆపేయాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.