సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ భారతీయులను అవమానించిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను పంజాబ్ మంత్రివర్గం నుంచి తొలగించాలని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. దేశంలోని భిన్నంత్వంలోని ఏకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవించదా? అని ఆయన ప్రశ్నించారు. క్రికెటర్‌గా సిద్ధుని దేశమొత్తం గౌరవించిందని, ఆయన పాకిస్తాన్ ముసుగులా వ్యవహరించరాదని చెప్పారు. దక్షిణ భారత్ కంటే పాకిస్తాన్ వెళ్లడమే బెటర్ అని సిద్ధూ తాజాగా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
కసౌలి లిటరేచర్ మొదటి ఎడిషన్ ఫెస్టివల్లో పాల్గొన్న ఆయన.. పాక్‌పై ఉన్న ప్రేమను మరో సారి బయటపెట్టారు. ‘ఒకవేళ నేను దక్షిణ భారత్‌కి వెళితే అక్కడ ఎక్కువ కాలం ఉండలేను. నాకు వారి భాష అర్థం కాదు. వారి వంటలు నేను తినలేను. కేవలం ఇండ్లీ మాత్రమే తినగల్గుతాను. అంతేకాని సౌత్ ఇండియా వారి వంటలను ఎక్కుకాలం తినలేను. వారి అలవాట్లు, సంస్కృతి వేరు. కానీ నేను పాకిస్తాన్ వెళితే వారితో సులభంగా కలిసిపోగలను. వారు పంజాబీ, ఆంగ్లం మాట్లాడగల్గుతారు. అందుకే నాకు దక్షిణ భారత్ కంటే పాకిస్తాన్ వెళ్లడమే ఇష్టం’ అని సిద్ధూ అన్నారు. అంతకుముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిద్ధూ.. ఈ సందర్భంగా ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకొని విమర్శలు పాలైన విషయం తెలిసిందే. జవాన్లను చంపిన వ్యక్తిని ఆలింగనం చేసుకోవడం ఏంటని చాలా మంది మండిపడ్డారు. అయితే, పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడాన్ని సిద్ధూ సమర్థించుకున్నారు.
‘ఆ కౌగిలింత యాదృచ్ఛికంగా జరిగింది. పాకిస్తాన్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కారిడార్‌ను తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ చీఫ్ వెల్లడించారు. ఈ సందర్భంగా నేను ఆప్యాయంగా మాట్లాడాను. అందులో తప్పేం ఉంది. పంజాబ్ పెద్ద రాష్ట్రం. ఐదు నదులతో ఈ రాష్ట్రం ఏర్పడింది. కానీ విభజన సందర్భంగా రెండు నదులు పాకిస్తాన్ వైపు వెళ్లాయి. కౌగిలింతను పక్కకు పెట్టండి. నేను అతన్ని ముద్దుపెట్టుకుంటాను ’అని సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Sun, Oct 14 2018 2:55 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment