ఉగ్రదాడిపై రాజకీయ దుమారం
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ దాడిని అన్ని రాజకీయ పార్టీలూ ఖండించాయి. దీంతో పాటు రాజకీయ దుమారమూ రేగింది. పాక్‌తో వ్యవహారాల్లో ప్రధాని మోదీ తీరు బాగాలేదని కాంగ్రెస్ విమర్శించగా, దాడి అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ దుయ్యబట్టింది. కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా స్పందిస్తూ.. ‘మోదీ లాహోర్ వెళ్లి పాక్ ప్రధాని షరీఫ్‌ను కలిసిన వారం తర్వాత ఈ దాడి జరిగింది. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద సంస్థలకు ఐఎస్ఐ సాయం చేస్తూనే ఉందని రుజుైవెంది. పాక్‌పై ప్రభుత్వ విధానంలో తప్పటడుగులు పడుతున్నాయి’ అని అన్నారు. కాగా, దేశం మొత్తం మన వీరజవాన్లకు అండగా ఉండగా, కాంగ్రెస్ వేరే పాట పాడడం దురదృష్టకరమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవ దేకర్ అన్నారు. ఉగ్రవాదులపై పోరులో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లను రాష్ట్రపతి అభినందించారు.
సరిహద్దులను మూసేయాలి: సీఎం బాదల్
పఠాన్‌కోట్: ‘ దాడికి పాల్పడిన వారు సరిహద్దులు దాటే వచ్చారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అణచడానికి కేంద్రం పాక్‌తో ఉన్న సరిహద్దులను పూర్తిగా సమర్థంగా మూసేయాలి’ అని పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ అన్నారు. గురువారం రాత్రి పఠాన్‌కోట్‌కు దగ్గర్లో పాక్ ఉగ్రవాదులు గొంతుకోసి చంపేసిన ఇకగర్సింగ్ కుటుంబాన్ని ఆయన శనివారం పరామర్శించారు.