సాహిత్య అకాడమీ పదవికి మలగట్టి రాజీనామా
♦ అకాడమీ అవార్డు వెనక్కి
♦ ఇచ్చిన పంజాబీ రచయితలు
బెంగళూరు/చండీగఢ్: హేతువాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆ సంస్థలో మొదలైన రాజీనామాల పర్వం కొనసాగుతోంది. జనరల్ కౌన్సిల్ సభ్యత్వానికి డాక్టర్ అరవింద్ మలగట్టి ఆదివారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అకాడమీ అధ్యక్షుడు, కార్యదర్శికి పంపానన్నారు. కల్బుర్గి హత్యపై అకాడమీ మౌనంగా ఉండడాన్ని నిరసిస్తూ తానీ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కల్బుర్గి లాంటి వారిని చంపడం రాజ్యాంగ హక్కుల్ని హరించడమేనని రాజీనామా సందర్భంగా మలగట్టి అన్నారు.
అకాడమీ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్న రచయితల్లో పంజాబ్‌కు చెందిన మరో ముగ్గురు చేరారు. ప్రముఖ రచయితలు గుర్బచన్ భల్లార్, అజ్మీర్ సింగ్ ఔలఖ్, అతంజిత్ సింగ్, అమన్సేథ్, గుజరాత్ రచయిత గణేష్ దేవి తమకు అకాడమీ ప్రదానం చేసిన అవార్డులు వెనక్కి ఇచ్చేస్తున్నామని ఆదివారం ప్రకటించారు. అభ్యుదయ రచయితలు, హేతువాదులపై దాడులకు నిరసనగా తామీ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.
రచయితల భావప్రకటన స్వేచ్ఛకు అకాడమీ కట్టుబడి ఉంది
వరుస రాజీనామాలు.. అవార్డులు వెనక్కి ఇస్తున్న నేపథ్యంలో అకాడమీ చైర్మన్ తివారీ ఆదివారం ఒక ప్రకటన చేశారు. అకాడమీ దేశంలో రచయితల భావప్రకటనా స్వేచ్ఛకు కట్టుబడి ఉందని.. ఏ రచయిత లేదా కళాకారుడిపైన దాడి జరిగినా అది ఖండనార్హమని స్పష్టం చేశారు. రచయితల గౌరవాన్ని పరిరక్షించేందుకు, స్వయంప్రతిపత్తి గల అకాడమీ ప్రతిష్టను కాపాడేందుకు రచయితలు అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.