తెలుగునాట బొమ్మలాట
నేడు వరల్డ్ పప్పెట్రీ డే
ఓ మధు, సాక్షి
భరతాది కథల జీరమఱుగల... నారంగ బొమ్మలనాడించు వారు... కడు అద్భుతంబుగ కంబసూత్రంబు... లారగ బొమ్మలాడించువారు ...
అనే పద్యం 12వ శతాబ్దానికి చెందిన పాల్కూరి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలో మనకు కనిపిస్తుంది. అలాగే ఆలయాలలో లభ్యమయిన ఆనాటి శాసనాలను బట్టి కూడా చూసినప్పుడు బొమ్మలాటలు అంతకు ముందునుంటే ఉన్నాయనే విషయం రూఢీ అవుతుంది. వేమన యోగిగా మారడానికి కూడా తోలుబొమ్మలాట కారణమైందని ఒక కథనం ప్రాచుర్యంలో వుంది. నాచనసోముడు బొమ్మలాట గురించి తన రచనలలో కూడా ప్రస్తావించాడు. తెలుగువారి ఆటను మరాఠీ వారు తేర్పుగా ఆడించి తమ వశం చేసుకున్నారని పరిశోధనలు తెలుపుతున్నాయి. అయినా నేటికీ తెలుగు జానపద కళారూపాలలో ఒకటిగా బొమ్మలాటలు కొనసాగుతున్నాయి.
ఇరు తెలుగు రాష్ట్రాలలో వివిధ రకాల బొమ్మలాటప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. వాటిలో కొన్ని: మందెచ్చులు: కథకి ఎక్కువ ప్రాముఖ్యత వుంటుంది. గొల్లకులానికి ఆశ్రీత కులస్తులు ఈ బొమ్మలాటను ప్రదర్శిస్తుంటారు. చెక్కబొమ్మలు: చక్కని చెక్కబొమ్మలు తయారు చేసి రామాయణ, మహాభారత గాథలు ప్రదర్శిస్తుంటారు. తోలుబొమ్మలు: బాగా ప్రాచుర్యంలో వున్న తోలుబొమ్మలాటలో ఒక్కొక్క బొమ్మను మలచటం నుంచి ప్రదర్శించే తీరు వరకూ చక్కటి కళా నైపుణ్యాన్ని చూడవచ్చు. పెద్దమ్మలు: నెత్తిన బొమ్మలు పెట్టుకుని ఆడిస్తారు. కీలుగుర్రాలు: గుర్రాలతో కూడిన బొమ్మలాట బుట్టబొమ్మలు: బొమ్మలను తొడుక్కుని ఆడుతారు. ప్రత్యేకంగా కథలు చెప్పటం వుండదు. పటం కథలు! పటాలపై చిత్రీకరించిన బొమ్మల ఆధారంగా కథ చెబుతారు. వీటిలో తోలు, కొయ్య, చెక్కబొమ్మలాటలలో మాత్రమే పూర్తి నిడివి బొమ్మలను చూపిస్తూ కథ చెప్పటం జరుగుతుంది. మార్చి 21
ప్రపంచ వ్యాప్తంగా మార్చి 21ని పప్పెట్రీడేగా సెలబ్రేట్ చేసుకోవటం 2000 సం॥నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో రకరకాల పప్పెట్ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఉగాది సందర్భంగా ప్రతి ఏడాది ఆదిలాబాద్‌లోని కళాశ్రమంలో జరిగే మిత్ ్రమిలాన్ వేడుకలలో... దేశవిదేశాల నుంచి అనేకమంది ప్రముఖులు పాల్గొంటారు. ఈ కళాసంరంభంలో మూడు రకాల బొమ్మలాట ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అలాగే కొడంగల్‌లోనూ రంగారెడ్డి జిల్లా కళాకారులు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సప్తపర్ణిలోనూ పిల్లల కోసం బొమ్మలాట నిర్వహిస్తున్నారు.
(ఇన్పుట్స్: గంజి మాధవీలత, పప్పెటీర్, రీసెర్చ్ స్కాలర్)