Purana Quila work
-
రాజధాని చరిత్రలో కొత్త వెలుగు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని చరిత్రలోకి కొత్త వెలుగు రానుంది. ఢిల్లీ నగరం నడిబొడ్డున ‘పురాణ ఖిల్లా’లో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) జరుపుతున్న తవ్వకాల్లో చరిత్రకు సంబంధించి మరిన్ని ఆధారాలు, వివరాలు తెలియనున్నాయి. ఇప్పటివరకు ఢిల్లీ చరిత్ర మనకు మౌర్యుల కాలం నుంచే అందుబాటులో ఉంది. కానీ, తాజాగా బయటపడిన ఆధారాలు ఢిల్లీకి అంతకు ముందే మరో 300 ఏళ్ల చరిత్ర ఉందనే విషయాన్ని చెప్పబోతున్నాయి. ఢిల్లీ 300 ఏళ్ల ముందుకు.. ఏ జాతి చరిత్ర తెలియాలన్నా.. ఆ కాలంలోని కుండలు, మట్టి పాత్రలు, ఇతర కట్టడాల పరిశీలన అవసరమని తవ్వకాలు చేపట్టిన చండీగఢ్ సర్కిల్ ఆర్కియాలజీ సూపరింటెండెంట్ స్వరణ్‌కర్ చెబుతున్నారు. మౌర్యుల కాలాన్ని నార్తర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ (పాలిష్ చేయబడిన నల్లని మట్టి పాత్రలు) తెలుపుతున్నాయని వివరించారు. పురాణ ఖిల్లా తాజా తవ్వకాల్లో మౌర్యుల కాలపు కళాఖండాలు లభించిన మట్టి పొర కిందే కొన్ని బూడిద, ఎరుపు రంగు పాత్రలు లభించాయని వెల్లడించారు. ఈ పాత్రలు మౌర్యుల పూర్వపు కాలాన్ని వెల్లడించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. వాటిని కార్బన్ డేటింగ్‌కు పంపించి నిర్ధారించుకుంటామని ఆయన చెప్పారు. ఇక లభించిన మట్టి పాత్రలు క్రీ.పూ. 6 - 4 శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నామన్నారు. అదే నిజమైతే ఢిల్లీకి మరో 300 ఏళ్ల చరిత్ర తోడవుతుందని స్వరణ్‌కర్ పేర్కొన్నారు. ఆ లెక్కన మహా జనపదాల కాలంలో ఢిల్లీ ప్రాంతం ఉనికిలో ఉన్నట్టేనన్నది రుజువవుతుంది. గతంలోనూ తవ్వకాలు... 1970, 2013-14 సంత్సరాల్లో పురాణ ఖిల్లాలో భారత పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టింది. అయితే అక్కడ ఎలాంటి కట్టడాలు, మట్టి పాత్రలు లభించలేదు. కానీ విరివిగా మట్టిపెంకులు బయటపడటంతో మళ్లీ తవ్వకాలు చేపట్టారు. ‘పురాణ ఖిల్లాలో తవ్వకాలు చేపట్టేందుకు మాకు 2013లో అనుమతి వచ్చింది. కానీ అప్పటి తవ్వకాలలో మౌర్యుల పూర్వపు ఆధారాలేమీ లభించలేదు. అయినా చివరి ప్రయత్నంగా ఈ ఏడాది మళ్లీ ఇక్కడ తవ్వకాలు ప్రారంభిచాం’అని స్వరణ్‌కర్ తెలిపారు. అయితే కాల్పనిక నగరం ఇంద్రప్రస్థానికి చెందిన ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని ఆయన అన్నారు. షేర్షాతో ధ్వంసం.. పురాణ ఖిల్లాకి 2500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ప్రాంతంపై సూర్ రాజైన షేర్ షా దండెత్తి నాశనం చేసినట్లు చరిత్ర చెబుతోంది. పర్యాటకుల సందర్శన కోసం తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో ప్రస్తుతం పురావస్తు శాఖ ఏర్పాట్లు చేసింది. -
త్వరలో ఎర్రకోటలో ఏఎస్ఐ తవ్వకాలు
న్యూఢిల్లీ: ప్రస్తుతం పురానా ఖిలాలో తవ్వకాలు జరుపుతున్న భారత పురావస్తు శాఖ త్వరలో ఎర్రకోటలో కూడా తవ్వకాలు జరపనుంది. అయితే పురానా ఖిలాలో తవ్వకాల పనులు పూర్తయిన తర్వాతే ఎర్రకోటపై దృష్టి సారించనున్నారు. ఈ విషయమై పురావస్తు విభాగం ప్రధాన పర్యవేక్షణ అధికారి వసంత్‌కుమార్ స్వరంకర్ మాట్లాడుతూ... ‘రెండుచోట్ల ఒకేసారి తవ్వకాలు జరిపేందుకు తగినంత సిబ్బంది మాకు అందుబాటులో లేరు. అందుకే పురానా ఖిలాలో పనులు పూర్తయిన తర్వాతే ఎర్రకోటలో తవ్వకాలు ప్రారంభిస్తాం. మొదట ఎర్రకోటలోని మెహతాబ్ బాగ్ ప్రాం తంలో మొదలుపెడతాం. ఈ ప్రాంతం స్వతంత్ర సంగ్రామ్ సంగ్రహాలయ్, మొఘల్ గార్డెన్ వరకు విస్తరించి ఉంది. ఎర్రకోటలో ప్రధానంగా రెండు గార్డెన్లు ఉన్నాయి. ఒకటి మెహతాబ్ గార్డెన్ కాగా రెండోది హయత్ భక్ష్ గార్డెన్. వీటిని 1648లో నిర్మించారు. అయితే 1863లో బ్రిటిష్‌వారు భక్ష్ గార్డెన్‌ను ధ్వంసం చేశారు. ఈ ధ్వంసకాండ ఎర్రకోట బయట, లోపల కూడా సాగింది. ఆ తర్వాత కాలంలో ఈ గార్డెన్లను సరిదిద్దారు. ఇక మెహతాబ్ గార్డెన్‌ను షాజహాన్ హయాంలో నిర్మిం చారు. దీనిని కూడా బ్రిటిషర్లు ధ్వంసం చేశారు. ఈ గార్డెన్ ఉన్న ప్రాంతం ప్రస్తుతం ఓ మైదానంలా ఉంది. అప్పట్లో దీనిని మూన్లైట్ గార్డెన్ అని కూడా పిలిచేవారు. ఈ గార్డెన్ మధ్యలో ఎర్రటి రాయితో లాల్ మహల్‌ను నిర్మించారు. అయితే ఈ గార్డెన్ నిర్మాణ నమూనాను గుర్తించేందుకే ఇక్కడ తవ్వకాలు నిర్వహించాలనుకుంటున్నాం. అంతేకాకుండా నీటి వనరులు, ఫౌంటెయిన్లు, కాలిబాటలను గుర్తించే ప్రయత్నం కూడా చేస్తాం. మొఘలుల కాలంలో జలవనరులు, కాలువల వంటివి ఎంతో ప్రాచుర్యం పొందాయి. పైగా వాటి నిర్మాణశైలి ఇప్పటికీ అద్భుతమే. తవ్వకాల పనులు పూర్తయిన తర్వాత మెహతాబ్ గార్డెన్ మళ్లీ నిర్మించే ప్రతిపాదనలను కూడా రూపొందిస్తామ’న్నారు. విద్యుత్ పొదుపునకు ఎల్ఈడీ లైట్లు... ఇదిలాఉండగా ఎర్రకోట అందాలను ధ్విగునీకృతం చేస్తూనే విద్యుత్ ఖర్చును తగ్గించుకునేందుకు ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. మే మాసాంతంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇటీవల పురానాఖిలాలో తవ్వకాలు ప్రారంభించిన పురావస్తుశాఖకు అక్కడ అనేక పురాతన, అరుదైన వస్తువులు దొరికాయి. వాటిని త్వరలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఈ ప్రదర్శనను తొలిరోజు 10,000 మంది, రెండో రోజు 4,000 మంది చూసే అవకాశముందని భారత పురావస్తు శాఖ అంచనా వేస్తోంది.