త్వరలో ఎర్రకోటలో ఏఎస్‌ఐ తవ్వకాలు | ASI may head to Red Fort after Purana Quila work | Sakshi
Sakshi News home page

త్వరలో ఎర్రకోటలో ఏఎస్‌ఐ తవ్వకాలు

Published Mon, Apr 21 2014 11:28 PM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM

ASI may head to Red Fort after Purana Quila work

 న్యూఢిల్లీ: ప్రస్తుతం పురానా ఖిలాలో తవ్వకాలు జరుపుతున్న భారత పురావస్తు శాఖ త్వరలో ఎర్రకోటలో కూడా తవ్వకాలు జరపనుంది. అయితే పురానా ఖిలాలో తవ్వకాల పనులు పూర్తయిన తర్వాతే ఎర్రకోటపై దృష్టి సారించనున్నారు. ఈ విషయమై పురావస్తు విభాగం ప్రధాన పర్యవేక్షణ అధికారి వసంత్‌కుమార్ స్వరంకర్ మాట్లాడుతూ... ‘రెండుచోట్ల ఒకేసారి తవ్వకాలు జరిపేందుకు తగినంత సిబ్బంది మాకు అందుబాటులో లేరు. అందుకే పురానా ఖిలాలో పనులు పూర్తయిన తర్వాతే ఎర్రకోటలో తవ్వకాలు ప్రారంభిస్తాం. మొదట ఎర్రకోటలోని మెహతాబ్ బాగ్ ప్రాం తంలో మొదలుపెడతాం. ఈ ప్రాంతం స్వతంత్ర సంగ్రామ్ సంగ్రహాలయ్, మొఘల్ గార్డెన్ వరకు విస్తరించి ఉంది. ఎర్రకోటలో ప్రధానంగా రెండు గార్డెన్‌లు ఉన్నాయి. ఒకటి మెహతాబ్ గార్డెన్ కాగా రెండోది హయత్ భక్ష్ గార్డెన్. వీటిని 1648లో నిర్మించారు. అయితే 1863లో బ్రిటిష్‌వారు భక్ష్ గార్డెన్‌ను ధ్వంసం చేశారు.
 
 ఈ ధ్వంసకాండ ఎర్రకోట బయట, లోపల కూడా సాగింది. ఆ తర్వాత కాలంలో ఈ గార్డెన్‌లను సరిదిద్దారు. ఇక మెహతాబ్ గార్డెన్‌ను షాజహాన్ హయాంలో నిర్మిం చారు. దీనిని కూడా బ్రిటిషర్లు ధ్వంసం చేశారు. ఈ గార్డెన్ ఉన్న ప్రాంతం ప్రస్తుతం ఓ మైదానంలా ఉంది. అప్పట్లో దీనిని మూన్‌లైట్ గార్డెన్ అని కూడా పిలిచేవారు. ఈ గార్డెన్ మధ్యలో ఎర్రటి రాయితో లాల్ మహల్‌ను నిర్మించారు. అయితే ఈ గార్డెన్ నిర్మాణ నమూనాను గుర్తించేందుకే ఇక్కడ తవ్వకాలు నిర్వహించాలనుకుంటున్నాం. అంతేకాకుండా నీటి వనరులు, ఫౌంటెయిన్‌లు, కాలిబాటలను గుర్తించే ప్రయత్నం కూడా చేస్తాం. మొఘలుల కాలంలో జలవనరులు, కాలువల వంటివి ఎంతో ప్రాచుర్యం పొందాయి. పైగా వాటి నిర్మాణశైలి ఇప్పటికీ అద్భుతమే. తవ్వకాల పనులు పూర్తయిన తర్వాత మెహతాబ్ గార్డెన్ మళ్లీ నిర్మించే ప్రతిపాదనలను కూడా రూపొందిస్తామ’న్నారు.
 
 విద్యుత్ పొదుపునకు ఎల్‌ఈడీ లైట్లు...
 ఇదిలాఉండగా ఎర్రకోట అందాలను ధ్విగునీకృతం చేస్తూనే విద్యుత్ ఖర్చును తగ్గించుకునేందుకు ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. మే మాసాంతంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇటీవల పురానాఖిలాలో తవ్వకాలు ప్రారంభించిన పురావస్తుశాఖకు అక్కడ అనేక పురాతన, అరుదైన వస్తువులు దొరికాయి. వాటిని త్వరలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఈ ప్రదర్శనను తొలిరోజు 10,000 మంది, రెండో రోజు 4,000 మంది చూసే అవకాశముందని భారత పురావస్తు శాఖ అంచనా వేస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement