రాజధాని చరిత్రలో కొత్త వెలుగు! | Purana Qila Reveals New Chapter in Delhi History | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 20 2018 7:42 PM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM

Purana Qila Reveals New Chapter in Delhi History - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ​ : దేశ రాజధాని చరిత్రలోకి కొత్త వెలుగు రానుంది. ఢిల్లీ నగరం నడిబొడ్డున ‘పురాణ ఖిల్లా’లో భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) జరుపుతున్న తవ్వకాల్లో చరిత్రకు సంబంధించి మరిన్ని ఆధారాలు, వివరాలు తెలియనున్నాయి. ఇప్పటివరకు ఢిల్లీ చరిత్ర మనకు మౌర్యుల కాలం నుంచే అందుబాటులో ఉంది. కానీ, తాజాగా బయటపడిన ఆధారాలు ఢిల్లీకి అంతకు ముందే మరో 300 ఏళ్ల చరిత్ర ఉందనే విషయాన్ని చెప్పబోతున్నాయి. 

ఢిల్లీ 300 ఏళ్ల ముందుకు..
ఏ జాతి చరిత్ర తెలియాలన్నా.. ఆ కాలంలోని కుండలు, మట్టి పాత్రలు, ఇతర కట్టడాల పరిశీలన అవసరమని తవ్వకాలు చేపట్టిన చండీగఢ్‌ సర్కిల్‌ ఆర్కియాలజీ సూపరింటెండెంట్‌ స్వరణ్‌కర్‌ చెబుతున్నారు.  మౌర్యుల కాలాన్ని నార్తర్న్‌ బ్లాక్‌ పాలిష్డ్‌ వేర్‌ (పాలిష్‌ చేయబడిన నల్లని మట్టి పాత్రలు) తెలుపుతున్నాయని వివరించారు. పురాణ ఖిల్లా తాజా తవ్వకాల్లో మౌర్యుల కాలపు కళాఖండాలు లభించిన మట్టి పొర కిందే కొన్ని బూడిద, ఎరుపు రంగు పాత్రలు లభించాయని వెల్లడించారు. ఈ పాత్రలు మౌర్యుల పూర్వపు కాలాన్ని వెల్లడించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. వాటిని కార్బన్‌ డేటింగ్‌కు పంపించి నిర్ధారించుకుంటామని ఆయన చెప్పారు. ఇక లభించిన మట్టి పాత్రలు క్రీ.పూ. 6 - 4 శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నామన్నారు. అదే నిజమైతే ఢిల్లీకి మరో 300 ఏళ్ల చరిత్ర తోడవుతుందని స్వరణ్‌కర్‌ పేర్కొన్నారు. ఆ లెక్కన మహా జనపదాల కాలంలో ఢిల్లీ ప్రాంతం ఉనికిలో ఉన్నట్టేనన్నది రుజువవుతుంది. 

గతంలోనూ తవ్వకాలు...
1970, 2013-14 సంత్సరాల్లో పురాణ ఖిల్లాలో భారత పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టింది. అయితే అక్కడ ఎలాంటి కట్టడాలు, మట్టి పాత్రలు లభించలేదు. కానీ విరివిగా మట్టిపెంకులు బయటపడటంతో మళ్లీ తవ్వకాలు చేపట్టారు. ‘పురాణ ఖిల్లాలో తవ్వకాలు చేపట్టేందుకు మాకు 2013లో అనుమతి వచ్చింది. కానీ అప్పటి తవ్వకాలలో మౌర్యుల పూర్వపు ఆధారాలేమీ లభించలేదు. అయినా చివరి ప్రయత్నంగా ఈ ఏడాది మళ్లీ ఇక్కడ తవ్వకాలు ప్రారంభిచాం’అని స్వరణ్‌కర్‌ తెలిపారు. అయితే కాల్పనిక నగరం ఇంద్రప్రస్థానికి చెందిన ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని ఆయన అన్నారు.

షేర్‌షాతో ధ్వంసం​..
పురాణ ఖిల్లాకి 2500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ప్రాంతంపై సూర్‌ రాజైన షేర్‌ షా దండెత్తి నాశనం చేసినట్లు చరిత్ర చెబుతోంది. పర్యాటకుల సందర్శన కోసం తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో ప్రస్తుతం పురావస్తు శాఖ ఏర్పాట్లు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement