హైటెక్ మోసం
* బ్యాంక్ ఖాతా నుంచి రూ. 52 వేలు స్వాహా
* హైదరాబాద్‌లో లావాదేవీలు
* లబోదిబోమంటున్న బాధితుడు
ముత్తారం :ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న మోసగాళ్లు రోజురోజుకూ హైటెక్ తరహా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ముత్తారం మండలం బుధవారంపేట(రామయ్యపల్లి)కి చెందిన కన్నూరి సదయ్య ఖాతా నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా రూ.52 వేలు స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడి కథనం.. మంథని ఆంధ్రాబ్యాంకులో 0843100008712 నంబరుతో ఖాతా ఉంది. దీనిపై 4688 1708 4305 9785 న ంబర్ గల ఏటీఎం కార్డు ఉంది.
ఇటీవలే గ్రామంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేయగా దానికి సంబంధించిన వాయిదా కిస్తీ చెల్లించడం అప్పుగా తెచ్చుకున్న రూ. 61,500 బ్యాంకు ఖాతాలో జమచేశాడు. ఈనెల 2న సదయ్య మొబైల్‌కు ఫోన్ వచ్చింది. తాము ఏటీఎం కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు బ్యాంకు ఖాతా ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? ఏటీఎం తీసుకున్నారా? దాన్ని జాగ్రత్తగా వినియోగిస్తున్నారా? కార్డు నంబర్, పిన్ నంబర్ చెప్పండి అని అడిగారు.
ఇదంతా నిజమేననుకున్నా సదయ్య అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చాడు. జవాబులు చెప్పిన రోజే ఆయన ఖాతా నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు స్వాహా అయ్యాయి. అయితే భూమికి సంబంధించిన డబ్బులు చెల్లించే గడువు రావడంతో బ్యాంక్‌లోని డబ్బులు డ్రా చేయడం కోసం వెళ్లిన ఆయనకు అసలు నిజం తెలియడంతో లబోదిబోమన్నాడు. తాను డబ్బులు డ్రా చేయకుండా ఎలా ఖాతా నుంచి డ్రా అవుతాయని మేనేజర్ నిలదీయడంతో ఆయన చెప్పిన నిజాన్ని విని సదయ్య షాక్‌కు గురయ్యాడు.
ఈ నెల 2 నుంచి 5 వరకు దాదాపు రూ.52 వేలు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డ్రా అయిన ట్లు మేనేజర్ వివరించారు. ఇట్టి డబ్బులు హైదరాబాద్‌లోని గచ్చీబౌలీ ప్రాంతంలో డ్రా అయినట్లు స్పష్టం చేశారు. ఆందోళన గురైన ఆయన ముత్తారం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఈ విషయంపైన బ్రాంచీ మేనేజర్ సత్యనారాయణను ‘సాక్షి’ వివరణ కోరగా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు స్వాహా అయ్యాయని, అయితే ఎవరు స్వాహా చేసిన విషయం తెలియదని చెప్పారు. హైటెక్ మోసంపై తాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.