purchase grain
-
‘మద్దతు' పొందండి..
- కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి - 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు - ‘ఏ' గ్రేడ్ క్వింటాల్ ధర రూ.1,400, సాధారణ రకానికి రూ.1,360 - జిల్లా వ్యాప్తంగా 180 కొనుగోలు కేంద్రాలు - రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట రూరల్: ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర మార్కెటింగ్, నీటిపారుదల శాఖల మంత్రి టి. హరీశ్‌రావు రైతులకు సూచించారు. ఆదివారం సిద్దిపేట మండలం పొన్నాల గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గ్రేడ్-ఏ ధాన్యం క్వింటాల్ ధర రూ.1,400, సాధారణ రకం రూ.1,360గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రబీ దిగుబడుల కొనుగోలుకు జిల్లాలో ఐకేపీ, సొసైటీలు సుమారు 180 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. రైతులంతా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయిస్తే గత ఖరీఫ్‌లో ఇచ్చినట్టుగా 72 గంటల్లో డబ్బులు తమ ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సిద్దిపేటలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సుమారు 60 రైస్ మిల్లులకు పంపించనున్నట్లు తెలిపారు. పొద్దుతిరుగుడుకు రూ.3,750 మద్దతు ధర కల్పిస్తూ సిద్దిపేటలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పొన్నాల కొనుగోలు కేంద్రంలో రూ.50 లక్షలతో ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఎంపీపీ యాదయ్య, ఏపీఎం ధర్మసాగర్, సర్పంచ్ సాదుపల్లి శివప్రసాద్ పాల్గొన్నారు. -
కమీషన్ కోసం రోడ్డెక్కిన మహిళలు
చిన్నకోడూరు: రైతుల ధాన్యం దళారుల పాలు కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొనుగోళ్ల ప్రక్రియలో అవినీతి చోటుచేసుకుంది. గ్రామాల్లో రైతుల నుంచి ధాన్యం, మక్కలు కొనుగోలు చేసేందుకు ఇందిర క్రాంతి పథం పర్యవేక్షణలో స్థానిక మహిళా సం ఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆరేళ్ల క్రితం మండల పరిధిలోని ఇబ్రహీంనగర్‌లో ప్రారంభమైన కొనుగోలు కేంద్రంలోని మహిళా సంఘాలకు నేటికి కమీషన్ డబ్బు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆరు సంవత్సరాలుగా రబీ, ఖరీఫ్ సీజన్లో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన మహిళా సంఘాలకు సర్కార్ నుంచి కమీషన్ అందిన దాఖలాలు లేవు. ఈ విషయంలో ఐకేపీ సిబ్బందికి కమీషన్ వస్తోందన్న సంగతి తెలుసుకున్న గ్రామైక్య సంఘం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీంనగర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామైక్య సంఘం సభ్యులు 2008 సంవత్సరం నుంచి ప్రతి యేటా నిర్వహిస్తూ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. వారి సేవలకు ప్రభుత్వం కమీషన్ రూపంలో నగదు ప్రోత్సాహకాన్ని ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. అయితే వారికి తెలియకుండా ఐకేపీ అధికారులు ఈ కమీషన్‌ను గుటుక్కు మనిపిస్తున్నారు. నిజానికి ఈ కమీషన్ వస్తుందనే విషయం మహిళలకు తెలియలేదు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మహిళలు ఆందోళనకు దిగారు. సుమారు రూ. 30 నుంచి 40 లక్షల వరకు తమకు ధాన్యం అమ్మిన కమీషన్ రాకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసే వరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించా రు. విషయం తెలుసుకొని అక్కడకు వచ్చిన గ్రామ సీఏ సాయికృష్ణ, ఐకేపీ ఏపీఎం ఆంజనేయులను వారు నిలదీసి, వాగ్వాదానికి దిగారు. రాస్తారోకోతో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఎస్ఐ ఆనంద్‌గౌడ్ అక్కడికి అక్కడికి వచ్చి ఆందోళనకారులను సముదాయించారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో సమస్యను సామరస్యంగా చర్చించుకుందామని చెప్పడంతో వారు రాస్తారోకో విరమించారు. కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకొని ఐకేపీ అధికారుల అవినీతిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008 నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేకపోవడంతో తమకు కమీషన్ అందలేదన్నారు. తమకు అన్యాయం చేసిన వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఏపీఎం ఆంజనేయులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రికార్డులు లేవని, వివరాలను సంగారెడ్డిలోని కార్యాలయంలో పరిశీలించాక సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.