జాతీయతా నిర్దేశకుడు
దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏకఛ్ఛత్రాధిపత్యానికి రోజులు దగ్గరపడ్డాయని, సంకీర్ణ శకం మొదలు కాబోతోందని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పారు. ఆయన అంచనా తర్వాత అక్షరాలా నిజమైంది కూడా.
దాదాపు ఐదు దశాబ్దాల కిందట 1967 డిసెం బర్లో కాలికట్లో 14వ జాతీయ జనసంఘ్ సమావేశాలు జరిగాయి. అక్కడే భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఎన్నిక య్యారు. కార్యకర్తలు నిర్మించిన జనసంఘ్‌ను పురోగమింపజేసేందుకు మనమంతా కలిసి ఒకే లక్ష్యంతో, ఏకాగ్రతతో పని చేద్దామని ఆ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు 15 ఏళ్లుగా ఆయన జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అధ్యక్షుడిగా కేవలం 43 రోజులు మాత్రమే ఆయన పనిచేశారు. 1968 ఫిబ్రవరి 11వ తేదీన మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ దగ్గర అర్ధరాత్రి దుండగుల చేతిలో ఆయన హత్యకు గురయ్యారు. జన సంఘ్‌ను తీర్చిదిద్దటంలోనూ, భారతదేశానికి సరైన పునాదు లను ప్రతిపాదించడంలోనూ ఆయన కృషి అసమానం.
విజయవాడలో 1965 జన వరిలో జరిగిన జనసంఘ్ సమా వేశాల్లో ప్రిన్సిపల్స్ అండ్ పాలి టిక్స్, ఏకాత్మతా మానవవాదం అనే భావనలను ఉపాధ్యాయ ప్రవేశపెట్టారు. ఏ దేశమైనా జాతీయతా భావం లేకుంటే మనుగడ సాధించడం అసాధ్యమని, భారతీయతే మన సమాజానికి మూలస్తంభమని, కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా భారతీయులంతా ఒక్కటేనని ఆయన సూత్రీకరించారు. కుల, మత ప్రాతిపదికగా సమాజం విడిపోరాదని, అంటరానితనాన్ని నిర్మూ లించాలని కాంక్షించారు.
పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25వ తేదీన మధుర జిల్లాలో నగ్ల చంద్రబన్ అనే గ్రామంలో జన్మించారు. 1937వ సంవత్సరంలో ఆర్.ఎస్.ఎస్.లో చేరారు. 1952లో జరిగిన మొదటి పార్లమెంటు ఎన్నికల్లో 3.06 ఓట్ల శాతంతో మూడు స్థానాలతో ప్రారంభమై ఇప్పుడు 283 స్థానాల్లో.. సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదగడానికి దీన్‌దయాళ్ చేసిన మార్గదర్శనాన్ని మరువలేం.
దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ఆయన దశా బ్దాల కిందటే ఊహించగలిగారు. 1967 సాధారణ ఎన్నికల తర్వాత పండిట్జీ మాట్లాడుతూ, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏకఛ్ఛత్రాధిపత్యానికి ఇక రోజులు దగ్గర పడ్డాయని, సంకీర్ణ శకం మొదలు కాబో తోందని అన్నారు. ఆయన చెప్పినట్లే తర్వాత మూడు దశాబ్దాల పాటు మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడిచాయి.
పార్టీ ఫిరాయింపులపై ఆయన సిద్ధాంతం ఇప్ప టికీ ఆచరణీయం. చట్టం ఏం చెబుతోంది అనేదాని కంటే ప్రజల అభిప్రాయానికే రాజకీయ నాయకులు కట్టుబడి ఉండాలని, రాజకీయ పార్టీలకు నైతిక విలు వలు ఉండాలని, అప్పుడే ఫిరాయింపుల్ని అరిక ట్టడం సాధ్యమవుతుందని ఉపాధ్యాయ సెలవి చ్చారు. పన్నుల విధానంలో సమూల ప్రక్షాళన చేయాలని, ఏకపన్ను విధానం ఉండాలన్నారు. రిటైర్డ్ ఉన్నతాధికారులను, రాజకీయ నాయకులను కాకుండా విశ్రాంత న్యాయమూర్తులను గవర్నర్లుగా నియమించాలని, గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ స్టాంపు లుగా ఉండరాదని అభిప్రాయపడ్డారు.
పాశ్చాత్య సెక్యులరిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సిద్ధాంతాలను ఆయన అంగీకరించలేదు. భారతీయ సిద్ధాంతాలు, విలువలన్నీ భారతీయతపై ఆధారప డినవి, మన సొంత సమాజంలోనుంచి పుట్టుకొచ్చి నవి, స్వాభావికమైనవి కావాలని ఆయన కాంక్షించారు. గొప్ప ఆర్గనైజర్ అయిన దీన్ దయాళ్ జాతీయతా భావ ప్రచారం కోసం 1940లో ‘రాష్ట్ర ధర్మ’ అనే మాసపత్రికను ప్రారం భించారు. ఆర్ఎస్ఎస్ పత్రిక ‘ఆర్గనైజర్’లో ‘పొలిటికల్ డైరీ’ పేరుతో కాలమ్ రాసేవారు. తర్వాత ‘పాంచజన్య’ ఎడిటర్ గానూ పనిచేశారు. సామ్రాట్ చంద్రగుప్త, జగద్గురు శంకరాచార్య అఖండ భారతం, రాష్ట్ర చింతన, ఏకాత్మతా మానవవాదం, రాష్ట్ర జీవన్కీ దిశా మొదలైన పుస్తకాలు రచించారు. భారతీయ వారసత్వాన్ని గురించి తెలుసుకుని దాని ఆధారం గానే జాతి పునర్నిర్మాణం జరగాలని ఉపా ధ్యాయ స్పష్టం చేశారు. జనసంఘ్‌తో పాటు దేశ నిర్మాణానికీ సరైన పునాదులు కల్పించారు.
ప్రజాస్వామ్యంలో సామాన్యుడి అవసరాలు, ప్రయోజనాల ప్రాతిపదికగా ప్రభుత్వాలు పనిచే యాలని ఆయన సూచించారు. ఆయన అడుగు జాడల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి, అద్వానీ, కుష భావ్ ఠాక్రే, గోవిందాచార్య, శివరాజ్‌సింగ్ చౌహాన్, నరేంద్ర మోదీ తదితరులు జాతి నిర్మాణంలో ఎన లేని కృషి చేశారు.
నిరాడంబర జీవితం, నైతికత, నిజాయితీ, జాతీయభావాన్ని ప్రజాజీవితంలో ఆచ రించి చూపించిన మార్గదర్శి ఉపాధ్యాయ. మోదీ ప్రభుత్వం సాగిస్తున్న అనేక సంస్కరణలకు స్ఫూర్తి దీన్దయాళ్జీయే. ఆయన కలలు కన్నట్లుగానే పేద రికం లేని దేశాన్ని మనం చూడబోతున్నాం.
(పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాల సందర్భంగా)
వ్యాసకర్త ఏపీ బీజేపీ సమన్వయకర్త
- పురిఘళ్ల రఘురాం
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ
ఈమెయిల్ : raghuram.delhi@gmail.com