ట్రంప్ నోరు విప్పాలి
శ్రీనివాస్ కూచిభొట్ల హత్యపై హిల్లరీ డిమాండ్
♦ ట్రంప్ మౌనం విద్వేషపూరిత నేరాలకు ఆజ్యం: న్యూయార్క్ టైమ్స్
♦ కోర్టు విచారణకు హాజరైన హంతకుడు ప్యూరింటన్
♦ నేరం రుజువైతే 50 ఏళ్ల జైలు శిక్ష
వాషింగ్టన్ : జాత్యాహంకార దాడిలో హత్యకు గురైన శ్రీనివాస్ ఉదంతంపై అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ స్పందించారు. అమెరికాలో కొనసాగుతున్న విద్వేషపూరిత నేరాలపై అధ్యక్షుడు ట్రంప్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ‘బెదిరింపులు, విద్వేషపూరిత నేరాలు పెరిగాయి.
ఈ విషయం ట్రంప్‌కు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ట్రంప్ నోరు విప్పాలి’ అని ఆమె ట్వీట్ చేశారు. శ్రీనివాస్ హత్యపై ట్రంప్ ఇంతవరకూ స్పందించలేదు. అయితే శ్రీనివాస్ హత్యపై వైట్‌హౌస్ స్పందించింది. వలసలపై నిషేధాజ్ఞలకు కాన్సస్ కాల్పులకు సంబంధంలేదని వాదించిన సర్కారు... కాల్పుల ఘటన ఆందోళన కలిగించిందని తెలిపింది. ఆ మేరకు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ మీడియాతో మాట్లాడుతూ... కాన్సస్ నుంచి అందుతున్న ప్రాథమిక వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
విద్వేషాల్ని అణచకుండా ఆజ్యం పోస్తున్నారు: న్యూయార్క్ టైమ్స్
భారతీయ ఇంజనీరు హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మౌనం వహించి... అమెరికాలో విద్వేషపూరిత నేరాలకు ఆజ్యం పోశారని ప్రముఖ వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది. ‘అధ్యక్షుడు ట్రంప్, అతని యంత్రాంగం చాలా మంది వలసదారులు, విదేశీ పర్యాటకుల్ని దేశం నుంచి పంపేందుకు ప్రయత్నించడం ఒక్కటే కాదు... వారిని నేరస్తులుగా, ఉగ్రవాదులుగా, అక్రమంగా నివసిస్తున్నవారిగా ముద్ర వేస్తోంది. విద్వేషాన్ని అణచివేయకుండా... అధ్యక్షుడు ఆజ్యం పోస్తున్నారు.
కాన్సస్ కాల్పులకు సంబంధించి కనీసం ఏమీ మాట్లాడలేదు. విద్వేషపూరిత నేరం జరిగితే నేరస్తుడి మానసిక స్థితి సరిగాలేదని సులువుగా చెప్పేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి నేరాలు ముస్లింలు గానీ, సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్నవారు చేస్తే... తాను చెప్పినట్లే జరుగుతుందని ట్రంప్ తప్పకుండా అంటారు’ అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే... విద్వేష పూరిత నేరాలు చేసేందుకు నేరస్తులకు అధికారమిచ్చినట్లు అవుతుందని తన వ్యాసంలో తప్పుపట్టింది. ‘ట్రంప్ అమెరికా’లో విద్వేష పూరిత నేరాలు, పక్షపాతంతో కూడిన సంఘటనలు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
మీతో ఉండనివ్వండి: బార్టెండర్తో ప్యూరింటన్
శ్రీనివాస్ హత్య తర్వాత రెస్టారెంట్లో తలదాచుకున్న ప్యూరింటన్ ... బార్టెండర్ సామ్‌తో ఏం మాట్లాడింది వెలుగులోకి వచ్చింది. ‘నేను మీతో ఉండవచ్చా అని ప్యూరింటన్ నన్ను అడిగాడు. ఏంచేశాడో చెప్పలేదు. నేను అతన్ని అడుగుతూనే ఉన్నాను. మాతో ఉండనిస్తేనే ఏం జరిగిందో∙చెపుతానన్నాడు. చివరికి ఒలేతేలో ఇద్దరు ఇరానియన్లను చంపానన్నాడు’ అని సామ్ పోలీసులకు ఫోన్ లో వెల్లడించింది.
సాక్ష్యాధారాల సేకరణ కోసం రంగంలోకి ఎఫ్‌బీఐ
అమెరికాలోని కాన్సస్‌లో శ్రీనివాస్ కూచిభొట్లను హత్య చేసి, మరో ఇద్దరిని గాయపరిచిన కేసులో నిందితుడు ఆడమ్ ప్యూరింటన్ ర్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుడ్ని జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి సోమవారం విచారించారు. ప్యూరింటన్ పై ఒక ఫస్ట్–డిగ్రీ మర్డర్(హత్య), రెండు ఫస్ట్ డిగ్రీ మర్డర్ అటెంప్ట్(హత్యాయత్నం) కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ వెల్లడించిన వివరాల ప్రకారం... నేరం రుజువైతే ప్యూరింటన్ కు గరిష్టంగా 50 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. మరోవైపు, సాక్ష్యాధారాల సేకరణలో స్థానిక పోలీసులకు ఎఫ్‌బీఐ సాయమందిస్తోంది. ఈ హత్యను జాత్యహంకార నేరంగా ఎఫ్‌బీఐ రుజువు చేస్తే ఫెడరల్ అభియోగాల మేరకు ప్యూరింటన్ కు మరణశిక్ష విధించే అవకాశముంది. ప్రస్తుతం అతను జాన్సన్ కౌంటీ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు.
తెలుగులో మాట్లాడొద్దు: ‘టాటా’
హైదరాబాద్: అమెరికాలో నివసించే తెలుగు ప్రజలు బహిరంగ స్థలాల్లో తెలుగులో మాట్లాడ వద్దని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) సూచించింది. ‘మాతృభాషలో మాట్లాడడాన్ని మనం ఎంతో ఇష్టపడ తాం. కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకు నే అవకాశముంది. బహి రంగ ప్రదేశాల్లో ఇంగ్లిషులో మాట్లాడండి’ అని ఫేస్బుక్ పేజీలో కోరింది. బహిరంగ ప్రదేశాల్లో ఇతరులతో వాగ్వాదం పెట్టుకోవద్దని సూచించింది. జనసంచారం లేని ప్రాంతాల్నిలక్ష్యంగా చేసుకుంటున్నారని, తప్పనిసరైతే అలాంటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లవద్దని సూచించింది.