ఉగాది ఉత్సవాలకు పూర్ణాహుతి
శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో ఈ నెల 26న ప్రారంభించిన స్వస్తీ శ్రీ హేవలంబినామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఉదయం రుద్రహోమ పూర్ణాహుతితో ముగిశాయి. ఆరంభ పూజల్లో భాగంగా గణపతి పూజ, యాగశాల ప్రవేశం, చండీశ్వర పూజ, మండపారాధన, కలశస్థాపన, రుద్రహోమం తదితర పూజలు నిర్వహించగా, ఉత్సవాల ముగింపు సూచనగా పూర్ణాహుతిని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయప్రాంగణంలోని యాగశాల నందు నిత్యకాల పూజలు, జపానుష్టానములు, నిత్యహవనములు జరిగాయి. రుద్రహోమ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవభృథోత్సవం, మహదాశీర్వచనం, కలశోద్వాశన చేశారు.
ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ వినోద్‌కుమార్, అర్చకులు వేదపండితులు.. నారికేళాలు, సుగంద ద్రవ్యాలు, ముత్యం, పగడం బంగారం, వెండి, నూతన వస్త్రాలు తదితర పూర్ణాహుతి ద్రవ్యాలను హోమగుండానికి సమర్పించారు. అనంతరం వసంతోత్సవంలో భాగంగా పసుపు, సున్నం కలిపిన మంత్రపూరితజలాన్ని(వసంతం) భక్తులపై ప్రోక్షించారు. తరువాత చండీశ్వరుడిని పల్లకీలో ఊరేగించి మల్లికాగుండం వద్ద వైదిక శాస్త్రోక్తంగా స్నపన కార్యక్రమాలను నిర్వహించి మల్లికా గుండంలో త్రిశూల స్నానం చేయించారు. త్రిశూల స్నానం, విశేషపూజల్లో ఈఓ నారాయణ భరత్‌గుప్త దంపతులు పాల్గొన్నారు.