పెషావర్ ఘటనకు నిరసనగా విద్యార్థుల శాంతి ర్యాలీ
ఆదిలాబాద్ రిమ్స్ : పెషావర్ ఘటనలో మరణించిన విద్యార్థులకు సంతాపంగా ఆదిలాబాద్ పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక సుందరయ్య భవనం నుంచి తెలంగాణ చౌక్ వరకు శాంతి ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ 131 మంది విద్యార్థులను బలిగొన్న ఉగ్రవాదుల పైశాచికాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదుల దుశ్చర్యలను అన్ని దేశాలు కలిసికట్టుగా ఎదుర్కొవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు విక్రం, అరవింద్, గోపాల్, సోన్సాన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ శాంతి కోసం..
భైంసారూరల్ : ప్రపంచశాంతి కోరుతూ పట్టణంలోని వేదం పాఠశాల విద్యార్థులు, భగత్‌సింగ్ యువసేన సభ్యులు గురువారం సంతాపం వ్యక్తం చేశారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. పెషావర్ ఘటనను ఖండించారు. ప్రపంచశాంతి కోరుతూ విద్యార్థులు శాంతి ఆకారంలో కూర్చున్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, విద్యార్థులు, భగత్‌సింగ్ యువసేనా సభ్యులు బి. సుదర్శన్, సందీప్‌గౌడ్, సతీశ్‌గౌడ్, వీరేశ్, మారుతి తదితరులు ఉన్నారు.