సాంకేతిక ‘పుష్కరం’
– కృష్ణా పుష్కరాలలో ఆధునిక, సాంకేతికత వినియోగం
– వైఫై, ఎఫ్ఎం సేవలు
– సీసీ కెమెరాలు, ఎల్ఈడీ వెలుగులు
– పోలీస్‌శాఖ తయారు చేసిన యాప్‌లో సమగ్ర సమాచారం నిక్షిప్తం
మహబూబ్‌నగర్ క్రైం: ఇదివరకు జరిగిన పుష్కరాలు ఒక ఎత్తయితే ప్రస్తుతం నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలు మరొ ఎత్తుకానున్నాయి. జిల్లాలో 2004 నిర్వహించిన కృష్ణా పుష్కరాలలో కేవలం 3ఘాట్లు ఉంటే బీచుపల్లి, రంగపూర్, సోమశిల, అలంపూర్‌లో ప్రధానఘాట్లుగా గుర్తించారు. ఇందులో బీచుపల్లిలో మాత్రమే భక్తుల రద్దీ ఉండేది. అప్పట్లో ఫోన్లు కూడా ఆశించిన స్థాయిలో లేవు. సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడా కనిపించేది కాదు. కానీ ప్రస్తుతం సాంకేతిక, ఆధునిక అంశాలను మేళవించి కృష్ణా పుష్కరాలను నిర్వహించేందుకు అధికారయంత్రాంగం, పోలీస్‌శాఖ సన్నద్ధమైంది. కనివినీ ఎరుగని రీతిలో పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
మొబైల్ యాప్..
కలెక్టర్, ఎస్పీ ఆదేశాలతో స్పార్క్ 10 కంప్యూటర్ సాప్ట్వేర్ కంపెనీ సీఈఓ అటల్ మాల్వీయ, హరి భరద్వాజ్ కలిసి కొత్త యాప్‌ను తయారు చేశారు. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్ నుంచి మహబూబ్‌నగర్ కృష్ణ పుష్కరాలు 2016 టైపు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్ ఉన్న వారు యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 30నుంచి 50సెకన్లలో యాప్ డౌన్లోడ్ అవుతుంది. పోలీస్‌శాఖ ఏర్పాటు చేసిన యాప్‌లో సమస్త సమాచారాన్ని పొందుపరిచారు. ఇందులో పుష్కరం అంటే ఏమిటి? పార్కింగ్ ప్రదేశాలకు, స్నానఘాట్లకు ఎలా వెళ్లాలి, జిల్లాలో ఉండే ఘాట్లు, వాటికి వెళ్లే రోడ్డుమార్గాల వివరాలు పొందుపరిచారు. ఆరోగ్య కేంద్రాలు, పర్యాటక ప్రదేశాలు, వివిధ రకాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లే విధానం, బస్సు, రైళ్ల వివరాలు 15రకాల సేవల వివరాలు ఉంటాయి. ఘాట్ల వద్ద రద్దీని తెలియజేసే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఘాట్ల వద్ద అవసరమయ్యే అత్యవసర సేవల వివరాలు, సెల్‌ఫోన్ నంబర్లు యాప్‌లో ఉన్నాయి. ఫైర్, పోలీస్, వైద్య సేవలు ఘాట్ల వారీగా పొందుపరిచారు. ప్రతి గంటకు ఘాట్ల వద్ద ఉన్న సమాచారం యాప్ కింద స్క్రోలింగ్ తాజాల రూపంలో ప్రదర్శితమవుతుంది. ఘాట్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినుబండారాల వివరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బొమ్మలపై నొక్కితే తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో సమాచారం వస్తుంది.
ఎల్ఈడీ వెలుగులు
కృష్ణానది తీర ప్రాంతమంతా ఎల్ఈడీ దీపాల వెలుగుల్లో నిండిపోనుంది. 50మీటర్ల వరకు వెలుగులు ఇచ్చేలా 16మీటర్ల ఎత్తున స్తంభాలను శాశ్వతంగా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమైన 19ఘాట్లలో 150స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో దానికి 200వాట్స్ సామర్థ్యం ఉన్న ఎనిమిది ఎల్ఈడీ దీపాలను అమర్చుతున్నారు.
ఫేస్బుక్లో అప్డేట్స్
స్నాన ఘాట్ల వద్ద పరిస్థితిని, భక్తుల రద్దీ ఫొటోలు, వీడియోలు, పుష్కరాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఫేస్బుక్లో అఫ్లోడ్ చేయనున్నారు. ప్రస్తుతం ఘాట్ల వద్ద అభివృద్ధి పనులకు సంబంధించిన ఫొటోలు, పత్రికలు, ఛానల్స్‌లలో వచ్చే కథనాలను అప్లోడ్ చేయనున్నారు. పుష్కరాలకు రాని దేశ, విదేశాల్లో ఉన్న వారు ఇక్కడ విషయాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. పోలీస్ శాఖ నుంచి ఝ్చజ్చిbubn్చజ్చట ఞౌlజీఛ్ఛిజుటజీటజిn్చ puటజిజ్చుట్చlu2016 పేరుతో ఫేస్బుక్ ఖాతా తయారుచేశారు. ఇందులో ఘాట్స్ వాటికి వెళ్లే మార్గలు, ట్రాఫిక్, పరంగా ఎప్పటికప్పుడు సూచనలు పొందిపరుస్తున్నారు.
జీపీఎస్‌తో సమాచారం
పుష్కరాల సమయంలో వచ్చే బస్సుల వివరాలను జీపీఎస్ ద్వారా పరిశీలించనున్నారు. తద్వారా బస్సులు ఎక్కడ ఉన్నాయి.. ఎంత దూరంలో ఉన్నాయి ఎంత సమయానికి చేరుకుంటాయనే విషయాలను పరిశీలిస్తారు. ప్రయాణికులు బస్సుల రాకపోకల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
వాచ్ టవర్లు, డ్రోన్లు
జిల్లాలో ఏడు ప్రధాన ఘాట్ల వద్ద వాచ్టవర్లను ఏర్పాటు చేయనున్నారు. దాంతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా స్నానఘాట్ల వద్ద పరిస్థితిని పరిశీలించనున్నారు. ఈ డ్రోన్ల సాయంతో ఘాట్ల వద్ద రద్దీని, ట్రాఫిక్ పరిస్థితిని గమనిస్తూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ వాచ్టవర్లు, డ్రోన్ల ద్వారా దాదాపు అర కిలోమీటరు వరకు చూసే అవకాశం ఉండటం వల్ల జిల్లాలో ప్రధాన ఘాట్లలో 7వాచ్ టవర్లు, 2 డ్రోన్లను వినియోగించాలని నిర్ణయించారు.
సీసీ కెమెరాలు
అవాంచనీయ ఘటనలు జరగకుండా, అనుమానిత వ్యక్తులను గుర్తించేందుకు వీలుగా 500సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అనుక్షణం వాటిని పరిశీలిస్తూ అధికారులు, పోలీసులకు సూచనలు ఇవ్వనున్నారు. పాత నేరస్తులు, అనుమానితులను గుర్తించేందుకు వీలుగా ఓ సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయనున్నారు.
మొబైల్ ఏటీఎంలు
భక్తుల కోసం జిల్లా అధికార యంత్రాంగం పుష్కరఘాట్ల వద్ద ఏటీఎంలు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో ఉండే ప్రధాన 15ఘాట్ల వద్ద ఏటీఎంలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. ఎస్బీఐ, ఎస్బీహెచ్, ఆం«ధ్రాబ్యాంకు, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, కెనరాబ్యాంకు ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 24గంటలూ నగదు నిల్వ ఉంచనున్నారు.
ఉచిత వైఫై సేవలు
పుష్కరస్నానాలకు వచ్చే ప్రతి ఒక్కరికి ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తేనున్నారు. వైఫైలో ఎలాంటి సమస్య రాకుండా ఇప్పటికే కలెక్టర్ టీకే శ్రీదేవి టెలికాం అధికారులను ప్రాంతాన్ని బట్టి సిగ్నల్ సామర్థ్యం పెంచేందుకు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అధికారులు రూపొందించిన యాప్‌లను, సోషల్ మీడియా వినియోగానికి జిల్లాలోని ముఖ్యమైన ఘాట్ల వద్ద వైఫై సౌకర్యాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎఫ్ఎం సేవలు
పుష్కరఘాట్లలో హైదరాబాద్‌కు చెందిన రేడియో మిర్చి ఎఫ్ఎం సేవలను భక్తులకు అందుబాటులోకి తేనున్నారు. పుష్కరస్నానం చేయడానికి వచ్చిన భక్తులు ఉత్సాహంగా గడపడానికి ఎఫ్ఎం ఉపకరిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే హెచ్చరికలు, ట్రాఫిక్ సమాచారం, భక్తుల రద్దీ.. తదితర సమాచారం భక్తులకు చేరవేయడానికి వాడనున్నారు. జిల్లాలో ఎక్కడ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి ఎక్కడ కంట్రోల్ రూం ఉంది.. ఎవరైన తప్పిపోయిన వారి వివరాలు చెబుతారు.
పోలీసుల కోసం..
పోలీస్ కంట్రోల్ గది నుంచి పరిస్థితులను బట్టి అధికారులకు, సిబ్బందికి ఉన్నతాధికారుల ఆదేశాలు సంక్షిప్త సందేశాల ద్వారా మేసేజ్ పంపిచడానికి ్ఛb్చnఛీౌbuట్ట ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఎస్పీస్థాయి నుంచి హోంగార్డు వరకు ఈ సందేశాలు వెళ్తాయి. ఘాట్ల వద్ద విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది వివరాలు ఫోన్నంబర్లతో సహా ఆన్లైన్లో పెట్టనున్నారు. పోలీస్ అధికారులు సమాచారం తెలిపేందుకు సెట్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందకోసం ఘాట్ల వద్ద టవర్లు, ఇప్పటికే ఏర్పాటు చేశారు. 600సెట్లు, 34 రిపీటర్లు, 3020వాట్స్ సెట్స్‌ను వినియోగించనున్నారు. జిల్లాలో ప్రధానజంక్షన్ల వద్ద ట్రాఫిక్ పరిస్థితులు, వెళ్లే మార్గాలను సూచించేందుకు ఎలక్ట్రానిక్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు.