ఏ భాషలో చెప్పాలో తెలియడం లేదు..
పుష్కర పనుల్లో జాప్యం..అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం
బూర్గంపాడు : ‘తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం విశిష్టతను దృష్టిలో పెట్టుకుని, ఇక్కడకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కల్గించవద్దని రూ. 6 కోట్ల నిధులు కేటాయించాం. కోట్ల రూపాయల నిధులు ఇచ్చినా అధికార యంత్రాంగం మధ్య సమన్వయలోపంతో పనులు ఆశించినస్థాయిలో జరగటం లేదు. పనుల్లో ఇంత జాప్యం చోటుచేసుకుంటే ఎలా? అసలు మీకు ఏ భాషలో చెబితే అర్థమవుతుందో తెలియడం లేదు..’ అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగే శ్వరరావు జిల్లా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని సారపాక సమీపంలో వంద ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ పనులను శనివారం పరిశీలించారు.
విద్యుత్‌సౌకర్యం కల్పించే విషయంలో ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి మండిపడ్డారు. వారం రోజుల్లో విద్యుత్ ఏర్పాట్లు పూర్తిచేయాలని డీఈని ఆదేశించారు. కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు జాతీయరోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించినా మొక్కుబడి పనులు చేస్తున్నారే తప్ప నాణ్యతను పట్టించుకోవడం లేదన్నారు. అన్ని ప్రభుత్వశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పుష్కరాల ఏర్పాట్లను సక్రమంగా.. సకాలంలో పూర్తిచేయాలన్నారు.
మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఇలంబరితి, ఎస్పీ షానవాజ్‌ఖాసిం, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, పాల్వంచ సబ్‌కలెక్టర్ కాళీచరణ్, భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఆర్అండ్బీ ఎస్ఈ సతీష్, ఆర్అండ్బీ ఈఈ ధనుంజయ, కొత్తగూడెం డీఎస్పీ సురేందర్‌రావు తదితరులు ఉన్నారు.