ఛత్తీస్గఢ్లో తుపాకీ కాల్పుల కలకలం
రాయిపూర్/జోదాపూర్: మావోయిస్టు గెరిల్లాలకు పోలీసులకు మధ్య మంగళవారం జరిగిన తుపాకీ కాల్పుల్లో ఎనిమిది మంది గెరిల్లా సభ్యులు మృతిచెందగా, ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటన టింటామ్ ప్రాంత శివారులో కొండాగాన్, నారాయణ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గెరిల్లా ఆర్మీ దళాలు కాల్పులకు తెగబడినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఘటనా స్థలిలో పెద్ద ఎత్తునా పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దాదాపు రెండెన్నర గంటలపాటు సాగిన భీకర కాల్పుల్లో గెరిల్లా దళ సభ్యులు ఎనిమిది నుంచి పదిమంది వరకు మృతిచెందగా, పలువురికి గాయాలయినట్టు పోలీసులు నిర్థారించినట్టు తెలిపారు. తుపాకీ కాల్పుల్లో గాయపడిన ముగ్గురు పోలీసుల్లో ఎస్సై పుప్పరాజ్ నాగ్వాన్షి, ఏఎస్ఐ అవాద్ రామ్ సాహు, జిల్లా పోలీసు అధికారి వినయ్ కుమార్ బెగల్ ఉన్నారు. వీరిలో ఎస్సై పుష్పరాజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో రాయిపూర్ ఆస్పత్రికి తరలించారు.