7,480 మందికి పుష్కర జలం పంపిణీ
తపాలా శాఖ డివిజన్ సూపరింటెండెంట్ సత్యనారాయణ
గుంటూరు (లక్ష్మీపురం) : పన్నెండేళ్లకోసారి వచ్చే కృష్ణా పుష్కరాల సందర్భంగా తపాలా శాఖ శుద్ధి చేసిన పుష్కర జలాన్ని భక్తులకు అందిస్తోంది. జూలై 14 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు కూడా పుష్కర జలం కోసం భక్తులు బుకి ంగ్ చేసుకున్నారు. గుంటూరు డివిజన్ పరిధిలోని చిన్న గ్రామాల్లో ఉన్న పోస్టాఫీసులు 126 నుంచి, వాటితో పాటు పెద్ద పోస్టాఫీసులైన తాడికొండ, మంగళగిరి, లేమల్లె, పొన్నెకల్లు, అమరావతి, పెదపాలెం, నూతక్కి, పెదవడ్లపూడి, నంబూరు, పెదకాకాని, ప్రత్తిపాడు, పెదనందిపాడు, తాడేపల్లి, కాకుమాను, అబ్బినేనిగుంట పాలెం, పేరేచర్ల, నల్లపాడు, ఏటుకూరు, గుంటూరు ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల నుంచి మొత్తం 7,480 మంది భక్తులు ముందుగా ఆర్డర్లు చేసుకున్నారు. భక్తులకు 500 మి.లీ వాటర్ బాటిల్‌కు 30 రూపాయలకు తపాలా శాఖ విక్రయిస్తోంది. పుష్కరాల సేకరించిన నీటిని శుద్ధి చేసి ఈనెల 20 వ తేదీ శనివారం నుంచి బుకింగ్ చేసుకున్న భక్తులకు పంపిణీ ప్రారంభించారు. బుక్ చేసుకున్న భక్తులు 20 శాతం మంది స్వయంగా తపాల శాఖకు వచ్చి తీసుకోగా 80 శాతం మందికి పోస్ట్మాన్ల ద్వారా ఇళ్లకు నేరుగా పంపిణీ చేశారు. బుకింగ్ చేసుకున్న మొత్తం 7480 మంది భక్తులకు సోమవారం నాటికి అందరికీ అందజేసినట్టు గుంటూరు డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ డి.సత్యనారాయణ, గుంటూరు డివిజన్ పోస్టల్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎస్.రామకృష్ణ, డివిజనల్ పోస్టుమాస్టర్ ఎం.తిరుమలరావు తెలియజేశారు.