ఉచితంగా బస్సులు నడపండి
జిల్లా ఉపరవాణా కమిషనరు రాజారత్నం
పుష్కరాలకు రవాణాశాఖ ఏర్పాట్లు
నగరంపాలెం: జిల్లాలో ఆగస్టు 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణ పుష్కరాలకు జిల్లాలో ఉన్న అన్ని విద్యాసంస్థలు పుష్కర యాత్రికుల సౌకర్యార్ధం తమ బస్సులను ఉచితంగా నడపాలని జిల్లా ఉపరవాణా కమిషనరు జీసీ రాజారత్నం కోరారు. సోమవారం స్వర్ణభారతినగర్లోని ఆర్టిఏ కార్యాలయంలో ఆర్టీసీ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పుష్కరాల కోసం స్కూల్ బస్సులను 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రవాణా శాఖ ఆధీనంలో ఉంచాలని కోరారు. ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం వాణిశ్రీ మాట్లాడుతూ పుష్కరాలకు ఆర్టీసీ వారు నడపలేని ప్రాం తాల్లో 120 చిన్న బస్సులను నడపాలని కోరారు. ఈ రూట్లలో 300 స్కూలు, ప్రైవేటు బస్సులు 2800 సర్వీసులు నడిచేలా ప్రణాళిక సిద్ధం చేయటం జరిగిందన్నారు. ఈ బస్సులన్నీ పుష్కరనగర్ నుంచి స్నానఘాట్ వరకు నడుస్తాయన్నారు. ఇవే కాకుండా ఆర్టీసీ వారు జిల్లాలోని 14 పుష్కరఘాట్ నుంచి 473 బస్సులను 2549 సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. ఎంవీఐ ఉమామహేశ్వరరావు, ఏవో కరీం, ఏఎంవీఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.