పుష్పక్ చార్జీల పెంపు
సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ఆర్టీసీ పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్ బస్సుల చార్జీలు పెరిగాయి. కొత్త చార్జీలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు మూడు శ్లాబులుగా ఉన్న ఈ చార్జీలను రెండు శ్లాబులుగా కుదించారు. ఈ మేరకు 34 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారిపై రూ.200 చొప్పున 34 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారిపైన రూ.250 చొప్పున చార్జీలు విధిస్తారు.
ఈ లెక్కన ప్రస్తుతం రూ.150 ఉన్న చార్జీ రూ.200కి పెరగనుంది. రూ.200 ఉన్న చార్జీ రూ.250కి పెరగనుంది. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ఇప్పటి వరకు రూ.200 చార్జీ ఉండగా, ఇక నుంచి అది రూ.250కి పెరగనుంది. అలాగే తార్నాక, ఉప్పల్, సెక్రెటేరియట్ వంటి ప్రాంతాల నుంచి రూ.150 ఉండగా, దానిని రూ.200 కు పెంచారు.
ఇక రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ వంటి సమీప ప్రాంతాల నుంచి ఇప్పటివరకు రూ.100 చార్జీ తీసుకుంటుండగా ప్రస్తుతం సమీప ప్రాంతాల శ్లాబును తొలగించారు. దీంతో ఎయిర్పోర్టుకు దగ్గర గా ఉన్న కేంద్రాల నుంచి వెళ్లే ప్రయాణికులు సైతం రూ.200 చెల్లించుకోవలసిందే. ఈ మేరకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.కోటేశ్వర్రావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.