పుట్లూరు మండలంలో కలకలం
పుట్లూరు (శింగనమల) : తన భూమిని వేరొకరి పేరుపై ఆన్లైన్లో నమోదు చేసినందుకు మనస్తాపం చెందిన ఓ రైతు పుట్లూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఎదుటే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తహసీల్దార్ రామచంద్రారెడ్డి ఉద్యోగ విరమణకు కొన్ని గంటల ముందు ఈ సంఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. పుట్లూరు మండలం సూరేపల్లికి చెందిన మంగళ గుర్రప్ప 180 సర్వేనంబర్‌లో గల 5.27 ఎకరాల భూమికి తన పేరుపై పాసుపుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల ఆ భూమిలో 1.75 ఎకరాలు ఆదిలక్ష్మమ్మ అనే మహిళ పేరుపై ఆన్లైన్లో నమోదు చేశారు.
తన భూమిని ఇతరులకు ఎలా ఇచ్చారంటూ శుక్రవారం తహసీల్దార్ రామచంద్రారెడ్డితో రైతు గుర్రప్ప వాగ్వాదానికి దిగాడు. ఆదిలక్ష్మమ్మ అనే మహిళ తనకు భూమిపై హక్కు ఉన్నట్లు రికార్డులు చూపించిందని, దాని ఆధారంగా ఆన్లైన్లో నమోదు చేశామని, ఏవైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని తహసీల్దార్ అన్నారు. ఈ సమాధానానికి సంతృప్తి చెందని గుర్రప్ప తన వెంట తెచ్చుకున్న పురుగుమందును తహసీల్దార్ ఎదుటే తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే పోలీసులు బాధిత రైతును స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం రైతును తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఇదిలా ఉండగా తహసీల్దార్ రామచంద్రారెడ్డి ఇదే రోజు ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ విరమణకు కొన్ని గంటల ముందు చోటు చేసుకున్న రైతు ఆత్మహత్యాయత్నం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.