రాందేవ్ మందుపై నిషేధం
భోపాల్: యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన వివాదాస్పద మెడిసిన్ పుత్రజీవక్ను ఎక్కడా అమ్మకాలు జరపొద్దని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. దాని పేరు మార్చేవరకు ఎవరు అమ్మకాలు జరపొద్దని స్పష్టం చేసింది. పుత్ర జీవక్ వాడితే మగ సంతానం కలుగుతుందని దాని విక్రయదారులు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కేసీ త్యాగి పార్లమెంటులో ఈ విషయాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే. పుత్ర జీవక్ ప్యాకెట్లు పార్లమెంటుకు తెచ్చిమరీ ఈ వివాదం లేవనెత్తారు.
ఇది పెద్ద దుమారాన్ని లేపింది. అయితే, అది కేవలం మొక్క పేరు మాత్రమేనని, తమ మెడిసిన్ వాడితే మగ సంతానం కలుగుతుందని తాము ఎక్కడా చెప్పలేదని రాందేవ్ ప్రత్యేక వివరణ ఇచ్చారు కూడా. కానీ, ప్రజలను పక్కదారి పట్టిస్తున్న ఈ మందుల ఉత్పత్తి విషయంలో, కొనుగోలు, అమ్మకాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో తాజాగా మధ్యప్రదేశ్లో దీనిపై నిషేధం విధించారు.