ఫ్యాక్టరీలో కార్మికురాలు ఆత్మహత్య
బెంగళూరు, న్యూస్‌లైన్: కార్మికురాలు ఫ్యాక్టరీలో నిప్పం టించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మైసూరు రోడ్డులోని హొసగుడ్డదహళ్లిలో జనార్దన్, పుట్టమ్మ (37) దంపతులు నివాసం ఉంటున్నారు. పిణ్యా సెకండ్ స్టేజ్‌లోని 14వ క్రాస్‌లో ఉన్న స్పాన్ సిల్క్ కంపెనీలో దంపతులు పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం దంపతులిద్దరూ విధులకు హాజరయ్యారు.
ఉదయం టీ తాగే సమయంలో పుట్టమ్మ ఓ గదిలోకి వెళ్లి శరీరపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. సిబ్బంది గుర్తించి అదుపు చేసినప్పటికీ రక్షించలేక పోయారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా కంపెనీ మేనేజర్ మురళి వేధింపుల వల్లే తన భార్య ఆత్మహత్య చేసుకుందని భర్త జనార్ధన్ ఆరోపించగా వ్యక్తిగతంగా పుట్టమ్మపై తనకు ఎలాంటి కక్షలు లేవని మురళి మీడియాకు చెప్పాడు. పోలీసులు మురళిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరో వైపు ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.