puttintiki ra chelli
-
ఆస్పత్రిలో చేరిన నటి హేమా చౌదరి.. విషమంగా ఆరోగ్య పరిస్థితి
సౌత్ ఇండియ ప్రముఖ నటి హేమా చౌదరి బ్రెయిన్ హెమరేజ్ కారణంగా బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె చికిత్సకు స్పందించడం లేదని సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితి అంత మెరుగ్గా లేకపోవడంతో ఆమె కుమారుడు కూడా నేడు విదేశాల నుంచి వస్తున్నాడు. నటి హేమా చౌదరి ఎక్కువగా కన్నడ చిత్రాల్లోనే నటించి ఆపై తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో 100కు పైగా చిత్రాల్లో మెప్పించింది. కన్నడలో డా. రాజ్‌కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్‌నాగ్, అనంతనాగ్, రవిచంద్రన్ వంటి ప్రముఖ నటులతో నటించారు. కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ బాబు, ప్రేమ్ నజీర్ తదితరులతో కూడా నటించారు. కె.బాలచందర్, డి.యోగానంద్, పి.సాంబశివరావు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, సంగీతం శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ, కె.శంకర్ లాంటి గొప్ప దర్శకుల చిత్రాల్లో కూడా హేమా చౌదరి నటించారు. పుట్టింటికి రా చెల్లి, గోరింటాకు, సుందరకాండ,మేస్త్రీ, ప్రేమాలయం వంటి చిత్రాల్లో ఆమె నటించించారు. ఆపై కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు ఎంపిక కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేశారు. సువర్ణ రత్న అవార్డు, సువర్ణ పరివార్ పాపులర్ స్టార్ సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో చికిత్సకు స్పందించడం లేదు. విదేశాల నుంచి కుమారుడి రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ నవ్వులను ఆదుకుందామా!
160 మంది అమ్మాయిలు.. నెలల చిన్నారుల నుంచి టీనేజి అమ్మాయిల వరకు.. వాళ్లంతా కిలకిలా నవ్వుతుంటారు.. ఆ గాజుల గలగలలు ముచ్చటనిపిస్తాయి.. అంతా ఒకే గూటి కింద ఉంటూ.. ఆడుతూ, పాడుతూ, చదువుతూ, ఆడుకుంటూ ఉంటారు.. హైదరాబాద్: అయితే వాళ్లకు, మీ ఇంట్లో ఉండే సొంత చెల్లెళ్లు, కూతుళ్లకు తేడా ఏంటో తెలుసా? వీళ్లంతా మాజీ సెక్స్ వర్కర్ల పిల్లలు, మనుషుల అక్రమ రవాణా బాధితులు. అంగడి సరుకుల్లా డబ్బు కోసం ఎవరో ఒకరు.. కొన్నిసార్లు సొంత తల్లిదండ్రులు కూడా అమ్మేసిన అభాగ్యులు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థకు చెందిన డాక్టర్ సునీతా కృష్ణన్ ఈ అమ్మాయిలతో పాటు మరో 15 వేల మందికి ఓ గూడు కల్పించారు. ఒక మంచి కుటుంబంలో అందే ఆప్యాయతానురాగాలను వారికి చవిచూపించారు. తమ పాత జీవితంలోని చేదు అనుభవాలను, నాటి భయానక గాధలను మర్చిపోయి.. సుఖసంతోషాలతో కూడిన సరికొత్త జీవితాన్ని అనుభవించేందుకు ఒక అవకాశం ఇచ్చారు. అయితే, ఇన్నాళ్ల బట్టి వాళ్లకు కాస్తంత నీడనిచ్చిన గూడు ఇప్పుడు లేదు. ఆ చిన్నారులను బుజ్జాయిల్లా కాపాడుతూ వస్తున్న బొమ్మరిల్లు ఇక లేదు. తిరిగి గూడు సమకూర్చుకోడానికి వాళ్లకు పెద్దంత సమయం కూడా లేదు. ఇలాంటి కష్టకాలంలో మనమంతా సహృదయంతో స్పందించాల్సిన అవసరం ఉంది. మనమధ్యే నవ్వుతూ.. తుళ్లుతూ తిరుగుతున్న ఈ అమాయకులను సంరక్షించేందుకు 'ప్రజ్వల' చేస్తున్న పోరాటానికి ఒకింత ఊతం అందించాలి. ప్రజ్వల కోసం ఒక గూడు కట్టుకోవాల్సిన సమయం వచ్చింది. అక్కడ ఉన్నవాళ్లు కూడా మన సొంత చెల్లెళ్లు, కూతుళ్లలాగే హాయిగా ఉండాలంటే.. ఇది తప్పనిసరి. ఇందుకోసం సహృదయంతో ముందుకొచ్చి ఇచ్చే తృణమైనా.. పణమైనా మహాప్రసాదమే. ప్రజ్వల గురించి తెలుసుకోవాలంటే.. డాక్టర్ సునీతా కృష్ణన్‌తో మాట్లాడాలంటే ఆదివారం.. ఆగస్టు రెండోతేదీ ఉదయం 11 గంటలకు 'సాక్షి టీవీ' చూడండి. మీ ఆపన్న హస్తాలను ఆమెకు అందించండి. విరాళాలు అందించడానికి, ఇతర వివరాలకు ప్రజ్వల వెబ్ సైట్ చూడండి.