28న పీవీ స్మారకోపన్యాసం
ప్రసంగించనున్న గాంధీ మనవడు రాజ్మోహన్గాంధీ
సాక్షి,హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జ్ఞాపకార్థం ఈనెల 28న హైదరాబాద్లో ‘స్వాతంత్య్రం - సామాజిక న్యాయం’ అంశంపై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీవీ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ మనవడు, ప్రముఖ రచయిత రాజ్మోహన్గాంధీ స్మారకోపన్యాసం చేస్తారని పేర్కొంది. ఆదివారం ఉదయం రవీంద్రభారతిలో సీనియర్ సంపాదకులు డాక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పాటు పీవీ కుటుంబసభ్యులు, పలు రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. రెండేళ్లుగా పీవీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మారకోపన్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తొలి ఏడాది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గత ఏడాది అప్పటి కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ స్మారకోపన్యాసం చేశారు.