ఢిల్లీలో పీవీ స్మారక ఘాట్ సిద్ధం
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఆయన చనిపోయిన పదేళ్ల తరువాత దేశరాజధానిలో ఒక స్మారక చిహ్నం సిద్ధమైంది. తన సొంతపార్టీ , సొంత ప్రభుత్వమే ఆయన్ను దూరం చేయడంతో మిగతా రాష్ట్రపతులు, ప్రధానులు దక్కించుకున్న గౌరవానికి నోచుకోని పీవీకి ఏక్తాస్థల్ వద్ద రాష్ట్రీయ స్మృతి ప్రాంగణంలో సమాధి ఆకారంలో ఘాట్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
దీర్ఘకాలంగా ఈ విషయంలో జరిగిన నిర్లక్ష్యం తరువాత ఇటీవలే కేంద్ర కేబినెట్ పీవీ స్మారక ఘాట్ నిర్మించాలని నిర్ణయించిందని, జూన్ 28, 2015న పీవీ 94వ జయంతి నాటికి సిద్ధమైందని, చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన వెల్లడించారు. పీవీ స్మారక ఘాట్ వద్ద పీవీ సేవలను కొనియాడుతూ రాసిన వ్యాఖ్యలను ఆయన ఈ ప్రకటనలో వెల్లడించారు. ‘అపార మేధోసంపన్నుడైన ప్రధానమంత్రిగా సుపరిచితులైన పి.వి.నరసింహారావు జూన్ 28, 1921న తెలంగాణలోని వరంగల్లు జిల్లాలో గల లక్నేపల్లి గ్రామంలో జన్మించారు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్య్ర సమరయోధుడిగా నిలిచారు. ఒక సంస్కర్త, విద్యావేత్త, మేధావి, 15 భాషలు తెలిసిన వ్యక్తిగా సుపరిచితులు. 1962 నుంచి 1971 వరకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో బృహస్పతి(తెలివైన వ్యక్తి)గా పేరొందినవారు. దేశంలో 1972లోనే భూసంస్కరణలు అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి ఈయన. 1980-89 మధ్య కేంద్ర కేబినెట్లో సభ్యుడిగా ఉన్న పీవీ నరసింహారావు పలు శాఖల బాధ్యతలు నిర్వర్తించి చెరగని ముద్ర వేశారు.
భారత ప్రధానిగా ఆయన ఆర్థిక సంస్కరణలకు తెర తీసి మెరుగైన ఆర్థిక భారతావనికి పునాదులు వేశారు. పరిపాలనలో చెరగని గురుతులు వేసిన పి.వి.నరసింహారావు 2004 డిసెంబర్ 23న పరమపదించారు. ఆర్కిటెక్ట్ ఆఫ్ వైబ్రంట్ ఇండియాగా ఆయన గుర్తుండిపోతారు..’ అని అక్కడి శిలాఫలకంలో రాశారు.ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకం