కల్తీ నిరోధానికి కఠిన చట్టాలు ఉండాలి
లోక్‌సభలో వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : ఆహార పదార్థాల కల్తీపై వైఎస్సార్ సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి లోక్‌సభలో ఆందోళన వ్యక్తంచేశారు. కల్తీ నివారణకు తీసుకుంటున్న చర్యలేవీ అంటూ సోమవారం ‘కాలింగ్ అటెన్షన్’ కింద ప్రస్తావించారు. ‘దేశానికి ఉగ్రవాద ముప్పుకంటే కల్తీ ద్వారా పొంచి ఉన్న ముప్పు తీవ్రమైనది. కనీస అవసరాలైన నీళ్లు, పాలు, వంట నూనెలతో సహా కల్తీ లేని పదార్థమంటూ లేదు.
దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టడంలేదు. శుద్ధి చేసిన నీరు పేరుతో మార్కెట్లో దొరికే చాలా నీటి సీసాలు శుభ్రత లేనివే. ఇప్పుడు పాలలో కాస్టిక్ సోడా, సబ్బు, యూరియా, ఆయిల్ కలిపి తయారు చేసే సింథటిక్ పాలను కలుపుతున్నారు. సింథటిక్ పాల వల్ల క్యాన్సర్ వస్తుంది. గుండె, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఆహార కల్తీకి పాల్పడేవారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు ఉండాలి. హత్యాయత్నం సెక్షన్లను వీటికి వినియోగించాలి’’ అని కోరారు.
వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించారని, ఇలాంటి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించాలని కోరారు. ఇదే అంశంపై మరో ఇద్దరు సభ్యులు కూడా మాట్లాడారు. అనంతరం ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా దీనిపై సమాధానమిస్తూ.. ఆహార పదార్థాల కల్తీ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రం ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు.