తమిళనాడులో శ్రీలంక జాతీయుడి అరెస్ట్
రామేశ్వరం: అక్రమంగా భారత్లోకి ప్రవేశించి, ఇక్కడే ఉంటున్న శ్రీలంక జాతీయుడిని పోలీస్ అధికారులు శుక్రవారం అరెస్టుచేశారు. తమిళనాడు లోని రామేశ్వరం తీరప్రాంతంలో అనుమానంగా తిరుగుతున్న వ్యక్తిని 'క్యూ' బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... దనుష్ కోడి, చెరాన్కోట్టాయ్ మధ్యలోని తీరప్రాంతంలో శ్రీలంక జాతీయుడు రాజేంద్రన్(35)ని గుర్తించినట్లు తెలిపారు.
అయితే, అతడు గత పదేళ్లుగా భారత్లోనే తలదాచుకుంటున్నాడని అధికారులు తెలుసుకున్నారు. నిందితుడు రాజేంద్రన్ లంకలోని మన్నార్ జిల్లాకు చెందినవాడు కాగా, 2005లో పర్మిషన్ లేకుండా భారత భూభాగంలోకి ప్రవేశించాడని తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు స్వదేశమైన లంకకు వెళ్లాని నిర్ణయించుకున్నాడు. బోటు ద్వారా తిరిగి తన స్వంత ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తికి గురువారం రాత్రి రూ.10 వేలు ఇచ్చినట్లు విచారణలో తేలింది. రాజేంద్రన్ నుంచి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.