ఎన్టీపీసీ ఫలితాలు భేష్
ముంబై: భారతదేశ అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థెర్మల్ ఫవర్ కార్పోరేషన్ (ఎన్టీపీసీ) మార్కెట్ అంచనాలకు మించి లాభాలను నమోదు చేసింది. ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజమైన ఎన్టీపీసీ ఈ ఏడాది తొలి త్రైమాసిక(క్యూ1) ఫలితాలను సోమవారం విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 4.1 శాతం పెరిగి రూ. 2369 కోట్లను తాకింది. గత ఏడాది ఇది రూ.2,276 కోట్లుగా ఉండగా, రూ. 2346 కోట్ల నికర లాభాలను ఆర్జిస్తుందని విశ్లేషకులు అంచనావేశారు.
ఆదాయంలోకూడా ఎన్టీపీసీ అదరగొట్టింది. ఈ త్రైమాసికంలో ఆదాయం 11.5 శాతం ఎగసి రూ.19116 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 47.5 శాతం జంప్‌చేసి రూ. 5210 కోట్లుకాగా, ఇబిటా మార్జిన్లు 27.3 శాతంగా నమోదయ్యాయి. ఇక పన్ను వ్యయాలు కూడా రూ. 422 కోట్ల నుంచి రూ. 707 కోట్లకు పెరిగాయి. కాగా ఫలితాలు సానుకూలంగాఉన్నప్పటికీ, నేటి మార్కెట్ లో ఎన్టీపీసీ షేరు 3 శాతానికి పైగా నష్టం పోయింది. ఇటీవల బాగా లాభపడడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారని ఎనలిస్టుల భావన.