నో స్టాక్
- సివిల్ సప్లై గోదాములు ఖాళీ
- పత్తాలేని పామాయిల్
- నిలిచిన చక్కెర సరఫరా
- డీడీలు కట్టవద్దని మౌఖిక ఆదేశాలు
సాక్షి, సిటీబ్యూరో: గత రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో అట్టహాసంగా ప్రవేశపెట్టిన ‘అమ్మహస్తం’ సరుకుల స్టాక్‌కు కొరత ఏర్పడింది. పథకం ప్రారంభం నుంచి అరకొరగా సరఫరా అవుతున్న తొమ్మిది సరుకులకు పూర్తి స్థాయిలో ఫుల్స్టాప్ పడింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పౌరసరఫరా గోదాముల్లో తొమ్మిది సరుకుల స్టాక్ లేకుండా పోయింది.
జూన్ నెలకు సంబంధించి తొమ్మిది సరుకుల కోసం డీడీలు కట్టవద్దని సంబంధిత అధికారుల నుంచి రేషన్ డీలర్లకు మౌఖిక ఆదేశాలు అందాయి. గత కొద్ది నెలలుగా పామాయిల్ సరఫరా లేకుండా పోగా, తాజాగా చక్కెర, కందిపప్పు, చింతపండు, కారంపొడి, పసుపు, ఉప్పు తదితర సరుకులపై సైతం అధికారులు చేతులు ఎత్తేశారు. ఫలితంగా జూన్ నెల సరుకుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. చౌకధర దుకాణాల ద్వారా రూ.185 లకే తొమ్మిది రకాల నాణ్యమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలన్న నిరుపేదల ఆశలు అడియాశలయ్యాయి.
రెండు సరుకులే..
ప్రభుత్వ చౌక ధర దుకాణాల ద్వారా నిరుపేదలకు ఈ నెలలో సబ్సిడీపై రెండే రెండు సరుకుల పంపిణీ జరుగనుంది. ప్రస్తుతం పౌరసరఫరా గోదాముల్లో కేవలం బియ్యం, గోధుమ పిండి మాత్రమే స్టాక్ ఉండటంతో డీలర్లు సైతం ఆ రెండింటికే డీడీలు చెల్లించినట్లు సమాచారం. జూన్ నెలకు సంబంధించి చౌకధర దుకాణాలకు రెండు సరుకుల కోటా సరఫరా ఇప్పటికే ప్రారంభమైంది.
మిగితా సరుకుల ఊసే లేకుండా పోయింది. తొమ్మిది సరుకుల సరఫరా సంబంధించిన టెండర్ల కాలపరిమితి ముగిసినప్పటికీ పునరుద్ధరణకు నోచుకొలేదు. వాస్తవంగా తొమ్మిది సరుకుల్లో ఏడింటికి లబ్ధిదారుల ఆదరణ లేకుండా పోవడంతో అధికారులు... డిమాండ్ లేక, గిట్టుబాటు కాకపోవడంతో సదరు కాంట్రాక్టర్లు సైతం పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. దీంతో సరుకులు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
నాణ్యత లోపమే..
తొమ్మిది సరుకుల నాణ్యత లోపమే సరఫరా ఆగిపోవడానికి ప్రధాన కారణమైనట్లు కనిపిస్తోంది. ముక్కిపోయిన కందిపప్పు, గింజల చింతపండు, పురుగుల మయమైన గోధుమలు, గోధుమ పిండి, ఘాటివ్వని కారం పొడి, రుచిలేని ఉప్పు లబ్ధిదారులను మెప్పించలేకపోయాయి. దీంతో వారు అమ్మహస్తం తొమ్మిది సరుకుల్లో మూడు సరుకులపైనే అసక్తి కనబర్చుతూ వచ్చారు. గోధుమలు, చక్కెర, పామాయిల్ మాత్రమే కొనుగోలు చేసి మిగతా ఆరు సరుకుల జోలికి వెళ్లలేదు. తాజాగా ఆ మూడింటికి సైతం కొరత ఏర్పడింది. దీంతో ఈ మాసం సరుకుల పంపిణీ ప్రశ్నార్ధకంగా మారింది.