quarell with wife
-
భార్యతో గొడవ.. ఎంత పని చేసింది!
భార్యతో గొడవ జరగడం వల్ల ఆత్మహత్య చేసుకోవాలని మూడు అంతస్థుల పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకినా, అతడి ప్రాణాలు పోలేదు సరికదా.. అక్కడ కింద పడుకొని ఉన్న 75 ఏళ్ల వృద్ధురాలి మీద అతడు పడటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దాంతో అతడి మీద పోలీసు కేసు నమోదైంది. శారద అనే ఆ వృద్ధురాలు చల్లగాలి కోసం ఆరుబయట మంచం వేసుకుని అక్కడే పడుకుంది. ఆటోడ్రైవర్‌గా జీవనాన్ని కొనసాగించే సెల్వమురుగన్ (37) ఇక జీవితాన్ని చాలించాలనుకుని మూడో అంతస్థు పైకి ఎక్కడి అక్కడి నుంచి దూకాడు. అయితే ఆ సమయంలో కింద వృద్ధురాలున్న విషయాన్ని అతడు గుర్తించలేకపోయాడు. సరిగ్గా ఆమె మీద పడటంతో ఆమె అక్కడే మరణించింది. సెల్వమురుగన్ తలకు కూడా గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. కిందకు దూకే సమయానికి అతడు తాగేసి ఉన్నాడని పోలీసులకు తెలిపారు. తన భార్య ధనలక్ష్మితోను, బావమరిదితోను అతడికి గొడవ అయ్యిందని, దాంతో తాను చచ్చిపోతానని వాళ్లకు చెప్పి మేడమీదకు ఎక్కాడని అన్నారు. అయితే, అతడు ప్రతిసారీ అలాగే చెబుతుండటంతో వాళ్లు పట్టించుకోలేదన్నారు. దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి అతడు కిందకు దూకేశాడు. కింద వృద్ధురాలి మీద పడినప్పుడు ఆమె అరవడంతో చుట్టుపక్కల వాళ్లు లేచారు. వెంటనే వాళ్లు సెల్వమురుగన్, శారదలను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వాళ్లు రాయపేటలోని ప్రభుత్వాస్పత్రికి పంపగా అక్కడ శారద మరణించారు. తలకు, కాళ్లకు తీవ్రగాయాలైన సెల్వ మురుగన్‌ను రాజీవ్ ప్రభుత్వాస్పత్రికి పంపారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. శారద ప్రాణాలు కోల్పోవడంతో సెల్వమురుగన్‌పై కేసు నమోదు చేశారు. -
భార్య వదిలేస్తే.. విమానాన్ని కూల్చేస్తా: పైలట్
భార్య తనను వదిలేస్తే.. 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానాన్ని కూల్చేస్తానని ఓ ప్రబుద్ధుడు బెదిరించాడు. అతడు ఎవరో కాదు.. సాక్షాత్తు ఆ విమానం నడిపే పైలట్!! రోమ్ నుంచి జపాన్ వెళ్లే విమానానికి పైలట్‌గా వ్యవహరిస్తున్న సదరు వ్యక్తి ఈ మేరకు తన భార్యకు ఎస్ఎంఎస్ పంపాడు. భర్తను వదిలిపెట్టి వెళ్లిపోతానని ఆమె చెప్పడంతో.. అలా చేస్తే విమానాన్ని కూల్చేస్తానని అతగాడు అన్నాడట. గత సంవత్సరం జనవరిలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, విమానం టేకాఫ్ తీసుకోడానికి కొన్ని నిమిషాల ముందు అతడిని పోలీసులు ఆపేశారు. అతడు తనకు ఎస్ఎంఎస్ పంపిన విషయాన్ని పైలట్ భార్య వెంటనే అధికారులకు చెప్పడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. 'నువ్వు గనక నన్ను వదిలేస్తే నేను ఆత్మహత్య చేసుకోవడమే కాదు.. విమానంలో ఉన్న అందరినీ చంపేస్తా' అని అతడు బెదిరించాడట. ఆ విషయం ముందే అధికారులకు తెలియడంతో వెంటనే అతడి బదులు మరో పైలట్‌ను ఆ విమానం నడిపేందుకు పంపారు. ప్రయాణికులెవ్వరికీ ఈ విషయం తెలియనివ్వలేదు. ఇప్పటివరకు కూడా దాన్ని రహస్యంగానే ఉంచారు. తన భర్త తనను సరిగా చూసుకోవడం లేదంటూ అంతకుముందు ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఆ పైలట్.. మానసిక చికిత్స పొందుతున్నాడు. జర్మన్ పైలట్ ఆండ్రియాస్ లూబిట్జ్ కావాలనే జర్మన్వింగ్స్ విమానం ఎ 320ని ఆల్ప్స్ పర్వతాల్లో కూల్చేసి 149 మందిని చంపేసిన రెండు నెలల ముందు ఈ ప్రమాదం తప్పింది.