భార్య వదిలేస్తే.. విమానాన్ని కూల్చేస్తా: పైలట్
భార్య తనను వదిలేస్తే.. 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానాన్ని కూల్చేస్తానని ఓ ప్రబుద్ధుడు బెదిరించాడు. అతడు ఎవరో కాదు.. సాక్షాత్తు ఆ విమానం నడిపే పైలట్!! రోమ్ నుంచి జపాన్ వెళ్లే విమానానికి పైలట్‌గా వ్యవహరిస్తున్న సదరు వ్యక్తి ఈ మేరకు తన భార్యకు ఎస్ఎంఎస్ పంపాడు. భర్తను వదిలిపెట్టి వెళ్లిపోతానని ఆమె చెప్పడంతో.. అలా చేస్తే విమానాన్ని కూల్చేస్తానని అతగాడు అన్నాడట. గత సంవత్సరం జనవరిలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, విమానం టేకాఫ్ తీసుకోడానికి కొన్ని నిమిషాల ముందు అతడిని పోలీసులు ఆపేశారు. అతడు తనకు ఎస్ఎంఎస్ పంపిన విషయాన్ని పైలట్ భార్య వెంటనే అధికారులకు చెప్పడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.
'నువ్వు గనక నన్ను వదిలేస్తే నేను ఆత్మహత్య చేసుకోవడమే కాదు.. విమానంలో ఉన్న అందరినీ చంపేస్తా' అని అతడు బెదిరించాడట. ఆ విషయం ముందే అధికారులకు తెలియడంతో వెంటనే అతడి బదులు మరో పైలట్‌ను ఆ విమానం నడిపేందుకు పంపారు. ప్రయాణికులెవ్వరికీ ఈ విషయం తెలియనివ్వలేదు. ఇప్పటివరకు కూడా దాన్ని రహస్యంగానే ఉంచారు. తన భర్త తనను సరిగా చూసుకోవడం లేదంటూ అంతకుముందు ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఆ పైలట్.. మానసిక చికిత్స పొందుతున్నాడు. జర్మన్ పైలట్ ఆండ్రియాస్ లూబిట్జ్ కావాలనే జర్మన్‌వింగ్స్ విమానం ఎ 320ని ఆల్ప్స్ పర్వతాల్లో కూల్చేసి 149 మందిని చంపేసిన రెండు నెలల ముందు ఈ ప్రమాదం తప్పింది.