Queen elizebeth 2
-
ప్రజాస్వామ్యంలో రాజరికమా?
‘బ్రిటన్ అంటే ఎంతో అభివృద్ధి చెందిన నాగరిక దేశం’ అంటారే! ‘పారిశ్రామిక విప్లవం మొదట జరిగిందే అక్కడ’ అంటారు. మరి ఇంకా అక్కడ రాజరికం ఎందుకు ఏదో ఒక రూపంలో వుంది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ‘మతం’ అనేదానికి ‘దేవుడు’ ఎలాగైతే అంతిమ రూపమో, రాజ్యాధికారానికి ‘రాజు’ అనేవాడు అంతిమ రూపంగా తయారయ్యాడు– అని ఏంగెల్సు అన్నాడు. శ్రమలు చేసుకు బ్రతికే ప్రజలకు వర్గ చైతన్యం లేనప్పుడు, రాజుల్నీ, రాణుల్నీ, వాళ్ళ అట్టహాసపు ఆడంబరాల్నీ చూసి, నోర్లెళ్ళబెడతారు. అరవై ఏళ్ళ పాటు బ్రిటన్ ‘రాణి’ పదవిలో వున్న ఎలిజెబెత్, 96 ఏళ్ళ వయసులో ఈ మధ్య పోయింది. ఆ సందర్భంగా వచ్చిన ప్రశ్నలు కొన్ని. ‘బ్రిటన్ అంటే ఎంతో అభివృద్ధి చెందిన నాగరిక దేశం’ అంటారే! ‘పారిశ్రామిక విప్లవం మొదట జరిగిందే అక్కడ’ అంటారు. ఫ్రాన్స్ కంటే ఎన్నో ఏళ్ళ ముందే ‘రాజరికానికి వ్యతిరేకంగా మొట్ట మొదటి సారి బ్రిటన్‌లోనే విప్లవం’ జరిగింది అంటారు. మరి ఇంకా రాజరికం ఎందుకు ఏదో ఒక రూపంలో వుంది? నిన్నటి దాకా, రాణీ రూపంలో వుంది. ఇప్పుడేమో ఆమె కొడుకు రాజయ్యాడు. మనుమలు యువ రాజులయ్యారు. పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శించడానికి మార్క్స్ బ్రిటన్‌లో భాగమైన ఇంగ్లండునే ఉదాహరణగా తీసు కున్నాడు. అందరూ బ్రిటన్‌ని ‘గొప్ప ప్రజాస్వామ్య దేశం’ అంటారు. మరి అక్కడ ఇంకా రాజకుటుంబం వాళ్ళు పరిపాలనలో వున్నారే? అంతా వింతగా వుంది! దీన్ని ఎలా అర్ధం చేసు కోవాలి?’అని అనేక ప్రశ్నలు గతంలోవే మళ్ళీ మళ్ళీ లేస్తున్నాయి. ఇవన్నీ మంచి సందేహాలే. కానీ, ఈ సందేహాలు, బయటి దేశాల ప్రజలలో కంటే, బ్రిటన్ ప్రజలలోనే సహజంగా రావాలి. కానీ, అక్కడి ప్రజలకి, ముఖ్యంగా శ్రామిక వర్గానికి ఈ ప్రశ్నలు రానేలేదు. అక్కడ కొన్ని కమ్యూనిస్టు గ్రూపులవాళ్ళు ‘రాజరికం నశించాలి, కార్మికవర్గ రిపబ్లిక్ రావాలి’ అనే నినాదాలు ఇస్తూనే వుంటారు. ఇప్పటికీ ఇస్తూనే వున్నారు. కానీ, అక్కడ దాదాపు 400 ఏళ్ళ కిందట రాజరికానికి వ్యతిరేకంగా పోరాటం జరిగి, ఒక రాజుని ఉరితీసి, కొన్నాళ్ళ తర్వాత ఇంకో రాజుని తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టారో వివరించే పని జరగలేదు. అందుకే, అక్కడి ప్రజలకి చిన్నప్పటినించీ చూస్తూవున్న విషయాలను చూడడానికి మించి ఏ కొత్త ఆలోచనా పుట్టలేదా? అక్కడ చిన్నతనం నించీ, స్కూళ్ళల్లో జాతీయ గీతంలోనే రాజు పట్లా, రాణీ పట్లా గౌరవాన్ని బోధిస్తారని చదివాం. ‘‘గాడ్ సేవ్ ది కింగ్’’ (దేవుడు రాజుని రక్షించుగాక!) అని మొదలవుతుంది వాళ్ళ జాతీయ గీతం. రాజు పోయాక, అతని కూతురు రాణీగా సింహాసనం ఎక్కాక, ‘గాడ్ సేవ్ ది క్వీన్’ అనడం మొదలెట్టారట. స్కూలు పిల్లల్ని రాజప్రాసాదాలకూ; విహార యాత్రలలో రాణీ కుటుంబీకులు విడిది చేసే భవనాలకూ తీసికెళ్ళి చూపించడం చేస్తారు. రాజసం ఉట్టిపడేలా, రాణీ ధరించే నగలూ, రకరకాలైన టోపీలూ, ధగ ధగ మెరిసే పెద్ద గౌనులూ... ఇలా రాణీ గారి ఆడంబరాలన్నిటినీ అక్కడి పత్రికలూ, టీవీలూ, నిరంతరం చూపిస్తూనే వుంటాయి. లండన్‌లోని ఒక కార్మిక నాయకురాలు 4 ఏళ్ళ కిందట రాసిన ఒక వ్యాసంలో, శ్రామిక వర్గ స్త్రీలలో కూడా రాణీ అంటే, ఎంత గ్లామరో (ఆకర్షణో) చెప్పడానికి ఒక సంఘటన చెప్పింది. కార్మికురాలైన తన తల్లి, రాణీని ఒక పెరేడ్లో చాలా దగ్గరగా చూసి, ‘‘రాణీ గారు ఎంత అందంగా, ఎంత గొప్పగా వుంటుందో?’’ అని అన్నదట. తల్లి మెచ్చు కోళ్ళకి జవాబుగా, మన కార్మిక నాయకురాలు తల్లితో ఇలా అన్నదట: ‘‘అవును అమ్మా! 24 గంటలూ, వైద్యులూ, బ్యూటీషియన్లూ, సేవ కులూ, వంటవాళ్ళూ అందుబాటులో వుంటే, అలా వుండక ఎలా వుంటారులే’’ అని. పనీ, పాటా వుండదు రాణీ గారికి, రిబ్బన్లు కత్తిరిం చడం తప్ప– అని కూడా అందట. దానికి వాళ్ళమ్మ ‘ఏమిటా మొరటు మాటలు?’ అనేదట. ‘వాళ్ళ రాజసాలూ, ఠీవీలూ, విలాసాలూ అన్నీ ప్రభుత్వానికి ప్రజలు కట్టే పన్నుల నించే గదా తగలేసేది’ అని కూడా కూతురు అనేదట. ఇవన్నీ నిజమే. అంతే కాదు, రాణీ ఆస్తుల విలువ 3 వేల కోట్ల పైనే అని పత్రికలు రాశాయి. అనేక భవనాలూ, అనేక వ్యాపార సంస్థలూ, వ్యవసాయ ఎస్టేట్లూ, షేర్లూ, ఇదనీ అదనీ లేదు. ఇక్కడి పుల్ల తీసి అక్కడ పెట్టే పని లేని రాణీకి కుప్పలు కుప్పల ఆస్తులు! రాజరికం ఇప్పటికీ ఎందుకు వుందో అర్థం కావాలంటే, చరిత్రలో రెండు, మూడు వందల ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. అదంతా క్లుప్తంగా ఇలా చెప్పుకోవచ్చు. 1625లో ఇంగ్లండుకు రాజు మొదటి ఛార్లెస్ అనేవాడు. రాజూ, మతాధిపతులూ, ఫ్యూడల్ భూస్వాములూ, ఒక వర్గం. జీతం పద్ధతి మీద కూలీలను పెట్టుకుని, తయారు చేయించిన సరుకులను పట్టణాలలో అమ్మించే వర్తక భూస్వాములు ఒక వర్గం. వీళ్ళలో చిన్న చిన్న కర్మాగారాల (ఫ్యాక్టరీలకు మొదటి రూపాలు) యజమానులు కూడా వున్నారు. కౌలు రైతులూ, చేతి వృత్తుల వాళ్ళూ, సొంత శ్రమల మీద బ్రతికే ఇతర శ్రామికులూ, ఒక వర్గం. రాజూ, మతాధికారులూ, ఫ్యూడల్ ప్రభువులూ చేసే పనులు శ్రామిక వర్గాల మీద పెత్తనం చెయ్యడం! రాజు ఏర్పర్చిన పార్లమెంటులో, భూమి మీదేగాక వర్తక సరుకుల మీద లాభాలు తినే వర్తక భూస్వాములు ఎక్కువ సంఖ్యలో వున్నారు. (అప్పటి కొత్త రకం ప్రభువర్గం వాళ్ళే. వీళ్ళలో ముఖ్యుడు క్రాంవెల్ అనే పార్లమెంటు సభ్యుడు.) పెత్తనం అంతా రాజుదే. అందుకని, ఆ పెత్తనానికి వ్యతి రేకంగా, మెజారిటీగా వున్న రైతుల్నీ, చేతి వృత్తుల వారినీ కలుపుకొని, సరుకుల ద్వారా లాభాల్ని పొందే వర్తక భూస్వాములూ, పెట్టుబడి దారులూ, రాజుకి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించారు. ఎన్నో జరిగాక రాజుని ఓడించి, రాజుని బహిరంగంగా ఉరితీశారు. కానీ, రాజు లేనంత మాత్రాన ప్రజల సమస్యలు తీరతాయా? ప్రజల వైపు నించీ ఉద్యమాలు మొదలయ్యాయి. అలాంటి ఉద్యమాలలో, ‘లెవెలర్లు’ (సమానత్వవాదులు) నడిపిన ఉద్యమం ఒకటి. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభువర్గమూ, వర్తక భూస్వా ములూ, ప్రజల ఉద్యమాన్ని అణిచివేయడం మొదలు పెట్టారు. అంతేకాదు. ప్రజల ఉద్యమాన్ని మరింతగా అణచడానికి మళ్ళీ ఇంకో రాజుని (విలియం) తీసుకొచ్చి కూర్చోపెట్టారు. బ్రిటన్‌లో అధికారం అంతా, పెట్టుబడిదారులతో నిండిన పార్ల మెంటుదే అయినా, పేరుకి మాత్రం రాజే దేశాధినేత. అందుకే మార్క్స్, 1855లో, ‘బ్రిటన్ రాజ్యాంగం’ అనే వ్యాసంలో, ఆ రాజ్యాంగం అధికారికంగా (అధికారం అనే పేరుకి) పాలించే భూస్వామ్య ప్రభువులకూ (లాండెడ్ అరిస్టోక్రసీ), అసలు (యాక్చు వల్లీ) పాలించే బూర్జువా వర్గానికీ మధ్య, ఒక రాజీ– అని అంటాడు. రాజు అనేవాడు కూడా ఒక పెద్ద భూస్వామే. భూస్వామ్య వర్గానికి ప్రతినిధి కూడా. ఆ రాజుని ఒక పెద్ద దేవుణ్ణి చేసి పారేశారు. అందుకే, ఏంగెల్స్ ఇంగ్లండ్ గురించి 1844లో రాసిన ఒక వ్యాసంలో, రాజు పట్ల ఆరాధన పరమ అసహ్యకరంగా (డిస్గస్టింగ్ కల్ట్) ఉంది – అని అన్నాడు. ‘మతం’ అనేదానికి ‘దేవుడు’ ఎలాగైతే, అంతిమ రూపమో, రాజ్యాధికారానికి ‘రాజు’ అనేవాడు అంతిమ రూపంగా తయార య్యాడు– అని కూడా ఏంగెల్సు అన్నాడు. శ్రమలు చేసుకు బ్రతికే ప్రజలకు వర్గ చైతన్యం లేనప్పుడు, రాజుల్నీ, రాణుల్నీ, వాళ్ళ అట్టహాసపు ఆడంబరాల్నీ చూసి, నోర్లెళ్ళ బెడతారు. ఒక పక్క రాజో, రాణీయో ఉంటే, ఇంకో పక్క ‘ప్రజా స్వామ్యబద్ధంగా’ ప్రజలు ఓట్లువేసి పంపిన ‘ప్రజా ప్రతినిధులు’ ఉంటారు. ఆ రకంగా బ్రిటన్‌లో ఈనాడు కూడా ఉన్నది, రాజరికపు ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగాన్ని చూస్తే, రాజుతో పోల్చదగ్గ భారత రాష్ట్రపతి పార్లమెంటులో ప్రసంగించడానికి వచ్చేటప్పుడు, రాష్ట్రపతి అంగరక్షక దళంలో అన్నీ గుర్రాలే! అంతా పాత రాజరిక సంస్కృతే! రాష్ట్రపతి గుర్రపు బగ్గీలో కూచుని వుంటే, ఆ బగ్గీకి ముందూ, వెనకా, రెండు పక్కలా, ఎనభై ఆరు గుర్రాలూ, వాటిని నడిపే సైనికులూ వుంటారు. ఆ దృశ్యాల్ని చూస్తే జనానికి మతి పోతుంది. అంత రాజరిక ఆర్భాటం లేకపోతే, ఆ పదవి మీద జనాలకి లక్ష్యం వుండదని పాలకులకు భయం! శ్రామిక వర్గపు అమాయకత్వాలూ, అజ్ఞానాలూ ఇవన్నీ! ఈ శ్రామికవర్గం ఇలా వుంటే, ధనిక పాలకవర్గం అలా వుండదా? రంగనాయకమ్మ (వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి) -
కడసారి చూపులకు 13 గంటలు నిరీక్షించిన మాజీ కెప్టెన్
గతవారం ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్-2 కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాణి ఎలిజబెత్ పార్థివదేహం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంది. సోమవారం(సెప్టెంబర్ 19 వరకు) ఉదయం 6:30 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. కాగా 72 ఏళ్లు ఇంగ్లండ్‌ను పాలించిన ఎలిజబెత్‌ను కడసారి చూడడం కోసం జనాలు బారులు తీరారు. వారిలో ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హమ్ కూడా ఉన్నాడు. అయితే అతను కావాలనుకుంటే సెలబ్రిటీ హోదాలో రాణి ఎలిజబెత్‌ను వీఐపీ స్లాట్‌లో డైరెక్ట్‌గా చూడొచ్చు. కానీ బెక్‌హమ్ అలా చేయలేదు. ప్రొటోకాల్ పాటిస్తూ దాదపు 13 గంటల పాటు సామాన్యులతో కలసి క్యూ లైన్లో నిల్చున్న బెక్‌హమ్ శుక్రవారం సాయంత్రం క్వీన్ ఎలిజబెత్‌కు కడసారి నివాళి అర్పించాడు. బెక్‌హమ్ చర్యపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే విషయమై రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బెక్‌హమ్ మాట్లాడాడు. ''మనందరం కలిసి రాణి ఎలిజబెత్-2ను కడసారి చూడడానికి వచ్చాం.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవాలనుకున్నాం.. ఇలాంటి సమయంలో సెలబ్రిటీ హోదా కన్న ఒక మాములు వ్యక్తిగా చూద్దామనుకున్నా. అందుకే ప్రొటోకాల్ పాటిస్తూ 13 గంటల పాటు క్యూలైన్లో నిల్చొన్నా. ఇలా చేసినందుకు నాకు బాధ లేదు.. ఎందుకంటే మనం ఒకరిని కడసారి చూసేందుకు వెళుతున్నాం. అందుకే రాణి దర్శనం కోసం ఎన్ని గంటలైనా సరే నిరీక్షించాలని అనుకున్నా. చివరికి ఆమెకు కడసారి నివాళి అర్పించా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రాణి ఎలిజబెత్-2 శవపేటికను ఉంచిన వెస్ట్‌మినిస్టర్ హాల్ ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఇప్పటివరకు దాదాపు 750,000 మంది రాణి ఎలిజబెత్‌ను కడసారి చూడడానికి పోటెత్తారు. Absolute kudos to David Beckham who queued with other members of the public for 12 hours. pic.twitter.com/famWJIlNet — Dan Wootton (@danwootton) September 16, 2022 చదవండి: కొంప ముంచిన వికెట్ కీపర్ హెల్మెట్ -
ఇక బ్రిటన్ రాజు చార్లెస్
బల్మోరల్ క్యాజిల్: బ్రిటన్ రాజకుటుంబ నిబంధనల ప్రకారం... రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు/వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్ రాజు/రాణిగా మారిపోతారు. ఈ లెక్కన ఎలిజబెత్–2 రాణి వారసుడిగా మొదటి వరుసలో మొదటి స్థానంలో ఉన్న పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా మారినట్లే. అయితే, అధికారికంగా పగ్గాలు చేపట్టడానికి, పట్టాభిషేకానికి నిర్దేశిత లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని నెలలు లేదా మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎలిజబెత్–2 విషయానికొస్తే తండ్రి మరణంతో 1952 ఫిబ్రవరి 6న రాణిగా మారారు. 16 నెలల తర్వాత.. 1953 జూన్ 2న పట్టాభిషక్తురాలయ్యారు. రాణి మరణించాక 24 గంటల్లోపు కొత్త రాజు పేరును యాక్సెషన్ కౌన్సిల్ లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ నుంచి అధికారికంగా ప్రకటిస్తుంది. కొత్త రాజుకు విధేయత ప్రకటిస్తూ పార్లమెంట్ సభ్యులు ప్రమాణం చేస్తారు. ప్రైవీ కౌన్సిల్ ఎదుట నూతన రాజు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కొత్త రాజు పాలన మొదలైనట్లు యూకేలో పలుచోట్ల బహిరంగంగా ప్రకటిస్తారు. పట్టాభిషేక ప్రమాణ చట్టం–1689 ప్రకారం ప్రిన్స్ చార్లెస్ తన పట్టాభిషేక కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయాలి. ఇదీ చదవండి: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కన్నుమూత -
బ్రిటన్ మహారాణి కన్నుమూస్తే...!
-
రాణిగారి అరుదైన ఫొటోలు..తీసింది ఎవరంటే!
ఇంతవరకు వెలుగులోకి రాని క్వీన్ ఎలిజబెత్ ఫొటోలు ఇవి. ఒక నేరస్థుడు తీసినవి! తొలిసారి బయట పడినవి. క్వీన్ ఎలిజబెత్ సింహాసనం మీద కూర్చున్న నిలువెత్తు తైలవర్ణ చిత్రం గీయడానికి తనే స్వయంగా దగ్గరుండి మరీ ఆ నేరస్థుడు రాణిగారి ఫొటోలు తీయించాడు. అతడు చనిపోయాక అతడి గదిలో ఆ ఫొటోలు ఇప్పుడు బయటపడ్డాయి. కోటలోకి అతడికి ప్రవేశం ఎలా లభించింది? అతడు గీసిన రాణిగారి చిత్ర పటానికి ఎలాంటి గౌరవం లభించింది? కర్టిస్ హ్యూపర్ ఆర్టిస్టుగా మారిన స్టాక్ బ్రోకర్. క్రూరుడైన తండ్రి. బలవంతపు వసూళ్ల నేరస్థుడు. ఆమెరికన్. 1986లో పోలీసుల కన్నుకప్పి తప్పించుకుని తిరుగుతూ బ్రిటన్ బకింహ్యాప్ ప్యాలెస్ లో దూరాడు. పరారీలో ఉన్న నేరస్థుడు కనుక ‘దూరాడు’ అనొచ్చు. అయితే ఆనాడు అతడు ఆర్టిస్టుగా అనుమతి పొంది రాణిసౌధంలోకి ప్రవేశించాడు. పెద్ద పోర్ట్రయిట్గా క్వీన్ ఎలిజబెత్ తైలవర్ణ చిత్రాన్ని గీయడానికి ‘ఫొటో షూట్’ చేశాడు. అతడు ఆ ఫొటోలు తీసినట్లు.. వాటిని చూస్తూ సింహాసనం మీద ఉన్నట్లుగా రాణిగారి చిత్ర పటాన్ని గీసినట్లు ఆయనకు, బ్రిటన్ ప్యాలెస్‌కు, బెర్ముడాలోని హామిల్టన్ సిటీ హాల్ నిర్వాహకులకు తప్ప తక్కిన ప్రపంచానికి తెలియదు. గత ఏడాది తన 75 ఏళ్ల వయసులో కర్టిస్ హూపర్ చనిపోయాడు. రాణిగారి బొమ్మ గీస్తున్న కర్టిస్ హ్యూపర్ (1986) రాణిగారి చిత్రాన్ని పెయింట్ చేసినందుకు అతడికి లభించిన మొత్తం ఇప్పటి విలువలో కోటీ ఎనభై లక్షల రూపాయలు! ఆ డబ్బు ఏమైందో తెలియదు. ముప్పై నాలుగేళ్లలో ఖర్చయిపోకుండా ఉంటుందా? తండ్రి ఎంత క్రూరుడైనా కావచ్చు. అతడు చనిపోయినప్పుడు బిడ్డలకు ఆ క్రూరత్వం గుర్తుకు రాదు. జేసన్‌కి కూడా కూడా గుర్తు రాలేదు. అతడికి ఇప్పుడు యాభై ఏళ్లు. ఫ్లోరిడా లో ఉంటున్నాడు. తండ్రి మరణించినప్పుడు కన్నీరు మున్నీరయ్యాడు. ఏడాది గడిచింది. తండ్రి జ్ఞాపకాల కోసం ఫ్లోరిడాలోని ఆయన గదిని తడుముతున్నప్పుడు జేసన్‌కు రాణిగారి పోర్ట్రయిట్ కోసం తీసిన కొన్ని ఫొటోలు, వాటిని చూస్తూ వేసినట్లుగా ఒక తైలవర్ణ చిత్రం కనిపించింది. ఆ ఫొటోలు క్వీన్ ఎలిజబెత్వి. క్వీన్ ముఖం, క్వీన్ చేతులు, క్వీన్ నడుము పైభాగం, క్వీన్ సైడ్ యాంగిల్స్, క్వీన్ సింహాసనం.. వాటన్నిటినీ వేర్వేరుగా తీసి ఉన్న ఫొటోలు అవి. చిత్రాన్ని గీస్తున్నప్పుడు అవసరమయ్యే సూక్ష్మ వివరాల కోసం క్లోజ్ అప్‌లో తీసుకున్న క్వీన్ కలర్ ఫొటోలు అవన్నీ. వాటితోపాటు ఒక చేతిగుడ్డ. ఆ గుడ్డపై రాణిగారు అద్దిన పెదవులు! పెయింటింగ్‌లో పెదవులకు రంగు కోసం రాణి గారి నుంచి ఆ ముద్దు వస్త్రాన్ని తీసుకున్నట్లున్నాడు తన తండ్రి. జేసన్ ఆశ్చర్యపోయాడు. క్వీన్ వ్యక్తిగత కార్యదర్శి రాబర్ట్ ఫెల్లోస్ నుంచి, బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ కూతురు శారా నుంచి తన తండ్రికి వచ్చిన కొన్ని టెలిగ్రామ్‌లు కూడా ఆ గదిలో జేసన్‌ను ఆశ్చర్యపరిచాయి. తన తండ్రి ఎంత గొప్పవాడు అనుకున్నాడు. అప్పటి వరకు అతడికి తెలిసింది తన తండ్రిలోని స్టాక్ బ్రోకరు, నేరస్థుడే. ఈ ఫొటోలన్నీ బయటికి తీసి, లండన్‌లోని డెయిలీ మెయిల్ టీవీ ప్రతినిధిని పిలిపించి విషయాన్ని వెల్లడించాడు జేసన్. ఇప్పటి వరకు ఈ ఫొటోలను ప్రపంచం చూడలేదు. పోర్ట్రయిట్ మాత్రం బ్రిటన్ భూభాగం అయిన బెర్ముడాలోని హామిల్టన్ సిటీ హాల్లో ఉంది. అక్కడ తగిలించడం కోసం రాబర్ట్ ఫెల్లోస్ హూపర్ చేత వేయించిన చిత్రమే అది. రాణిగారు సింహాసనం మీద కూర్చున్న ఆ పెయింటింగ్ హామిల్టన్ సిటీ హాల్ లో ఉంటే, ఆ చిత్రానికి ఆధారం అయిన రాణిగారి ఫొటోలు ఫ్లోరిడాలో హూపర్ గదిలో బయటపడ్డాయి. హూపర్కి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన కూడా గత ఏడాది మరణించారు. హూపర్ రాణిగారితో కలిసి భోజనం చేసేవారని, రాణిగారి పెయింటింగ్‌ను వేసి ఇచ్చాక, మరో పెయింటింగ్ వేసేందుకు 2018 లో హూపర్కు ఆఫర్ వచ్చిందని ఆ స్నేహితుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హూపర్లోని మహా చిత్రకారుడిని కొద్దిసేపు పక్కన పెడితే.. సొంత కొడుకునే (జే సన్) కిడ్నాప్ చేసి తన రెండో భార్య దగ్గర ఉంచి, మొదటి భార్య నుంచి డబ్బును గుంజేవాడని అతడి గురించి డైలీ మెయిల్ ప్రతినిధి జోష్ బోస్వెల్ కొంత సమాచారాన్ని రాబట్టారు. రెండేళ్ల తర్వాత పోలీసుల చిన్నారి జేసన్‌ను తండ్రి హూపర్ చెర నుంచి విడిపించి అసలు తల్లి దగ్గర కు చేర్చారు. ఆ తర్వాత కూడా కొడుకు పెంపకం కోసం అతడు డబ్బేమీ పంపలేదని అతడిపై ఫిర్యాదుఉంది. సమాజంలోని కొందరు సుప్రసిద్ధులైన వారి భార్యలను తన తండ్రి ప్రేమ పేరు తో మోసం చేసి, వారి భర్తల దగ్గర్నుంచి డబ్బును ఆశించేవాడని కూడా జేసన్ ఇప్పుడే ఫొటోలతో పాటు బయటపెట్టాడు. తనకు పిల్లలు లేరని తన స్నేహితులతో చెప్పేవారట హూపర్! జేసన్‌తో పాటు అతడికి ఒక కూతురు కూడా ఉంది. ఆమె చనిపోతే అంత్యక్రియలకు కూడా హూపర్ వెళ్లలేదట! జేసన్‌కి ఇప్పటికీ అర్థం కాని విషయం ఒక్కటే. తన తండ్రికి బకింVŠ హామ్ ప్యాలెస్‌లోకి అసలు చోటు ఎలా లభించిందన్నది! రాబెర్ట్ ఫెల్లోస్ను బయట ఎక్కడో పరిచయం అయినట్లున్నాడు హూపర్. అది చాలదా! అయితే రాణిగారి పెయింటింగ్స్ వేసేటప్పటికి అతడిపై అరెస్ట్ వారెంట్ ఉన్నట్లు ప్యాలెస్ అధికారులకు తెలియకుండా ఉందా అన్నది సమాధానం లేని ప్రశ్న. -
ప్రిన్స్ హ్యారీ మళ్లీ రాచ విధుల్లోకి రారు
లండన్: ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మెఘన్ మార్కెల్ బ్రిటన్ రాజ కుటుంబంలోకి క్రియాశీల సభ్యులుగా తిరిగి రారని బకింగ్ హామ్ ప్యాలెస్ శుక్రవారం ప్రకటించింది. హ్యారీ నానమ్మ, రాణి ఎలిజబెత్–2(94) తరఫున విడుదల చేసిన ఆ ప్రకటనలో..‘డ్యూక్ ఆఫ్ సస్సెక్స్ ప్రిన్స్ హ్యారీ(36), ఆయన భార్య డచెస్ ఆఫ్ సస్సెక్స్ మెఘన్ మార్కెల్(39) ఏడాదిలోగా తిరిగి క్రియాశీల విధుల్లోకి చేరతామంటూ చేసిన ప్రకటన గడువు పూర్తి కావస్తోంది. దీంతో నిర్ణయం తెలపాల్సిందిగా రాణి వారికి లేఖ రాశారు. తాము తిరిగి రామంటూ హ్యారీ దంపతులు సమాధానం ఇచ్చారు. దీంతో ఆ విధులన్నీ తిరిగి రాణికే దఖలు పడ్డాయి. వాటిని ఆమె కుటుంబంలోని ఇతరులు తిరిగి పంపిణీ చేయనున్నారు’అని ఆమె వివరించింది. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా రాజకుటుంబం క్రియాశీలక విధుల నుంచి వైదొలుగుతున్న ప్రిన్స్ హ్యారీ దంపతులు గత ఏడాది మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిప్పుడు అమెరికాలో నివాసం ఉంటున్నారు. -
అత్తమ్మకు చెబుతా..
సాక్షి, హైదరాబాద్ : క్వీన్ ఎలిజబెత్–2 చిన్న కోడలు, రాయల్ హైనెస్ కౌంటీస్ ఆఫ్ వెసెక్స్, డైమండ్ జూబ్లీ ట్రస్ట్ వైస్ ప్యాట్రన్ సోఫీ హెలెన్ రిస్ జోన్స్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం నగరానికి వచ్చారు. తొలిరోజు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థను సందర్శించారు. ఉదయం గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఆమె... అత్త క్వీన్ ఎలిజబెత్–2 నాటిన మొక్కను చూడాలని ఆసక్తి చూపినప్పటికీ ప్రొటోకాల్ అడ్డంకిగా మారడం, సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తుతాయని భావించి విరమించుకున్నారు. అయితే మొక్క చిగురించిన విషయం అత్తమ్మకు చెబుతానంటూ హర్షం వ్యక్తం చేశారు. 1983లో ఎలిజబెత్–2 పాత గాంధీ ఆస్పత్రిలో మొక్కను నాటడం, తర్వాత అది మోడుబారిపోవడం, సోఫీ హెలెన్ ఆస్పత్రిని సందర్శించనున్న తరుణంలో మరోసారి చిగురించడంపై ‘అత్త.. కోడలు.. ఓ మొక్క’ శీర్షికతో ‘సాక్షి’ ఆదివారం కథనం ప్రచురించిన విషయం విదితమే. ఈ క్లిప్పింగ్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ సోఫీ హెలెన్‌కు చూపించి వివరించారు. తెలుగు అర్థం కాకపోయినప్పటికీ ఫొటోలను ఆమె ఆసక్తిగా తిలకించారు. ‘ఓహ్... ఐ విల్ టెల్ టు మై ఆంటీ’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిలో పిల్లలతో పాటు మొక్కలనూ అపురూపంగా చూసుకుంటున్నారని కితాబు ఇచ్చారు. అత్తమ్మ నాటిన మొక్కను చూడాలని ఉన్నప్పటికీ ప్రొటోకాల్ సమస్యతో చూడలేకపోతున్నానని సోఫీ హెలెన్ ఆవేదన వ్యక్తం చేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. ‘సాక్షి’ పేపర్ క్లిప్పింగ్‌ను బ్రిటీష్ అధికారులతో పాటు పోలీసులు ఆసక్తిగా చూశారు. సాక్షి’ క్లిప్పింగ్‌ను చూస్తున్న అధికారులు సేవలు భేష్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం నగరానికి వచ్చిన సోఫీ హెలెన్ గాంధీ ఆస్పత్రి, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థను సందర్శించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘గాంధీ’లో చిన్నారుల విభాగంలో అందిస్తున్న రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ సేవలను పరిశీలించారు. ఉదయం 10:45 గంటలకు ఆస్పత్రికి వచ్చిన ఆమెకు సూపరింటెండెంట్ పి.శ్రవణ్‌కుమార్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఒ.శ్రవణ్‌కుమార్ స్వాగతం పలికారు. ఆమెను నేరుగా చిన్నారుల విభాగంలోని ఎన్ఐసీయూ, పీఐసీయూ వార్డులకు తీసుకెళ్లి అక్కడ అందిస్తున్న సేవలను వివరించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య సేవలు పొందుతున్న శిశువుల బుగ్గలను ఆప్యాయంగా నిమిరిన సోఫీ ఆనందపారవశ్యానికి లోనయ్యారు. అనంతరం చిన్నారుల తల్లులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. సోఫీ హెలెన్‌కు స్వాగతం పలుకుతున్న ‘గాంధీ’ అధికారులు దాదాపు గంటసేపు ఆయా వార్డులను పరిశీలించిన ఆమె వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ... క్వీన్ ఎలిజబెత్ డైమండ్ జూబ్లీ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నాలుగేళ్లలో ఆస్పత్రిలో దాదాపు 4,500 మందికి రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ (ఆర్ఓపీ) సేవలు అందించామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 350 మందికి ఈ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. కోట్లాది రూపాయల విలువైన 20 సీప్యాప్ వెంటిలేటర్లు, రెండు లేజర్ మెషిన్లను ట్రస్ట్ ద్వారా అందించారని, ఆర్ఓపీ వైద్యసేవలు, లేజర్ శస్త్ర చికిత్సలపై లండన్ వైద్యులు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారని, ఈ శిక్షణ ఎంతో ఉపయుక్తమైనదని పేర్కొన్నారు. ఆస్పత్రిలో అందిస్తున్న సేవలపై ట్రస్ట్ వైస్ ప్యాట్రన్ సోఫీ హెలెన్ సంతృప్తి వ్యక్తం చేశారని, పాలనా యంత్రాంగం, వైద్యులు, సిబ్బందిని అభినందించారని తెలిపారు. ఎన్ఐసీయూ ఇన్చార్జి ప్రొఫెసర్ జార్జ్, డిప్యూటీ సూపరింటెండెంట్ నర్సింహా రావు, బ్రిటీష్ హైకమిషనరేట్ అధికారులు పాల్గొన్నారు. అయితే సోఫీ సందర్శనకు సంబంధించి మీడియాకు ఆంక్షలు విధించారు. సోఫీ మంగళవారం నిలోఫర్ ఆస్పత్రిని సందర్శించే అవకాశం ఉంది. ఎల్వీ ప్రసాద్లో... బంజారాహిల్స్: ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ కార్యక్రమాలకు డైమండ్ జూబ్లీ ట్రస్ట్ మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో సోఫీ సోమవారం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిని సందర్శించారు. 1998లో కళ్లం అంజిరెడ్డి ప్రాంగణంలో ఆధునిక ఆర్ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో డాక్టర్ సుభద్ర జలాలి ముఖ్య భూమిక పోషించారు. గత 20 ఏళ్లుగా ఆస్పత్రి బృందం 20వేల పైచిలుకు శిశువులకు పరీక్ష చేసింది. ఐదేళ్లుగా డైమండ్ జూబ్లీ ట్రస్ట్ ఇక్కడి ఆర్ఓపీ కార్యక్రమాలకు మద్దతు ఇస్తోంది. ఈ సందర్భంగా సోఫీ ఆస్పత్రి పీడీయాట్రిక్ ఆర్ఓపీ బృందాలతో చర్చించింది. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘అత్త’ మొక్కకు అలంకరణ
గాంధీఆస్పత్రి: అత్త నాటిన మొక్కను కోడలుకు చూపించేందుకు గాంధీ ఆస్పత్రి యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 1983లో బ్రిటన్ రాణిఎలిజబెత్–2 పాత గాంధీ ఆస్పత్రిలో మొక్కను నాటడం, తర్వాత అది మోడుబారిపోవడం... ఆమె చిన్న కోడలు సోఫీ హెలెన్ సోమవారం ఆస్పత్రిని సందర్శించనున్న తరుణంలో మరోసారి చిగురించడంపై ‘అత్త.. కోడలు.. ఓ మొక్క’ శీర్షికతో ‘సాక్షి’ ఆదివారం కథనం ప్రచురించింది. దీనికి విశేష స్పందన లభించింది. ఈ మొక్కను చూసేందుకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, రోగుల సహాయకులు పెద్ద ఎత్తున రావడంతో గాంధీ మెడికల్ కళాశాల ప్రాంగణంలో సందడి నెలకొంది. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ పి.శ్రవణ్‌కుమార్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఒ.శ్రవణ్‌కుమార్ ఆదేశాల మేరకు రాణి నాటిన ‘సైకస్’ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. కంచె, క్వీన్ఎలిజబెత్ నాటిన మొక్క అని పేర్కొంటూ బోర్డును ఏర్పాటు చేశారు. క్వీన్ ఎలిజబెత్ డైమండ్ జూబ్లీ ట్రస్ట్ వైస్ ప్యాట్రన్, కౌంటీస్ ఆఫ్ వెసెక్స్ సోఫీ హెలెన్ సోమవారం ఉదయం 11గంటలకు గాంధీ ఆస్పత్రికి వస్తారు. దాదాపు గంటపాటు చిన్న పిల్లల విభాగంలోని ఎన్ఐసీయూ, రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ సేవలను పరిశీలిస్తారు. ఈ ఏడాది చివరిలో ట్రస్ట్‌ను రద్దు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆమె మళ్లీ ఇక్కడికి వచ్చే అవకాశం లేదని భావించిన వైద్యాధికారులు... ఆమె తిరిగి వెళ్లే సమయంలో అత్త క్వీన్ ఎలిజబెత్–2 నాటిన మొక్కను చూపించాలనే పట్టుదలతో ఉన్నారు. ‘సాక్షి’ ప్రచురించిన కథనాన్ని అందంగా అలంకరించి ఆమెకు బహుమతిగా అందజేస్తామని వైద్యాధికారి ఒకరు తెలిపారు. పాత గాంధీ ఆస్పత్రి నుంచి మొక్కను ఇక్కడికి తీసుకొచ్చిన అప్పటి ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏవై చారి మాట్లాడుతూ... పదవీ విరమణ తర్వాత గాంధీ ప్రాంగణానికి ఎప్పుడు వెళ్లినా రాణి నాటిన మొక్క ఎలా ఉందోననే ఆసక్తితో ఓ లుక్కేస్తానని వివరించారు. సోఫీ హెలెన్‌ను కలిసేందుకు సెక్యూరిటీ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం (అలూమ్నీ అసోషియేషన్) ప్రతినిధులు తెలిపారు. -
రాణి విందుకు ఒబామా
లండన్: పదవి కాలం ముగుస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రథమ మహిళ మిషెల్లీ చరిత్రలో గుర్తుండిపోయే పర్యటనలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న క్యూబా వెళ్లిన ఆ జంట ఇప్పుడు బ్రిటన్‌లో అడుగుపెడుతున్నారు. విండ్సర్ భవనంలో బ్రిటన్ రాణి ఇచ్చే గౌరవ విందును స్వీకరించనున్నారు. ఆ తర్వాత బ్రిటన్ యువరాజు విలియమ్, యువరాణి కేథరిన్‌లను కలవనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ప్రకటించింది. ఈ వారంలో బ్రిటన్ పర్యటనకు అధ్యక్షుడు ఒబామా, మిషెల్లీ వెళుతున్నారు. శుక్రవారం జరిగే ఆమె 90వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కెన్సింగ్టన్ ప్యాలెస్ లో రాజు, రాణిలను ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్యాలెస్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేస్తూ వారి రాక కోసం తాము ఎంతో ఎదురుచూస్తున్నామని తెలిపారు. వారు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా అతిథి సేవలు చేయాలనుకుంటున్నామని ప్రకటించారు.