పూర్తయిన క్వీన్ చిత్రపటం నమూనా. అసలు చిత్రం బెర్ముడాలోని హామిల్టన్ సిటీ హాల్‌లో ఉంది.
ఇంతవరకు వెలుగులోకి రాని క్వీన్ ఎలిజబెత్ ఫొటోలు ఇవి. ఒక నేరస్థుడు తీసినవి! తొలిసారి బయట పడినవి. క్వీన్ ఎలిజబెత్ సింహాసనం మీద కూర్చున్న నిలువెత్తు తైలవర్ణ చిత్రం గీయడానికి తనే స్వయంగా దగ్గరుండి మరీ ఆ నేరస్థుడు రాణిగారి ఫొటోలు తీయించాడు. అతడు చనిపోయాక అతడి గదిలో ఆ ఫొటోలు ఇప్పుడు బయటపడ్డాయి. కోటలోకి అతడికి ప్రవేశం ఎలా లభించింది? అతడు గీసిన రాణిగారి చిత్ర పటానికి ఎలాంటి గౌరవం లభించింది? కర్టిస్ హ్యూపర్ ఆర్టిస్టుగా మారిన స్టాక్ బ్రోకర్.
క్రూరుడైన తండ్రి. బలవంతపు వసూళ్ల నేరస్థుడు. ఆమెరికన్. 1986లో పోలీసుల కన్నుకప్పి తప్పించుకుని తిరుగుతూ బ్రిటన్ బకింహ్యాప్ ప్యాలెస్ లో దూరాడు. పరారీలో ఉన్న నేరస్థుడు కనుక ‘దూరాడు’ అనొచ్చు. అయితే ఆనాడు అతడు ఆర్టిస్టుగా అనుమతి పొంది రాణిసౌధంలోకి ప్రవేశించాడు. పెద్ద పోర్ట్రయిట్‌గా క్వీన్ ఎలిజబెత్ తైలవర్ణ చిత్రాన్ని గీయడానికి ‘ఫొటో షూట్’ చేశాడు. అతడు ఆ ఫొటోలు తీసినట్లు.. వాటిని చూస్తూ సింహాసనం మీద ఉన్నట్లుగా రాణిగారి చిత్ర పటాన్ని గీసినట్లు ఆయనకు, బ్రిటన్ ప్యాలెస్‌కు, బెర్ముడాలోని హామిల్టన్ సిటీ హాల్ నిర్వాహకులకు తప్ప తక్కిన ప్రపంచానికి తెలియదు. గత ఏడాది తన 75 ఏళ్ల వయసులో కర్టిస్ హూపర్ చనిపోయాడు.
రాణిగారి బొమ్మ గీస్తున్న కర్టిస్ హ్యూపర్ (1986)
రాణిగారి చిత్రాన్ని పెయింట్ చేసినందుకు అతడికి లభించిన మొత్తం ఇప్పటి విలువలో కోటీ ఎనభై లక్షల రూపాయలు! ఆ డబ్బు ఏమైందో తెలియదు. ముప్పై నాలుగేళ్లలో ఖర్చయిపోకుండా ఉంటుందా? తండ్రి ఎంత క్రూరుడైనా కావచ్చు. అతడు చనిపోయినప్పుడు బిడ్డలకు ఆ క్రూరత్వం గుర్తుకు రాదు. జేసన్‌కి కూడా కూడా గుర్తు రాలేదు. అతడికి ఇప్పుడు యాభై ఏళ్లు. ఫ్లోరిడా లో ఉంటున్నాడు. తండ్రి మరణించినప్పుడు కన్నీరు మున్నీరయ్యాడు. ఏడాది గడిచింది.
తండ్రి జ్ఞాపకాల కోసం ఫ్లోరిడాలోని ఆయన గదిని తడుముతున్నప్పుడు జేసన్‌కు రాణిగారి పోర్ట్రయిట్ కోసం తీసిన కొన్ని ఫొటోలు, వాటిని చూస్తూ వేసినట్లుగా ఒక తైలవర్ణ చిత్రం కనిపించింది. ఆ ఫొటోలు క్వీన్ ఎలిజబెత్‌వి. క్వీన్ ముఖం, క్వీన్ చేతులు, క్వీన్ నడుము పైభాగం, క్వీన్ సైడ్ యాంగిల్స్, క్వీన్ సింహాసనం.. వాటన్నిటినీ వేర్వేరుగా తీసి ఉన్న ఫొటోలు అవి. చిత్రాన్ని గీస్తున్నప్పుడు అవసరమయ్యే సూక్ష్మ వివరాల కోసం క్లోజ్ అప్‌లో తీసుకున్న క్వీన్ కలర్ ఫొటోలు అవన్నీ.
వాటితోపాటు ఒక చేతిగుడ్డ. ఆ గుడ్డపై రాణిగారు అద్దిన పెదవులు! పెయింటింగ్‌లో పెదవులకు రంగు కోసం రాణి గారి నుంచి ఆ ముద్దు వస్త్రాన్ని తీసుకున్నట్లున్నాడు తన తండ్రి. జేసన్ ఆశ్చర్యపోయాడు. క్వీన్ వ్యక్తిగత కార్యదర్శి రాబర్ట్ ఫెల్లోస్ నుంచి, బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ కూతురు శారా నుంచి తన తండ్రికి వచ్చిన కొన్ని టెలిగ్రామ్‌లు కూడా ఆ గదిలో జేసన్‌ను ఆశ్చర్యపరిచాయి. తన తండ్రి ఎంత గొప్పవాడు అనుకున్నాడు.
అప్పటి వరకు అతడికి తెలిసింది తన తండ్రిలోని స్టాక్ బ్రోకరు, నేరస్థుడే. ఈ ఫొటోలన్నీ బయటికి తీసి, లండన్‌లోని డెయిలీ మెయిల్ టీవీ ప్రతినిధిని పిలిపించి విషయాన్ని వెల్లడించాడు జేసన్. ఇప్పటి వరకు ఈ ఫొటోలను ప్రపంచం చూడలేదు. పోర్ట్రయిట్ మాత్రం బ్రిటన్ భూభాగం అయిన బెర్ముడాలోని హామిల్టన్ సిటీ హాల్‌లో ఉంది. అక్కడ తగిలించడం కోసం రాబర్ట్ ఫెల్లోస్ హూపర్ చేత వేయించిన చిత్రమే అది. రాణిగారు సింహాసనం మీద కూర్చున్న ఆ పెయింటింగ్ హామిల్టన్ సిటీ హాల్ లో ఉంటే, ఆ చిత్రానికి ఆధారం అయిన రాణిగారి ఫొటోలు ఫ్లోరిడాలో హూపర్ గదిలో బయటపడ్డాయి.
హూపర్‌కి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన కూడా గత ఏడాది మరణించారు. హూపర్ రాణిగారితో కలిసి భోజనం చేసేవారని, రాణిగారి పెయింటింగ్‌ను వేసి ఇచ్చాక, మరో పెయింటింగ్ వేసేందుకు 2018 లో హూపర్‌కు ఆఫర్ వచ్చిందని ఆ స్నేహితుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హూపర్‌లోని మహా చిత్రకారుడిని కొద్దిసేపు పక్కన పెడితే.. సొంత కొడుకునే (జే సన్) కిడ్నాప్ చేసి తన రెండో భార్య దగ్గర ఉంచి, మొదటి భార్య నుంచి డబ్బును గుంజేవాడని అతడి గురించి డైలీ మెయిల్ ప్రతినిధి జోష్ బోస్వెల్ కొంత సమాచారాన్ని రాబట్టారు.
రెండేళ్ల తర్వాత పోలీసుల చిన్నారి జేసన్‌ను తండ్రి హూపర్ చెర నుంచి విడిపించి అసలు తల్లి దగ్గర కు చేర్చారు. ఆ తర్వాత కూడా కొడుకు పెంపకం కోసం అతడు డబ్బేమీ పంపలేదని అతడిపై ఫిర్యాదుఉంది. సమాజంలోని కొందరు సుప్రసిద్ధులైన వారి భార్యలను తన తండ్రి ప్రేమ పేరు తో మోసం చేసి, వారి భర్తల దగ్గర్నుంచి డబ్బును ఆశించేవాడని కూడా జేసన్ ఇప్పుడే ఫొటోలతో పాటు బయటపెట్టాడు. తనకు పిల్లలు లేరని తన స్నేహితులతో చెప్పేవారట హూపర్! జేసన్‌తో పాటు అతడికి ఒక కూతురు కూడా ఉంది.
ఆమె చనిపోతే అంత్యక్రియలకు కూడా హూపర్ వెళ్లలేదట! జేసన్‌కి ఇప్పటికీ అర్థం కాని విషయం ఒక్కటే. తన తండ్రికి బకింVŠ హామ్ ప్యాలెస్‌లోకి అసలు చోటు ఎలా లభించిందన్నది! రాబెర్ట్ ఫెల్లోస్‌ను బయట ఎక్కడో పరిచయం అయినట్లున్నాడు హూపర్. అది చాలదా! అయితే రాణిగారి పెయింటింగ్స్ వేసేటప్పటికి అతడిపై అరెస్ట్ వారెంట్ ఉన్నట్లు ప్యాలెస్ అధికారులకు తెలియకుండా ఉందా అన్నది సమాధానం లేని ప్రశ్న.
Comments
Please login to add a commentAdd a comment