మలుపులు తిరుగుతున్న మున్నా కేసు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నరహంతకుడు మున్నాభాయ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసుతో ఇద్దరు రాజకీయ నాయకులు, నలుగురు ప్రభుత్వాధికారులకు సంబంధాలున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపించిన మున్నాభాయ్ అనేక మందిని వలలో వేసుకున్నాడు.
డబ్బుకు ఆశపడి మున్నాకు సహకరించిన వారిలో అనేక మంది రాజకీయ నాయకులు, అధికారులు, ఇతర ప్రముఖులు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అత్యంత గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి వివరాలూ బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈ కేసుతో సంబంధం ఉన్న నె ల్లూరు డీఎంహెచ్‌వో సుధాకర్‌ను అరెస్ట్ చేసి వారంరోజుల తర్వాతగానీ వెల్లడించలేదు.
డీఎంహెచ్‌వోతో పాటు మరో నలుగురు ప్రభుత్వ అధికారులు, ఇద్దరు రాజకీయ నాయకులకు మున్నాతో ప్రత్యక్ష సంబంధాలున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. వారిలో ఇద్దరు అధికారులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మిగిలిన ఇద్దరు అధికారులు, ఇద్దరు రాజకీయ నాయకులను కూడా విచారిస్తున్నట్లు సమాచారం. అయితే వారి పేర్లు ఏమాత్రం బయటకు రాకుండా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
రంగంలోకి చెన్నై పోలీసులు...
మున్నా కేసు విచారణకు చెన్నై నుంచి ‘క్యూ’ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలిసింది. వీరు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఐఎస్ఐ తీవ్రవాదులతో కలిసి మున్నాభాయ్ బెంగళూరులో గడిపినట్లు సమాచారం. ఆ సమయంలో నెల్లూరు డీఎంహెచ్‌వో సుధాకర్, ఇతర అధికారులు అనేకసార్లు బెంగళూరు వెళ్లి మున్నా బృందంతో కలిసి విలాసాలతో ఆనందంగా గడిపినట్లు తెలిసింది. అక్కడ మున్నాతో పాటు ఐఎస్ఐ వర్గాలకు కూడా నెల్లూరు డీఎంహెచ్‌వో సుధాకర్ మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం.
మున్నాకు డబ్బు చేరకపోతే సుధాకరే పలువురితో మాట్లాడి సెటిల్ చేసినట్లు పోలీసుల వద్ద ఆధారాలున్నాయి. మున్నా బ్యాంకు ఖాతాతో ఎక్కువ లావాదేవీలు నడిపిన వారిలో సుధాకర్ ఒకడిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే సుధాకర్‌ను పూర్తిస్థాయిలో విచారించిన పోలీసులు.. అతని ద్వారా అనేక విషయాలు తెలుసుకుని మిగిలిన వారిపై కూడా దృష్టి సారించారు.
సుధాకర్ గతంలో చిత్తూరు జిల్లాలో కూడా పనిచేసినందున అక్కడి వారితో కూడా ఈ కేసుతో సంబంధాలుండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, బెంగళూరు పోలీసులు కూడా ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. మూడు రాష్ట్రాల పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో మున్నాభాయ్ కేసు ఇంకా అనేక మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.