శ్రీశైలాలయ పనులు వివాదాస్పదం
శ్రీశైలం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో చేపడుతున్న అభివృద్ధి పనులు వివాదాస్పదమయ్యాయి. ఈ పనులపై గురువారం రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బృహత్తర ప్రణాళికలో భాగంగా రూ.600 కోట్లతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, షాపింగ్ కాంప్లెక్స్, క్యూకాంప్లెక్స్, డార్మెటరీ, కల్యాణమండపం, పుష్కరిణి నిర్మించాలని భావించారు. ఇందులో అతి ముఖ్యమైనది రూ.49 కోట్లతో చేపట్టిన నీటిశుద్ధి, భూగర్భ నీటివ్యవస్థ.
మరో రూ.25 కోట్లతో సిద్ధిరామప్ప వాణిజ్య సముదాయం, రూ.14 కోట్లతో డార్మెటరీల నిర్మాణం, రూ.7 కోట్లతో స్నానఘట్టాలు, రూ.3.50 కోట్లతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, చంద్రావతి కళ్యాణ మండపం పనులు చేస్తున్నారు. ఈ పనులన్నీ ఏడాదిన్నరగా కొనసా..గుతూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాణ్యత లోపంతో జరుగుతున్నాయనే విమర్శలున్నాయి.
విధ్వంసం..అభివృద్ధి ఏకకాలంలో చూపించిన ఈఓ ఆజాద్..
శ్రీశైలాలయప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో ఈఓ చంద్రశేఖర ఆజాద్ చేపట్టిన అభివృద్ధి పనులు చేపట్టారు. అదే సమయంలో అతి ప్రాచీన, పురాతన కట్టడాలను నేలమట్టం చేసి విధ్వంసం సృష్టించారనే విమర్శలను ఎదుర్కొన్నారు. ఆలయప్రాంగణంలో ఈశాన్యదిశగా భారీ ఎత్తున తవ్వకాలను చేపట్టి, అదేస్థానంలో తిరిగి నూతన కట్టడాలను నిర్మించారు. సాలుమండపాల్లో కొంత భాగాన్ని తొలగించి తిరిగి కొత్తగా కోటగోడ దక్షిణ వాయువ్యంలో నిర్మించడంపై భక్తులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
పంచభుతాల ప్రతిష్ఠిత ఆలయాల పక్కనే ఉన్న మండ పాన్ని తొలగించి మెట్ల మార్గాన్ని అదనంగా పొడగించడం స్థానికులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అదే విధంగా అభివృద్ధి పేరున సుమారు పాతిక అడుగుల మేర ఎత్తున గాల్వలం షీట్లతో విశాలమైన షెడ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా ఆలయప్రాంగణం శోభను కొల్పోయిందని, పురాతన ఆనవాళ్లన్నీ నాశనం చేశారని పండితులు కొందరు మండిపడుతున్నారు.
భక్తుల మనోభావాలకు భంగం...
మల్లన్న లింగ స్వరూపం అరిగిపోతుందనే కారణం చూపిస్తూ సువర్ణకవచం ఏర్పాటు చేయాలనే ఆలోచనను వీరశైవ భక్తులు, పండితులు వ్యతిరేకించారు. దీనిపై అనేక విమర్శలు రావటంతో ఆ ప్రయత్నాన్ని నిలిపివేసి చివరకు లింగంచుట్టూ గాడి ఏర్పందని, దాన్ని పూడ్చివేసి మూలికలు, రసాయనాలు, పాషాణాలతో అష్టబంధనంచేయాలని సంకల్పించారు.
ఇందుకు జగద్గురు పీఠాధిపతి, శృంగేరి పీఠాధిపతి, విశాఖ శారదా పీఠాధిపతితో పాటు పలువురు పీఠాధిపతులు అనుమతి పత్రాలు అందజేశారని ఈఓ పేర్కొంటున్నారు. అయితే ఇప్పటి వరకు స్వామిజీలు, పీఠాధిపతులు ఇచ్చిన అనుమతి పత్రాలను బయటపెట్టిన దాఖలాలు లేకపోవటం గమనార్హం. మల్లన్న అష్టబంధన కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా భక్తుల నుంచి నిరసనలు వెల్లువెత్తటం, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గత నెల జూన్ 9న జరగాల్సిన అష్టబంధన కార్యక్రమం, పరివార ఆలయాలపై కలశస్థాపన, స్వామివార్ల గర్భాలయం కుంబాభిషేకం పనులు నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు.
రాష్ట్ర దేవాదాయ కమిషనర్ ఎక్కడి పనులు అక్కడ నిలిపివేసి యధాస్థితిని కొనసాగించాల్సిందిగా‘ కెప్ట్ అబయన్స్’ ఉత్తర్వులు ఈఓకు జారీచేశారు. ఓ వైపు పురాతన కట్టడాలను తొలగిస్తూనే మరోవైపు ఆలయ ప్రాంగణంలోని కట్టడాలలో సహజత్వాన్ని తీసుకురావడానికి రాతి నిర్మాణాలపై ఏర్పాటు చేసిన టైల్స్, సున్నపు పొరలను శాండ్బ్లాస్టింగ్ ద్వారా తొలగించే ప్రక్రియ చేపట్టారు. అదే విధంగా భారీ షెడ్లు ఏర్పాటు చేయటంతో ఆలయప్రాంగణం రూపురేఖలు కోల్పోయి సహజత్వానికి భిన్నంగా దర్శనమిస్తోంది.