పాత నోట్లు.. మరో వారం?
కేంద్రప్రభుత్వం రద్దు చేసిన రూ. 500, 1000 నోట్ల చెల్లుబాటును మరో వారం లేదా పదిరోజుల పాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టోల్ ట్యాక్స్ రద్దును నెలాఖరు వరకు పొడిగించిన ప్రభుత్వం.. ఇతర అత్యవసర సేవలు, ప్రాథమిక అవసరాలకు పాత నోట్ల చెల్లుబాటును కూడా పొడిగించవచ్చని సమాచారం. వాస్తవానికి గురువారం అర్ధరాత్రితో పాత నోట్ల చెల్లుబాటు గడువు ముగిసిపోతుంది. అయితే, ఇప్పటికి ఇంకా పూర్తిగా కొత్త నగదు అందుబాటులోకి రాకపోవడం, బ్యాంకులు.. ఏటీఎంల వద్ద క్యూలైన్లు పెరిగిపోతూనే ఉండటంతో మరికొన్నాళ్లు పాత నోట్లను చెల్లుబాటయ్యేలా ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తదితరులు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారని సమాచారం. ప్రస్తుత పరిస్థితులను అందులో సమీక్షించారని అంటున్నారు.
ప్రధానంగా రైతులకు, వ్యవసాయ రంగానికి మరింత ఊరట కల్గించే చర్యలు ప్రకటించవచ్చని అంటున్నారు. పాతనోట్లు ఉన్నవాళ్లు వాటిని రైల్వే టికెట్ కౌంటర్లు, బస్ టికెట్ కౌంటర్లు, ప్రభుత్వ లేదా ప్రభుత్వరంగ కార్యాలయాలు, విమానాల టికెట్ కౌంటర్ల వద్ద ఉపయోగించే అవకాశం ఈ అర్ధరాత్రి వరకు ఉంది. దాంతోపాటు గ్యాస్ సిలిండర్ల కొనుగోలు, మందుల కొనుగోలు తదితర అవసరాలకు సైతం పాత నోట్లను వినియోగించుకోవచ్చు. ఇప్పుడు దీన్నే మరో వారం లేదా పది రోజుల పాటు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.